Sunday, 13 September 2015

వాళ్లు జ్ఞాపకాలు చల్లుతున్నారు..
మధుర క్షణాలను భద్రపరుచుకుంటున్నారు..
ఎప్పుడో.. ఒకరోజు..
జీవిత సంధ్యా సమయంలో..
బాదంచెట్టు నీడన పడక కుర్చీలో కూర్చుని..
రాలుతున్నఎర్రని బాదం ఆకులను చూస్తూ
నెమరేసుకోడానికి...
మనసు తీపి చేసుకోడానికి..
గురుతులను దాచేస్తున్నారు..

ఇప్పుడు వాళ్లకి ఆనందపు క్షణాల కొరత లేదు..
ఉదయం లేచిన దగ్గర నుంచీ..
నేస్తాలతో చెట్టాపట్టాలేసుకుని..
పొలంగట్టుమీద.. మంచుతో తడిచిన పసిరిక..
పాదాలను గిలిగింతలు పెడుతుంటే..
సైకిలు చక్రం పోటీలో అలసి చమటలు కక్కే వెళ..
దిగుడుబావి సేద తీర్చుతుంటే..
కాలువ ఇసుకలో గుజ్జన గూళ్లు ఆడేక్షణాన..
అమ్మ పిలిచి గోరుముద్దలు పేడుతుంటే..
ఆనందపు క్షణాలకు కొదవేముంది.
అందుకే కొన్ని స్మృతులను దాచేస్తున్నారు..
దాచిన జామకాయను గుర్తొచ్చి తిన్నట్టు..
అగ్గిపెట్టిలో గొంగలీ పురుగు సీతాకోక చిలుక అయినట్టు..
ఎప్పుడో మళ్లీ వీటిని ఏరుకోడానికి..
తలచి తలచి ఆనందించడానికి..
మనసు అట్టడుగు పొరల్లో..
సంఘటనలను పదిల పరుస్తున్నారు..
ఆనంద క్షణాలను బొంగరంలా..
ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తున్నారు..
వాళ్లు మధుర స్మృతుల దొంతరలను
మనసు పెట్టిలో పెట్టి.. తాళం వేసేస్తున్నారు..

--నాగ్
ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment