Wednesday 7 October 2015

దేవీపురం..


దేవీపురం..
విశాఖ జిల్లా అనకాపల్లికి 13 కి. మీ దూరంలో వున్న పుణ్యక్షేత్రం
ఇక్కడి అమ్మవారు సహస్రాక్షి రాజరాజేశ్వరీ మాత, కామాఖ్య దేవిగా.. కళా వాహనగా
భక్తులకు దర్శనిమిస్తున్నారు..
యోని ఆకారంలో అమ్మవారు ఇక్కడ పూజలందుకోవడం విశేషం..
ఈ ఆలయంలోకి ప్రవేశించగానీ కుడివైపున దత్తాత్రేయుని ఆలయం ఆకర్షిస్తుంది..
దత్తుడు పాలరాతి విగ్రం వెనుక స్వామి స్వప్రకాశనంద దత్త అవధూత విగ్రహం ఆకట్టుకుంటుంది..
హఠాత్తుగా చూస్తే.. స్వామి ఆశీనుడై ఆశీర్వధిస్తున్న బ్రాంతి కలుగుతుంది..
స్వప్రకాశనంద అవధూత ప్రస్తుత దేవీపురం గురూజీ అమృతానంద నాధ సరస్వతి వారి గురువులుగా చెబుతున్నారు..
మరో విశేషం ఏమిటంటే.. హుధుత్ తుపాను విశాఖ జిల్లాను ఎంతగా పట్టి కుదిపిందో తెల్సిందే.. ఆ తుపాను సమయంలో అడవిలోని భారీ వృక్షాలు పట్టణంలో భారీ నిర్మాణాలు కుప్పకూలినా ఈ దత్త మందిరం గానీ అవధూత విగ్రహం కానీ చెక్కు చెదరలేదట... కనీసం ఒరగను కూడా లేదని
భక్తులు చెబుతున్నారు..
ధన్యవాదాలు
--నాగ్
ఫోటో.. స్వామి స్వప్రకాశానంద అవధూత

Monday 21 September 2015

లక్ష్మణ్ కుమారుడు చెప్పిన ప్రవర

ఆయన జగమెరిగిన క్రికెటరు..
దేశ విదేశాల్లో తన బ్యాట్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన బ్యాట్సు మెన్..
ఎన్నో సంస్కృతులు.. సంప్రదాయాలు చూసి వుంటాడు..
అయితేనేం.. 
తన పిల్లలను చక్కని క్రమశిక్షణతో పెంచాడు.. సంప్రదాయాన్ని దాటిపోలేదు..
ఆయనే వివి ఎస్ లక్ష్మణ్
ఆయన కుటుంబ సమేతంగా సోమవారం పాదగయను సందర్శించారు..
దర్శనాదులు పూర్తి అయ్యాక..
పండితుల ఆశీర్వచనం కావించారు..
ఆ సమయంలో
లక్ష్మణ్ కుమారుడు సర్వజిత్ 
పండితులకు తాంబూలం సమర్పిస్తూ..
శాస్త్రోక్తంగా.. తన గోత్రాధి పరంపరను ప్రవరను వల్లించిన తీరు అద్భుతం అనిపించింది..
ఈ మధ్య సామాన్యులు సైతం..
ఇంగ్లీషు మీద మోజుతో తమ పిల్లలకు కాన్వెంటు చదువులు చెప్పిస్తున్నారు.. ఆ సంస్కృతికే అలవాతు పడితోతున్నారు.. మన సంప్రదాయాలను విస్మరిస్తున్నారు..
ఈ క్రమంలో ప్రముఖ క్రికెటర్ అయినా అక్ష్మణ్ కుమారుడు
శాస్త్రోక్తంగా చెప్పిన ప్రవర అద్భుతంగా తోచింది..
ఆ చిన్నారు..
"ప్రవారుషే
ఆంగీరస భారహస్పస్య బారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రహ:"
అంటూ.. (తప్పులుంటే పండితులు క్షమించాలి) ప్రవర చెప్పి
పెద్దలకు నమస్కరించే విధానం.. చక్కగా తోచింది..
పైగా కుటుంబం మొత్తం శాస్త్ర బద్దమైన వస్త్ర ధారణలోనే వున్నారు..
ఎంత మంది ఆయనతో ఫోటోలు దిగినా చాలా ఓపికగా సహనంతో నడుచుకున్నారు..
అందుకే టెస్ట్ కింగ్ అయ్యాడు..
ఎదిగినా ఒదిగడం.. గొప్పవారి లక్షణం..
--నాగ్
నోట్ : నచ్చితే షేర్ చేయండి.. కానీ కాపీ చేయొద్దు..
ఫోటో :చెవులు పట్టుకుని వినయంగా ప్రవర చెబుతున్నవివిఎస్ లక్ష్మణ్ కుమారుడు

Friday 18 September 2015

కలలో అయినా

కలలో అయినా
నిను చూద్దామని..
కనులు మూసా..
కన్నీళ్లొచ్చి..
కలను పాడు చేశాయి..
పాపం కన్నీళ్లకే తెలుసు..
మనసు చెబితే..
ఉబికొచ్చాయి..
మనసుకు మాత్రం ఏం తెలుసు
నిను చూస్తానన్న ఆతృతలో..
ఏమో ఒక్కోసారి..
నా మనసు కూడా నాకు చేటే చేస్తోంది..
నాకు తెలీకుండా..

