Saturday 24 September 2016

గుజ్జగూళ్లు.. సైకతంలో రూపుదిద్దికున్న కలల సౌధం

చిన్ని చేతులు కట్టిన హార్మ్యాలు..
బుజ్జి మనసుకు తోచిన ఆర్కిటెక్చ్ లు
చిన్నారి చమటతో రూపుదిద్దికున్న ఆలయాలు..
తడి ఇసుకలో పూసిన పూలు..  గుజ్జగూళ్లు..

ఇసుక గుట్టలో చేయి పెట్టి.. 
మరోచేతిని తాపీగా చేసి..
నైపుణ్యం రంగరించి..
ఆటవిడుపుతో కట్టుకున్న పొదరిల్లు

చుట్టూ ప్రహరీ..
గోపురంలా నిలిచిన నిర్మాణం
ఆ పక్కనే పడక గది.. ఆ తర్వాత వంట గది..
ఇంటి ముందు వనం.. ఇంకా స్నానాల కుండీ..

చిట్టి మనసుకు తోచిన  స్వప్నం 
సైకతంలో  రూపుదిద్దికున్న కలల సౌధం
బుడతల కళ్లల్లో ఆనందం..
మయుడికి సైతం లేదు ఆ చేతుల నైపుణ్యం

ఓ భగవంతుడా.. ఓ వరమివ్వు..
నీకు చేతనైతే ఓ టైం మిషన్ నాకివ్వు..
 నన్నా వయసుకు వెళ్లనివ్వు..
అక్కడికెళ్లాక ఆ మిషన్ తగలబడిపోనివ్వు..
నన్ను అలానే వుండిపోనివ్వు.. కల్మష మెరుగని ఆ నవ్వు నాకివ్వు
 
-- సరిదే నాగ్
ఫోటో : రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో తీసింది.
చిత్రం ఏమిటంటే.. ఇదే గ్రౌండ్ లో ఓ పక్క బాక్సెట్ బాల్ ఆడుతున్నారు. మరో పక్క ఇంకొంత మంది పిల్లలు  వాలీబాల్.. ఈ ముగ్గురు స్నేహితులు మాత్రం శ్రద్దగా గుజ్జనగూళ్లు కడుతున్నారు. వాళ్ల ఆనందం శ్రద్ద చూసి నాకు ముచ్చటేసింది.. టైం మిషన్ లో దూరి వాళ్ల వయసుకు పారిపోవాలనిపించింది.. ఆ వయసుకు వెళ్లాక టైం మిషన్ పాడైపోవాలని భగవంతుడిని కోరుకోవాలనిపించింది..
ఈ దృశ్యం చూశాక నాకో నెల రోజులు ఆయుస్సు పెరిగినట్టనిపించింది..

నోట్ : నచ్చితే షేర్ చేయండి.. కానీ నా భావాలు కాపీ చేయొద్దు ప్లీజ్


Wednesday 21 September 2016

గోల్కొండ Golkonda port

ఆ మధ్య గోల్కొండ చూసినప్పుడు అక్కడ ఒక విషయం నాకు ఆసక్తి అనిపించింది
అవే శవ స్నాన వాటికలు.
కోట దిగువ భాగాన దక్షిణ దిశగా వాటిని నిర్మించారు. పర్షియన్ టర్కిష్ శైలిలో వీటి నిర్మాణం వుంది 
ఈ స్నాన గదులను రాజ కుటుంబంలో చనిపోయిన వారి మృతదేహాలను ఖననం చేయడానికి ముందు పవిత్ర స్నానం చేయించడానికి నిర్మించారుట.  ఈ గదులలో చల్లని, వేడి నీళ్లు ప్రవహించే స్నానపు తొట్టేలు ఏర్పాటు చేశారు. 
వాతావరణానికి అనుకూలంగా మృతదేహాలను వేడి, చల్లని నీళ్లతో స్నానం చేయించి అలంకరించేవారట.  
ఈ తొట్టేల్లోకి నీరు నేరుగా ప్రవహించడానికి ఏర్పాట్లు చేశారు. అదీ కన్ షీల్ద్ చేసిన పైపుల ద్వారా నీరు తొట్టెల్లోకి వచ్చే ఏర్పాటు ఆ రోజుల్లోనే చేయడం విశేషమే.
 ఈ స్నానపు గదులు అధునాతన సౌకర్యాలతో వుండటం ఆశ్చర్యం కలిగించింది.
గోల్కొండ నిర్మాణాల్లో ఇదో అద్భుత నిర్మాణంగా చెప్పొచ్చు. 

