Monday, 14 September 2015

నువ్వొస్తావో రావో అని..

నదిలో 'అల'జడిలా..
నా మదిలో అలజడి..
నువ్వొస్తావో రావో అని..
ధ్వజస్తంభం వెనుక నిలుచుని నువ్వు చూసిన చూపు..
ప్రదక్షిణలు చేస్తున్న నా వీపు తడిమింది..
ప్రసాదం పంచే నెపంతో తాకిన వేళ్ళు..
నా ఒళ్ళు జలదరింప చేశాయ్..
ఎంత తెగువ నీకు..
నా ఎదుట పడటానికి
కుంకుమ నెపంతో..
పలకరించడానికి..
రుస రుసగా చూసినా.. ఎందుకా చిరునవ్వు
నా మనసెరిగినట్టు.. నన్ను కనిపెట్టినట్టు..
మగువ కొంటె చూపుకు మగాళ్లు పడతారని..
ఎవరన్నారు..?
నీ కంటి చివర కాంతిని చూస్తే..
ఆ నానుడి .. సరిదిద్దుకోరూ..
గుడి దాటుతూ.. నే చూసిన చూపు..
నీకు తెలుసు నీ కోసమే అని..
అందుకే వెదుకుతున్నా..
గాలిలో నీ రాక సవ్వడి కోసం..
గుడి గంట మోగింది..
నువ్వొచ్చావా.. ఏమో
అది నా గుండెచప్పుడా..?
పిచ్చీ...!

--నాగ్

No comments:

Post a Comment