--నాగ్

నేస్తమా..





ఈ కథ.. ప్రజాశక్తి  ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది..
--నాగ్

వయ్యారాల గోదావరి


వయ్యారాల గోదావరి ని
చూసి..
సూర్యుడు సిగ్గుతో
ఎర్రబారాడు..
సంధ్య చీకట్ల మాటున
నది పాయల్లో దూకి
ముఖం దాచుకున్నాడు

ఫోటో: యానం బ్రిడ్జి మీద నుంచి 19-8-2015 న తీసింది..

--నాగ్

పచ్చిక పాన్పు చేసి..

పచ్చిక పాన్పు చేసి..
ఎదనే దిండుగ మలిచి..
ఊఫిరి వింజామరతో.. 
సిద్దం 
పవళీంపకగ రావా ..

--నాగ్

సెలవిక.. కిర్రు కిర్రు శబ్దాలు..

సెలవిక..
కిర్రు కిర్రు శబ్దాలు..
ఇనుప చక్రాల హాహా కారాలు..
తుప్పు రేకుల ఘీంకారాలూ..
సెలవిక..
అన్నీవదిలి వెళ్తున్నానిక..
సత్తువు ఒడిగి.. బొమికలు మిగిలి..
ప్రాణమున్న తిత్తిలా.. వెళ్తున్నానిక

వస్తాడొకడు.. మీకు తోడుగా..
కర్కశ ఇనుప చక్రాల మధ్య..
కండలు కరిగించేవాడు..
తన వేడి ఊపిరి ఆవిరి మధ్య
సలసల బాయిలర్ల మండించేవాడు
క్తం మరిగించి.. యంత్రం నడిపేవాడు..
వస్తాడొస్తాడింకొకడు..
నరాలు మెలిపెట్టి.. చక్రం తిప్పి
యంత్రపొగల ఆవిరులకి
ఊపిరి తిత్తులు ఫణంగ పెట్టి..
గుండెను అరగతీసి.. బెల్టులు తిప్పి..
యంత్ర భూతాల మధ్య..
ఇనుప పిశాచాల కోరలకు కండలు ఎరగా వేసే
ఇంకొకడొస్తాడు..

బకాసురిడికి రోజుకొక్కడే..
లాభాల పిల్లలు పెట్టే.. ఖార్కానాశురుడి ఆకలికి ఎందరో..
అయినా..
వస్తాడింకొకడు..
తన ఆయువు.. ముద్దకట్టి
నీకు బలి ఇచ్చేందుకు..
అణాకానీ కూలికి.. బతుకంతా చాకిరీ చేసేందుకు..
చమట దారలుసైతం లెక్క చేయక..
వరుసలో నిలబడి మరీ..
వస్తాడింకొకడొస్తాడు..

యంత్ర రాక్షసుల ఇనుప కోరలెన్ని ఏళ్లు తోమినా..
రబ్బరు బెల్టులు తెగి వాతలు తేలినా..
కణ కణ మండే నిప్పురవ్వలు ఎగిరి పడినా..
రోజు సగం గడిచి.. పూట పస్తులున్నా..
చివరికి ఏమీ సాధించలేక..
బతుకు సమరంలో ఓడిన సైనికుడిలా..
తలవాల్చి నేను వెళ్తున్నా..

వస్తాడింకొకడు నా చోటులో..
బలిపశువు కాడానికి..
ఫ్యాక్టరీ సైరన్ విని పరుగు పరుగున..

--నాగ్

రాకోయి.. అనుకోని అతిథి..

రాకోయి.. అనుకోని అతిథి..
నిజమే..
ఇలాంటి అతిథులు రాకుండా వుంటానే మంచిది
ఆ మధ్య చాలా పెద్ద జెర్రి వచ్చింది..
అదే వచ్చింది నేను రాకపోతే ఎలా అనుకుందో ఏమో..
తేలు గారు కూడా ఇదిగో పది నిమిషాల క్రితమే మా ఇంటికి వేంచేశారు..
సరే.. చెప్పు సత్కారం చేశామనుకోండి..
తేలు మృతదేహాన్ని మా చెల్లి పెరట్లో కప్పెట్టింది..
ఎందుకంటే.. కొన్ని రోజులు పోతే అక్కడ తేలు పూసలు వస్తాయట.
అవి చిన్నపిల్లల మొలలో కడితే.. గాలీ ధూలి, దిష్టి ఇత్యాది వి సోకవట.
సరే.. మూఢనమ్మకం మాట అటుంచి..
తేలు గారి మృతదేహానికి ఈ విధంగా అయినా అంత్యక్రియలు జరిగినందుకు ఆనందించాను..
వారు స్వర్గానికి వెళ్తారో.. నరకానికి వెళ్తారో తెలీదు కానీ..
మరోమారు మాత్రం మా ఇంటికి రారు..
ఇప్పుడు ఇంకో భయం పట్టుకుంది..
మొన్న జెర్రి.. ఈరోజు తేలు.. రేపు పాము గానీ వస్తుందేమో.. ఖర్మ..
--నాగ్

అప్పుడే వెలుగు చూశాను..