-- సరిదే నాగ్
ఫోటోలు:  గోల్కొండ కోట లోని శవ స్నాన గదులు 


Sunday 18 September 2016

Kolleru Birds _ Aatapaka_ Wsest Godavarai కొల్లేటి పక్షులు, ఆటపాక

సృష్టిలో అద్భుతాలకు కొదవలేదు.. 
అలాంటిదే కొల్లేటి అతిథి.. కొల్లేటి కొంగ
ఆస్ట్రేలియా, సైబీరియా దేశాల నుంచి ఈ కొంగలు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో పశ్చిమగోదావరి జిల్లా కైకలూరు సమీపంలోని ఆటపాక బర్డ్ సాంచ్యురీకి వలస వస్తాయి..
అంటే కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి ఇవి ఎగురుతూ గుంపులు గుంపులు గా వస్తాయి.
కొల్లేరు ప్రాంతంలో వీటి కోసం ప్రత్యేక గూళ్లు, ఏర్పాట్లు చేశారు. పక్షులు అక్కడే సుమారు ఆరు నెలలు పాటు కాపురం వుంటాయి. ఇక్కడే జత కట్టి.. గుడ్లు పెట్టి.. పొదిగి.. పిల్లలు అయ్యాక అవి ఎగరడం ఆరంభించగానే ఫిబ్రవరి, మార్చి నెలల్లో తిరిగి తమ దేశాలకు పిల్లలతో సహా వెళ్లిపోతాయి.
తిరిగి మరుసటి సంవత్సరం ఇదే సీజన్లో ఇక్కడికే వస్తాయి.
ఈ పక్షులు చాలా పెద్ద సైజులో వుంటాయి.. పొడవు ముక్కు గూడ కలిగి వుంటాయి. 
ఒక్కో పక్షి రోజుకు సుమారు 500 కి. మీ దూరం ప్రయాణిస్తాయట. అన్నీ ఒకేలా గుంపుగానే ప్రయాణిస్తాయి. 
అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ఆస్ట్రేలియా నుంచి  కొల్లేరు చేరే లోగా ఎన్నో దేశాలు ఈ పక్షులు దాటుతాయి.. ఇంకా ఎన్నో కొలనులు, నదులు, అడవులపై నుంచి ఇవి ప్రయాణిస్తాయి.. అయినా అలవాటు ప్రతి సంవత్సరం ఈ కొల్లేరు ప్రాంతానికే అవి గుర్తుపెట్టుకుని రావడం. 
అలాగే పిల్లలా మారి వెళ్లిన పక్షి.. తిరిగి గుడ్లు పెట్టడానికి ఇక్కడికే రావడం ఎలా సాధ్యమో అంతుబట్టని వింతే..
ఇది కొన్ని వందల ఏళ్ల నుంచి సాగుతోందని కొల్లేటి వాసులు చెబుతున్నారు.
వేలాదిగా తరలి వచ్చే ఈ పక్షుల కోసం ఆటపాకలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ పక్షులను వేటాడటం వాటి ఏకాంతానికి భంగం కలిగించడం నిషేదం.  
ఏమైనా ప్రకృతి అద్భుతాల్లో ఈ కొల్లేరు అతిథి మరో అద్భుతం.
కొల్లేరు సుమారు 77వేల ఎకరాలట. తొమ్మిది మండలాలు. అయితే పక్షులు మాత్రం ఈ ఆటపాక ప్రాంతంలోనే ఎక్కువ కనిపిస్తాయి.
ఇక మిగిలిన కొల్లేటిలో స్థానికంగా అరుదైన పక్షులు 
ఈ పక్షులకు కొల్లేరు పుట్టినిల్లుగా చెప్పొచ్చు.
హింధూ సంప్రదాయంలో మహిళ కాన్పు కోసం పుట్టింటికి వెళ్లినట్టే ఈ పక్షులూ పుట్టింటికి వస్తున్నాయేమో..!!!
-- సరిదే నాగ్
ఫోటో :








కొల్లేటి పక్షులు, ఆటపాక వద్ద తీసింది
నోట్ : నచ్చితే షేర్ చేయండి.. కాపీ మాత్రం చేయొద్దు

Sunday 4 September 2016

గొప్పోడివయ్యా సామీ..

గొప్పోడివయ్యా సామీ..
గరికకు పూజాధికారమిచ్చావు..
ఎలుకకు ఏనుగు బలమిచ్చావు..
చప్పిడి కుడుమును ప్రసాదం చేశావు
భలేవాడివయ్యా.. సామీ..
తలేమో ఓ రాక్షసుడు..
వాహనం ఇంకో రక్కసుడు..
నీ చుట్టూ గణాలు.. విఘ్నాలు..
అయినా తొలి పూజలందుకునే వేల్పువి..
ఎట్టాగయ్యా నిన్ను నమ్మేది..
.
తలెత్తి చంద్రుడిని చూసిన కృష్ణుడిని కూడా అపనిందల పాల్జేశావు..
పకపకలాడే చంద్రుడిని ఒంటిగాడిని చేసేశావ్
అయ్య మెడలో పామును నడుముకు చుట్టేసుకున్నావు
అమ్మా అయ్యా చుట్టూ తిరిగేసి.. తమ్ముడిని ఓడించేశావు..
గొప్పోడివయ్యా సామీ..
పశువులు తినే ఆకులు అలమలుతో పూజన్నావు
పళ్లూ కాయలతో పాలవెళ్లి కట్టించావు..
కథ మొత్తం చదవందే పూజ పూర్తి కాదని కిరికిరి పెట్టావు
చలిమిడి వడపప్పుతో సరిపెట్టుకుంటావు...
భలేవోడివయ్యా సామీ..
సిక్స్ ప్యాక్ ల కాలంలో.. ఫ్యామిలీ ప్యాక్ తో నువ్వు
వీధికో పది కుక్కలున్న మా మధ్య నీ ఎలకతో..
తొమ్మిది రోజులు ఎలా వుంటావయ్యా..
డ్రైనేజీ కంపు.. దోమల రొథ.. సినిమా పాటల భజన..
గంటకో పాలి పోయే కరెంటు.. వానా కాలంలోనూ ఉక్కపోత వెదరు
వీధి వీధినా బాసిమటం ఏసుకుని కూర్చుంటావ్..
తొమ్మిదో రోజున మురికి నీళ్లలో ముంచేస్తామని తెలిసీ ..
మామీద ప్రేమతో ఎలా వుంటావయ్యా..
అమాయకపు సామీ..
ముంచేస్తారని తెలిసీ అయిదేళ్లకో పాలి ఓట్లేసే మా అసుంటోడివే సుమా..
-- సరిదే నాగ్
నోట్ : ఏదో సరదాగా రాసింది సీరియస్ గా తీసుకోకండి.. అలాగే కాపీ కూడా చేయకండి..
ఫోటో : చంద్రగిరి మ్యూజియంలో తీసింది