Sunday 28 August 2016

చలం సమాధి arunachalam

 తెలుగుభాష, తెలుగు ప్రకృతి, ఉన్నన్నాళ్ళు చలం రచనలు ఉంటాయి.
 -- విశ్ఫనాథ సత్యనారాయణ
మహాప్రస్థానం ముందు మాటలో చలం అంటాడు(రు) "ఇదంతా.. చలం గొడవ.."ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి  శ్రీ శ్రీ అర్ణవంలో పడండి.." 

అరుణాచలం వెళ్లాను..
వెళ్లిన రోజే..  అరుణాచలేశుని దర్శనం చాలా సుళువుగానే అయ్యింది.. గిరిప్రదక్షిణ పూర్తి అయ్యింది అదే క్రమంలో  రమణ మహర్షి సమాధీ చూడగలిగాను..
అదేం చిత్రమో.. చలం సమాధిని కనుక్కోవడం కష్టమైపోయింది..
ఎవరిని అడిగినా సమాధానం లేదు..
రమణాశ్రమంలో సుమారు 30 ఏళ్ల పాటు ఆయన తన కుటుంబంతో జీవించారు కదా..
ఈ గాలిలో .. ఆయన శ్వాస.. ఈ నేలపై ఆయన స్పర్శ వుంటుంది కదా..
అందుకే..
చలం చివరి రోజులు గడిపిన రమణాశ్రమంలో అడిగి చూశాను..
 ఆశ్చర్యం పావలా సమాచారం కూడా దొరకలేదు.. 
"చలం గురించి ఇక్కడ ఏమీ లేదు.. మీరు వెదికినా దొరకదు.." అని తేల్చి చెప్పారు..
ఆశ్రమం పుస్తకాలు అమ్మే బాండాగారంలో తెలుగు తెల్సిన ఒకాయన వున్నారని తెల్సింది.. 
వీళ్లంతా తమిళం గోల.. తెలుగు ఆయనకు మన తెలుగు మహా రచయిత గురించి తెలిసే వుంటుంది.. ఎంతైనా తెలుగు వాడు కదా అని భావించి ఆయన దగ్గరికి వెళ్లాను..
ఆయన ఒకే మాట చెప్పారు.. రమణుల గురించి అడగండి ఎంతైనా చెబుతాను.. ఆ చలం గారి గురించి చెప్పడానికి. చూపించడానికి ఇక్కడ ఏమీ లేదు..
మీరు ఇంకా లోతుకు వెళ్తే ఆయన ఎవరూ అని కూడా అడుగుతారు ఇక్కడి వాళ్లు అని చెప్పారు..
అదేమిటీ.. చలం గారు ఇదే ఆశ్రమంలో గడిపారు కదా.. ఆయన వున్న గది.. ఆయన వాడిన వస్తువులు అలాంటివేవైనా వుండాలి కదా అని అడిగితే.. అదెప్పటి మాటండీ.. అవేవీ ఇప్పుడు లేవు..
ఎందరో వస్తుంటారు ఆశ్రమానికి అని సమాధానం వచ్చింది..
సరే ఆయన సమాధి ఎక్కడ వుందో అదైనా చెప్పండి అని ప్రాథేయపడ్డాను..
ఆయన సమాధి ఆశ్రమానికి అవతలి వైపున వుండాలండీ.. నేనూ చూడలేదు.. ఎవరో చెబితే విన్నాను.. నేను ఆశ్రమం వదిలి బయటికి వెళ్లను అందుకే కచ్చితంగా తెలీదు అని చెప్పారు..
నిజంగా నాకు కళ్లంటా నీళ్లు తిరిగాయి..
తెలుగు దేశాన్ని తన అక్షరంతో కదిలించిన రచయిత..
తన భావజాలంతో కరుడు కట్టిన సంప్రదాయాలను పెకలించిన సంస్కర్త..
మొక్కవోని అభిప్రాయాలతో ఎన్నో చర్చలు... వాదోపవాదాలకు తెరతీసిన మేథావి..
ఆయన గురించిన చిన్న సమాచారం కూడా ఇక్కడ దొరకడం లేదు..