అప్పుడే వెలుగు చూశాను..
అమ్మ పొత్తిళ్ల వెచ్చదనం చూశాను..
ఎవరో వచ్చారు..
అమ్మపొత్తిళ్ల నుంచి నన్ను తీసి..
"అరే.. 'ఆడ' పిల్లరా అన్నారు
అప్పుడే తెల్సింది నా పేరు ఆడపిల్లనని..
ఆ కంఠంలో నిరుత్సాహం చెప్పింది..
నేనంటే వాళ్లకి ఇష్టం లేదని..
నేనేం చేశాననీ..

అప్పటి నుంచీ అంతా 'ఆడ' పిల్లే అన్నారు
ఈడ పిల్లను కాదట..
పరుగెత్తొద్దన్నారు..
గెంతెద్దన్నారు..
పగలబడి నవ్వొద్దన్నారు..
సైకిల్ నేర్చుకో వద్దన్నారు..
చెట్టెక్కొద్దన్నారు..
ఫ్యాంటు వేసుకోకూడదట..
కాలు మీద కాలేసుకోకూడదట..
అవన్నీ తమ్ముడి హక్కులట..
నా మీద ఎందుకింత కచ్చటా..

జారిపోయే ఓణీ అట..
ఒరుసుకు పోయే పట్టీలట..
ముక్కుకీ.. చెవులకీ కన్నాలట..
ఏమిటీ శిక్షా అంటే..
పొలం పనొద్దట.. వంట పని నేర్చుకోవాలట
వచ్చేవాడికి అవన్నీ ఇష్టమట..
ఇక్కడా ఆడదానివి కాదూ..
అదే మాట..
చిత్రం ఇవన్నీ చెప్పేదీ.. మరో ఆ... డదే..

అక్కడ అమ్మా నాన్నకి సేవ..
ఇక్కడ అత్తా మావకీ సేవే..
అక్కడ అన్నా తమ్ముడు దాష్టికం
ఇక్కడ మొగుడుగారి డాంభికం
పుట్టిన చోట ఆడ పిల్ల అన్నారు..
పెళ్లైనా అదే మాటా.. ఆడది..
ఇంతకీ నేను ఏడ దానినీ..
(ఓ సోదరి కన్నీటి ప్రశ్న.. సమాదానం తెలిస్తే చెప్పండి ప్లీజ్)

--నాగ్

ఖాకీ వ్రతలక్ష్మిలు


// ఖాకీ వ్రతలక్ష్మిలు
//
కరుడు కట్టిన నేరస్తులను అదుపు చేసినా..
వారూ.. సగటు మహిళలే..
కఠిన లాఠీలు చే బూనినా..
వారివీ మట్టి గాజుల చేతులే..
ఒంటిపై ఖాకీ దుస్తులే వున్నా..
వారిదీ ఎర్రంచు పట్టు చీర మనసే మనసే..
విధి నిర్వహణలో కచ్చితత్వం వున్నా..
వారికీ వ్రతాలంటే మక్కువే..
అంత మంది ముత్తైదువుల మధ్య..
వారికి మాత్రం మనసవ్వదూ..
అందుకే ఒదిగిపోయారు చక్కగా..
చీరల మధ్య ఖాకీ వ్రత లక్ష్ముల్లా..

నోట్ : పాదగయా క్షేత్రంలో డ్యూటీ అనంతరం చివరి బ్యాచ్ లో మహిళా కనిస్టేబుళ్లు వ్రతం చేసుకున్నారు. అప్పటికి జనం పూర్తిగా తగ్గిపోయారు. డ్యూటీ నుంచి నేరుగా వారు ఆలయానికి వచ్చి వ్రతంలో పాల్గొన్నారు

--నాగ్

ఎదురు చూపు.. ఎంత సేపూ..

ఎదురు చూపు..
ఎంత సేపూ..
వెన్నెల చల్లగా.. ఆకాశాన్ని కమ్మేసింది..
మొగ్గ కలువ.. విచ్చి పువ్వుగా మారింది..
గువ్వల జంట గూటిలో కువకువలాడుతున్నాయి..
చిరుగాలి చల్లగాలిగా మారింది..
చిమ్మచీకటి పరుచుకున్న ప్రకృతి..
వెలుగు జాడకోసం వెదుకులాడుతోంది..
పగటి వెలుగులో పరుగులెత్తిన సెలయేరు..
వెన్నెలను చూసి మందగమని అయ్యింది..
ఎంత సేపు.. ఎదురు చూపు..
కుందేటి పరుగు.. నీ అడుగు శబ్దమనుకున్నా..
చీకటి పిట్ట అరుపు నీ పిలుపేమో అనుకున్నా..
జాబిలమ్మ తోడుగా.. నీ కోసం వేచి వున్నా..
కనిపించవేం..
మబ్బు కమ్మిన జాబిలి వెలికొచ్చి..
చాలా సేపే అయ్యింది..
చెట్టూ చేమా ఊగిసలాడి కరచాలనం చేసుకుంటున్నాయి..
నే కూర్చున్న పచ్చిక పరుపు సైతం
నా బరువును తనలో కలుపు కుంటోంది
నా పక్కన పారిజాతం జాలిగా చూస్తోంది.
మదిలో నీ చిత్రం.. గిలిగింతలు పెడుతుంటే..
నీ రాకను ఊహించి మది మధువుతో నిండుతుంటే..
ఎంత సేపూ.. ఎదురు చూపు..

--నాగ్

అప్పటి వరకూ తనలో ఒక భాగం.. ప్రాణం పోసుకుని..

అప్పటి వరకూ తనలో ఒక భాగం..
ప్రాణం పోసుకుని..
ప్రసవం పేరిట విడివడి..
లేచి నిలుచుని.. బిడ్డ అయ్యింది..
అప్పటి వరకూ దాని ముఖం కూడా తెలీదు..
గుర్తు కూడా పట్టలేదు..
భూమి మీద పడగానే తల్లి ప్రేమ..
తన నుంచి తన బిడ్డను తీసుకెళ్తుంటే..
తల్లి ఆగగలదా..
పరుగున వస్తోంది.. బిడ్డను చూసి..
ఆ రైతుకు మాత్రం తెలీదూ..
కన్న పాశానికి మించిన బంధనం లేదని
అందుకే తల్లికి పలుపు తాడు సైతం వేయలేదు..
----------
(శనివారం పిఠాపురంలో సంత.. ఇక్కడ సూడిద గేదెలను అమ్మకానికి తీసుకొస్తారు. కొన్ని పశువులు సంతలోనే దూడలను ఈనుతాయి.. (అందుకే సంతలో జున్నుపాలు ఎక్కువగా దొరుకుతాయి) గేదెను కొన్నవారు.. దగ్గర ఊరి వాళ్లైతే అప్పుడే పుట్టిన దూడను రిక్షాలోనో.. ఆటోలోనో తీసుకు వెళ్తారు.. తల్లి ఆ దూడను వెంబడే ఇంటికి వచ్చేస్తుంది.. అప్పటి వరకూ తెలియని బిడ్డపై ఆక్షణం నుంచే తల్లికి వున్న ప్రేమ ఎంతటిది అంటే.. రిక్షాకు, ఆటో రిక్షాకు ధీటుగా అది బిడ్డను వెంబడిస్తుంది..
శనివారం కనిపించిన దృశ్యం కథనం ఇది..

ధన్యవాదాలు
--నాగ్

నిన్నొదిలిన మరుక్షణం..

నిన్నొదిలిన మరుక్షణం..
నా నడక మొదలైంది..
ఎన్నో దారులు..
గుట్టలు మెట్టలు..
ముళ్లు రాళ్లు..
ఎన్నో అడుగులు..
వేల కిలోమీటర్లు.. ప్రయాణం..
చిత్రం..
చివరికి చేరింది నీ దరికే..
నా గమ్యం..
నువ్వే..
ఇంత చిన్న విషయం..
మరిచానా.. ఎలా..

--నాగ్

ఓ చల్లని సాయంత్రం..గోదారి ఒడ్డున ఒంటరిని..

ఓ చల్లని సాయంత్రం..
భానుడు నీరెండగా మారి సెలవు తీసుకునే క్రమం
పిల్లగాలులు పరుగులు తీసే సమయం..
మదిలో నీ ఊసులు సందడి చేసే క్షణం..
గోదారి గట్టుపై.. 
అలల సోయగాలను చూస్తూ..
చిరు చేపల అల్లరికి మైమరిచి..
వేచి వున్నా నీకోసం..
దూరంగా పచ్చని కొబ్బరి చెట్ల వరుస..
నది కన్యను కాపాడే వస్తాదుల్లా..
మరో వంక..
అలల తాకిడికి ఊగుతూ.. ఒంటరి పడవ..
తీరం చేరడానికి అది పడుతున్న తహతహ..
నా మదిలో ఆరాటానికి ప్రతి రూపంలా..
నదిలో నీడలు కదిలిపోతున్నాయి..
నదిపై విహాంగాలు గూడు చేరుతున్నాయి..
అప్పటి వరకూ గోదారి సోయగాలు చూసి ఎర్రబడ్డ సూర్యుడు..
ఆ నదీ గర్బంలోనే తల దాచుకుంటున్నాడు.. సిగ్గుతో..
నా మదిలో గుబులు..
నువ్వు రావేమో..
ప్రకృతి పరిహసిస్తోంది.. అనుభవించవేమని
చిరుగాలి గేలి చేస్తోంది.. ఆనందించరా అని..
గోదరమ్మ చేయి పట్టి లాగుతోంది.. తనను చేరమని..
ఏం చెప్పనూ..
నా ఆనందం.. సంతోషం.. నీవేనని..
వాటికి ఎలా చెప్పనూ..
గోదారి ఒడ్డున ఒంటరిని..
ఒడ్డుపై వున్న బండరాళ్లల్లో ఒకడిని..