సరే విచారంగా బయటికి వచ్చేశాను..
ఈ లోగా నేను అరుణాచలంలో వున్నానని ఎఫ్ బి లో పోస్టు ద్వారా తెలుసుకున్నమిత్రులు మణి భూషణ్ గారు మెస్సేజ్ పెట్టారు.. అరుణాచలంలో తనకు తెల్సిన వారిని కలిసి యోగక్షేమాలు తెలుసుకోమని.
సరే ఇక నాకు అరుణాచలం లో మరేదీ చూడాలన్న ఆసక్తి కనిపించలేదు.. మణిగారు ఇచ్చిన అడ్రస్ ఆథారంగా వారికి తెలిసిన వారి ఇంటికి వెళ్లాను.. అక్కడ చెప్పారు.. 
అరుణాచలంలో చలం గురించి ఎవరికీ ఏమీ తెలీదని.. తెల్సిన వాళ్ళు చాలా వరకూ చనిపోగా.. మిగిలిన వాళ్లు మరిచిపోయారని..
అంతా అక్కడ రమణ మయం అంతే..
సరే వారినే తరిచి తరిచి ప్రశ్నిస్తే చిన్న సమాచారం లభించింది.. రమణాశ్రమం రోడ్డు దాటి కొంత దూరం వెళ్తే వినాయకుడి గుడి వస్తుందని అక్కడే ఎక్కడో వుంటుందని చెప్పారు..
మళ్లీ ఆశ చిగురించింది..
నాతో వచ్చిన మిత్రులు రాలేమని చేతులెత్తేశారు.. ఒంటరిగానే బయలు దేరాను..
కొంత దూరం వెళ్లగానే వినాయకుని ఆలయం కనిపించింది.. అక్కడ పంతులు గారిని వచ్చీరాని హింధీలో అడిగాను చలంగారి సమాధి గురించి.. 
ఈలోగా అటు వెళ్తున్న ఒక యువకుడు ఆగాడు.. తెలుగులో అడిగాడు నన్ను చలంగారి సమాధా అండి.. నేను నిన్ననే చూశాను అదిగో ఎదురుగా కొంత దూరంలో  నిమ్మసోడా బండి కనిపిస్తుంది కదా.. అక్కడే వుంది చూడండి అని చెప్పాడు..
హమ్మయ్యా.. అని పరుగులాంటి నడతో అక్కడికి చేరుకున్నా..
మెయిన్ రోడ్డుకు పక్కనే తెల్లని సున్నం వేసి వున్నాయి రెండు సమాధులు..
ప్రశాంతంగా.. నిరాడంబరంగా.. చూట్టూ చిన్న పిట్టగోడ.. సమాధి మీద ఓ శివలింగం..
చూడగానే కళ్లంటా నీళ్లొచ్చాయి..
ఎన్నో మెదళ్లను కదిలించి.. ఎన్నో హృదయాలను కొల్లగొట్టిన మహా రచయిత..  సమాధి..
ఎన్నో విమర్శలు.. బహిష్కరణలు.. వెలి దండనలు ఎదుర్కొని.. సమాజాన్ని ధిక్కరించి నిలిచిన యోధుని చివరి మజిలీ..
చేతులతో తడిమాను.. చల్లగా.. స్పర్శనాడులను స్పందింప చేస్తూ..
కొంతసేపు అక్కడే నిలుచున్నాను..కూర్చున్నాను.. అటూ ఇటూ తిరిగాను..
అంతకు మించి ఏం చేయాలో తెలీలేదు..
అక్కడే నిమ్మసోడా అమ్మే అతను చెప్పాడు.. ఈ మధ్యనే గవర్నర్ రోశయ్య గారు అక్కడికి వచ్చారట..
చలం స్మారక మందిరం కట్టిస్తామని.. అరుణాచలంలొ ఆయన జ్ఞాపకాలు పదిల పరుస్తామని చెప్పారట.. అలా చెప్పే చాలా కాలం అయ్యిందట..  ప్చ్..

-- సరిదే నాగ్
ఫోటోలు : రుషి చలం, ఆయన థర్మపత్ని రంగనాయకమ్మ గార్ల సమాధి