నోట్ : ఇది సరదాగానే రాశానండోయ్..
నేనేదో విఫల ప్రేమికుడిని అని అనుకుని జాలి కురిపించొద్దు ప్లీజ్ smile emoticon
--నాగ్

పిడికిలి పిడుగులు కురిపించడం తెలుసా..

పిడికిలి పిడుగులు కురిపించడం తెలుసా..
కంటి చూపుతో.. మెరుపులు..
స్వరపేటికతో ఉరుములు..
ఊపిరితో వడగాల్పులు సృష్టించడం తెలుసా..
అదిగో చూడు..
బిగించిన పిడికిలితో తుపానులా..
గర్జిస్తున్న ఉప్పెనలా
కదిలొస్తూ.. కదం తొక్కుతూ..
ఎర్రదండొస్తోంది అదిగో..
ఇనుప చక్రాలు తిప్పిన చేతులు..
కర్ర జెండా పట్టి..
కలాలతో కుస్తీపట్టిన వేళ్లు..
బలంగా బిగించి..
అడుగు అడుగులో గంభీరం..
ప్రతి నడకలో పోరాటతత్వం..
పని మాదీ .. బతికే హక్కు మాది..
విధి మాదీ.. విధినెదిరించే తెగువ మాది
ఊపిరితో వడగాల్పులు సృష్టించి..
కదలికతో నిప్పు రవ్వలు రగిలించి..
వస్తుందదిగో.. కార్మిక దండు..

వస్తు, సేవల సృష్టికర్తలం మేం..
అణిచేసే చట్టాలు చెల్లవు..
కత్తెరేసే జీవోలూ నిలబడవు..
ఒకే రోజు సెప్టెంబరు 2
ఒకే గంట.. అదే రోజు..
వేలు.. లక్షలు.. కోట్లు.. కార్మికులు.
గొంతెత్తి అరిస్తే.. పెడబొబ్బ పెడితే..
ఎక్కడా చిత్తుకాగితాలు..
ఏవీ మీ ఆదేశాలు.. పిపీలికాలు కావూ..

--నాగ్

కోయిల గానం..నువ్వు కనిపించగానే...

కోయిల గానం..
గాలిలో గంధ పరిమళం..
చల్లని మళయ మారుతం..
ధ్వజస్థంభం చిరుమువ్వల సవ్వడి..
గుడిపై గువ్వల రెక్కల చప్పుడు..
పసిపిల్లల నవ్వుల కిలకిల..
మది నిందిన తేనే పానకం..
మోముపై విరిసిన మందహాసం..
కనులలో మెరిన ఆనందం..
దేవిని దర్శించిన పవిత్ర భావం..
నువ్వు కనిపించగానే...

--నాగ్

అమ్మను చూశాను.. చాలా దగ్గరగా..

అమ్మను చూశాను..
చాలా దగ్గరగా..
ఎర్రని కుంకుమ రాసి పోసినట్టున్న
అమ్మను చూశాను
కళ్లల్లో కళ్లు పెట్టి జంకు లేకుండా..
ఆ కళ్లు దయను కురిపిస్తున్నాయి
ఆ నేత్రాలు వెన్నెలలా మెరుస్తున్నాయి
కన్నీటీతో అమ్మను చూశాను..
అడిగాను దీనంగా..
ఏమిటీ రక్తపు వాసన..
ఏందుకీ మూగ జీవుల రోధన..
తెగిపడుతున్న తలలకు లెక్కలేదా..
కన్న పేగునే బలికోరతావా..
నీ ఒడిలో జీవులు నిర్భీతిగా తిరిగే రోజు రాదా..
అమ్మ నవ్వింది..
ఆ నవ్వులో వేదన..
అమ్మ నోరు తెరిచింది.. ఉరుము ఉరిమినట్టు..
నాకు భయం వేయలేదు.. అమ్మే కదా..
అమ్మ అడిగింది..
నే అడిగానా..
నా బిడ్డలను నాకే బలి చేయమని..
నాకు ఇష్టమా.. నా బిడ్డల ఆక్రందన..
నే ఆదేశించానా.. రక్త కల్లాపీ చల్లమని..
ప్రకృతికే అందం నా లోవ కోన.. మరుభూమి చేయమన్నానా..
పాలు పోసినా వరాలిచ్చానే..
కొబ్బరి కొట్టినా స్వీకరించానే..
సాంభ్రాణి ధూపానికే మైమరిచానే..
దణ్ణం పెడితే ఆశీర్వదించానే..
తలలు నరకమని కోరానా..
అమ్మ అడిగింది..
ఏం చెప్పనూ..
మటన్ తో మజా కోసం మేకనీ..
కోడి పలావు కోసం కోడిని
అమ్మ వంకన కోస్తున్నామని ఒప్పుకోనా..
మదమెక్కి మందుకొట్టి తైతెక్కలాడటానికి..
మొక్కు వంక చెబుతున్నామని చెప్పనా..
సిగ్గుతో తల దించుకున్నా.
అమ్మ కళ్లలోకి మునుపటిలా చూడలేకపోయా..
దీనంగా మెట్లు దిగుతున్నా.. ఒక్కో మెట్టూ..

నోట్: ఎవరి నమ్మకాలు వారివి.. ఎవరి మనోభావాన్నైనా దెబ్బతీస్తే క్షంతవ్యుడిని..

--నాగ్

నా గురువు బలవంతుడు..

నా గురువు బలవంతుడు..
చిటికెన్న వేలిపై 'భూగోళం' తిప్పేస్తాడు..
మా గురువు ధనవంతుడు
'లెక్కలు' అలవోకగా చెప్పేస్తాడు..
మా గురువు జ్ఞానవంతుడు
'సైన్స్ రహస్యం ' చిటికెలో విప్పేస్తాడు
మా పంతులుగారి నాలుక పలుచన..
'తెలుగు' మధురంగా పలికిస్తాడు
మా మాష్టారు నోరు విప్పితే..
'ఆంగ్లం' సైతం ఎంత తీయన..
క్లిష్టమైన హింధీ మాటలు
ఆయన నోట వీనుల విందే కదా..
మాతో 'ఆట' లాడేవేళ
ఆయన మాకన్నా చిన్నోడే..
చతురులాడితే... పొట్ట చెక్కలే..
దండిస్తే.. దెబ్బ శరీరానికి కాదు..
తగిలేది మనసుకే..
ఆయన చేతితో దండించినా..
మనసులో కన్నీరు కార్చడం మాకు తెలుసు
సెలవు రోజు పాఠాలేమిటని కసురుకున్నాం.
ఆ సెలవును ఆయన మాకోసం త్యాగం చేశారని మరిచిపోయాం
మేము ఏడాడికొక్కసారే పరీక్షలు రాస్తే..
ఏడాది పొడవునా మాతో ఆయనకు పరీక్షలే
అమ్మా.. నాన్న తర్వాత..
'మా పిల్లలు' అని సంభోదించేది మా గురువులే
మా గురువు గొప్పవాళ్లకు గొప్పవాడు
ఎంత గొప్పవాడైనా అయన పాదాలకే నమస్కరిస్తాడు
మా గురువు మహానుభావుడు..
మా మనస్సుల్లో ఇప్పటికీ నీతి పాఠాలు చెబుతూనే వున్నాడు..
తట్టి హెచ్చరికలు చేస్తూనే వున్నాడు

(నేనెరిగిన గురువు గురించి)
--నాగ్

సత్యం.. నీ కలం ఇంకులో ఒలకాలి..

సత్యం.. 
నీ కలం ఇంకులో ఒలకాలి..
వాస్తవం..
నీ గొంతులో పలకాలి
ఆర్థ్రత..
నువ్వు తీసిన చిత్రంలో కనిపించాలి.
నీ మాట
జనం పక్షాన నిలవాలి
నీ అడుగు
పది మందికి దారి చూపాలి
నీ కేక
పది మందిని చైతన్య పరచాలి
నీ అభిప్రాయం కాదు..
జనం సమస్య నీ కథనంలో ప్రతిబింభించాలి
గొంతు గొంతులో నీ మాటలే వినిపించాలి..
ప్రతి గుండెనూ నీ రాతలు కదిలించాలి
ప్రజాస్వామ్యం నాలుగూ అయిదూ కాదు..
ప్రథాన స్తంభం నువ్వే కావాలి..
నువ్వు లోగో పెడితే..
ప్రభుత్వం ఒణకడం కాదు.. ఆలోచించాలి

ప్రగతి పథానికి..
తొలి అడుగు.. మాట.. దృశ్యం
నీదే కావాలి..
కడుపు కాలినా.. గొంతు ఎండినా.. కుటుంభ వ్యవస్థ ఛిద్రమైనా..
నీ బతుకు సమాజానికే..
నీ నడత ప్రజలకే అంకితం కావాలి
అప్పుడే నువ్వు కలం పట్టాలి..
ఎర్రని ప్రెస్ అక్షరాలలో..
నీ త్యాగం.. ధైర్యం.. సత్యం ప్రతిభింభించాలి

నిజమైన జర్నలిస్టులకు నా శుభాకాంక్షలు
--నాగ్

చినుకు జాడ..

చినుకు జాడ..
నెలల తర్వాత..
ఎండి పొడారిన పుడమిపై..
టప్ మని పడిన చినుకు శబ్దం..
వీనుల విందుగా..
నీటి బింధువు పడిన చోట..
చంద్రమండలంపై గుంటలా చిన్ని గుంట..
ఎంత చక్కని సువాసనా.. మట్టి తడిచిన సుగంధం
ఆ వెంటనే.. శతృ సైన్యంపై దండయాత్రలా..
టప టప మంటూ చినుకుల దాడి..
ఆపై.. ఎరను చూసిన అనకొండల్లా..
రోడ్దుపై వర్షం నీరు పాయలు పాయలుగా..
చిన్న పిల్లలు పరుగున ఇళ్లకు చేరుతున్నారు..
వారి పరుగులో వేగం లేదు..
తడిస్తేనె బావుండునన్న కోరిక వారి వేగాన్ని తగ్గించింది
చల్లని గాలి విసిరితే.. అరుగుమీద కూడా జల్లు..
చల్లని తుంపర్లతో..
బుడుగు బుడుగు మని వర్షపు చుక్క పడుతుంటే..
నీటిలో బుడగలు లేచి గుండు టోపీ సిపాయ్యిలా..
పరుగులు తీస్తున్నాయి..
పరుగుతీసే నీటిలో కాకితపు పడవలు తేలుతూ వెళ్తున్నాయి..
రైతుల కళ్లల్లో ఆనందపు మెరుపులు..
(చాలా రోజుల తర్వాత మా ఊరిలో వర్షం కురిసింది.. అదీ ఆనందం)
--నాగ్

చప్పిడి చేపలు..


చప్పిడి చేపలు..
కోనసీమలో ఎక్కువగా దొరుకుతాయి..
ఇవి ఎండు చేపలు కాదుట.
పచ్చి చేపల్నే పెద్ద పెద్ద పొయ్యిల పైన డ్రై చేసి(నీరంతా పోయేలా)
బాగా ఆరబెట్టినవి.
వీటిని వండితే.. ఫ్లష్ తొనలు తొనలుగా విడిపోతుందట.
తీర ప్రాంతంలో చాలా ఇష్టంగా తింటారు వీటిని.
సంతలో మంచాల మీద పెట్టి అమ్ముతున్నారు.
ధర కనుక్కున్నా.. అమ్మో.. చాలా ఎక్కువ.
ఇదిగో ఫోటోలో వున్న చేప ఒక్కటీ రూ.200 చెప్పింది.
ఫోటో : మురమళ్ల సంతలో తీసినవి
--నాగ్

గంగ రావి చెట్టు..


గంగ రావి చెట్టు..
అవును ఇది రావి చెట్టుకు భిన్నంగా వుంటుంది
ఇది మందార జాతికి చెందిన చెట్టు అట.
దీని కొమ్మలకు గాటు పెడితే పాలు కారతాయి.
ఆకులు మాత్రం రావి ఆకులను పోలి వుంటాయి పూలు గంట ఆకారంలో వుంటాయి..
మొదట పసుపు రంగులో వుండి ఆ తర్వాత ఎరుపు రంగులోకి మారుతుంది.
దీని కాయలు బొంగరంలా వుంటాయి.
ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే.. ఈ చెట్లు ఈ మధ్య కాలంలో కనిపించడం లేదు
కానీ మా పశువుల సంతలో అన్నీ ఈ వృక్షాలే.. చాలా అందంగా చెట్టు నిండా పూలతో కనిపిస్తాయి.
ఈ మధ్య వచ్చిన హుదుత్ తుపానుకు చాలా చెట్లు విరిగి చనిపోయాయి..
కొన్నే మిగిలాయి.
ఇప్పుడు అన్నీ ఏడాకుల పాల మొక్కలే వేస్తున్నారు..
వాటితో పాటూ గంగరావి మొక్కలు కూడా వేస్తే బావున్ను..
బావుంటాయి
ఫోటో : మా పశువుల సంతలో మిగిలిన గంగరావి చెట్టు

--నాగ్

అది ప్రేమే..

అది ప్రేమే..

నా చూపులో కాంతులెన్ని వున్నా..
ఆ కాంతి పుంజం ఒక్కటే..
అది నువ్వే..

మనసులో ఆనందం పొంగుతున్నా..
కారణం నువ్వే..
నీ ఊహే..

--నాగ్

కనురెప్పలు ఆరాటపడుతున్నాయి


నడుస్తున్నా... ఎవరి తోడూ లేకుండా..

నే నడుస్తున్నా.. 
గమ్యం వైపు.. 
దారిలో ఎందరో తారసపడుతున్నారు..
నవ్వుతున్నారు.. 
నన్నెరిగిన వాళ్లు.. నే నెరిగిన వాళ్లు.
నే మెచ్చిన వాళ్లు.. నన్ను మెచ్చిన వాళ్లు

అందంగా వున్నవాళ్లు.. గంభీరమైన వాళ్లు..
నడుస్తున్నారు.. నాతో బాటూ..
ధనవంతులు.. మధ్యతరగతి వాళ్లు
నడుస్తున్నారు.. నాతో..
నేను నడుస్తున్నాను.. నా దారిలో
కొందరు పలకరిస్తున్నారు..
మరి కొందరు మౌనంగా నవ్వేసి సాగుతున్నారు
ఇంకొందరు నాతో నడిచి మధ్యలో ఆగిపోతున్నారు..
ఇంకా.. నన్ను దాటి వెళ్లిపోతున్నారు..
ఇద్దరు ముగ్గురు నాతో చాలా దూరం నడిచారు..
ఇక నాబాటలో రాలేక ఆగి వెనక్కి తిరిగారు.
మరో ఇద్దరు నాతో చాలా దూరం వచ్చారు..
ఏమైందో.. చెప్పా పెట్టకుండా ఆగిపోయారు.
నడుస్తున్నాను నా నడక ఆగలేదు..
మహా ప్రస్థానంలో ధర్మరాజులా
నడుస్తున్నాను..
వానొచ్చినా.. వరదొచ్చినా..
దారిబాగున్నా.. లేకున్నా...
ఎవరు వచ్చినా.. రాకున్నా..
నాతో వున్నా..లేకున్నా...
నడవాలి నేను.. నడుస్తున్నా...
చివరికి ఎవరి తోడూ లేకుండా..
గమ్యం వైపు
ఒంటరిగా..

--నాగ్
ఫోటో : గూగుల్ నుంచి సేకరించినది

ఏమి రాజ్యమిది..

ఏమి రాజ్యమిది..
ఎవరి పాలన మిది..
ఖాకీ రాజ్యమిది.. చెల్లీ..
కీచక పర్వమిది..
ప్రశ్నిస్తే.. జుట్తు పట్టుకుంటారు..
నిలదీస్తే.. వలువలూడదీస్తారు..
దమన నీతి ఇది తల్లీ..
రాక్షస భోజ్యమిది..
అమాయక పావురాన్ని..
తోడేళ్ల గుంపు చుట్టి ముట్టి..
దవళ వర్ణ దేవతను..
పిశాచ మూకలు కబళీంచినట్టు..
ఏమి రాజ్యమిది అక్కా..
మృగాల అడవి ఇది..
చదువుల తల్లిపై..
కాకుల దాడి..
ఎక్కడుందీ కర్కశ నీతి.. రీతి..
ఎవరూ మాట్లాడరేం..
ప్రశ్నించరేం..
నిలదీయరేం..frown emoticon

--నాగ్
.

పోలీసూ.. ఆలోచించు..

పోలీసూ.. నువ్వూ ఒకప్పుడు విద్యార్థివే..
పోలీసూ.. నువ్వూ ఒకప్పుడు నిరుధ్యోగివే..
పోలీసూ.. నువ్వూ ఒకప్పుడు హాస్టల్ వాడివే..
పోలీసూ.. నీకు కొడుకులున్నారు..
పోలీసూ.. నీకు కూతుళ్లున్నారు..
పోలీసూ.. నువ్వూ ఒక తండ్రివే.. తల్లివే..
పోలీసూ.. నువ్వూ ఒక అన్నవే.. అక్కవే..
పోలీసూ.. నువ్వూ ఈ సమాజంలోని వాడివే..
పోలీసూ.. నీకూ సున్నితత్వం.. మానవత్వం వున్నాయ్
పోలీసూ.. నీకూ భయం.. బాధ.. తెలుసు
పోలీసూ.. నీకూ కన్నీళ్లూ.. వేదన వున్నాయ్
పోలీసూ.. నీ తమ్ముడూ.. చెల్లీని ఇలానే దండిస్తావా
పోలీసూ.. నీ కూతుర్ని.. కొడుకునీ ఇలానే అవమానిస్తావా
ఎక్కడిదీ ఈ కాఠిన్యం.. ఎక్కడీదీ నిర్థయ
వాళ్లంతా నీ వందేళ్ల శత్రువులైనట్టు..
వాళ్లంతా దుర్మార్గులూ.. టెర్రలిస్టులూ అయినట్టు..
వాళ్లంతా నీ ఆస్తినీ.. సంపదను దోచుకెళ్లినట్టు..
వాళ్లంతా నీ ఆగర్భ శతృవులైనట్టు..
ఎందుకు నీ కంత కౌర్యం..
నాకు తెలుసు..
నువ్వు ఇంటికెళ్లి కన్నీళ్లు పెట్టే వుంటావ్..
నాకు తెలుసు నీ మనసులో వేదన వుండే వుంటుంది
నాకు తెలుసు గాయపడిన పిల్లల్లో నీ తోబుట్టువులను చూసే వుంటావ్
నాకు తెలుసు.. చున్నీ లాగిని అమ్మాయిలో నీ చిన్నారిని చూసే వుంటావ్
నాకు తెలుసు.. గాయపడిన కుర్రాడిలో నీ చిన్న తమ్ముడిని గుర్తించి వుంటావ్
ఖాకీ మాటున మనసును దాచినా..
నువ్వూ మామూలు మనిషివే పోలీసు..
ఆలోచించు..
నువ్వు చేసింది తప్పు కదూ..
మనశ్శాక్షి ప్రశ్నించదూ..
ఆలోచించు.. కన్నీళ్లు తుడుచుకుని

--నాగ్

విశాఖ కాఠిన్యంపై..
ఫోటోలు మణి భూషణ్ గారి గోడ నుంచి సంగ్రహించినవి

నేను వుండీ.. యంత్రమే కదా..

కళ్లు చూస్తున్నాయి..
దీనంగా..
పెదాలు మాట్లాదుతున్నాయి..
ముక్తసరిగా..
చేతులు పనిచేస్తున్నాయి..
యాంత్రికంగా..
కాళ్లూ నడుస్తున్నాయి..
నీరసంగా..
బుద్ది పనిచేస్తోంది..
మందకొడిగా..
ఊపిరి ఆడుతోంది..
చేతనకు గుర్తుగా..
గుండే కొట్టుకుంటోంది..
అలవాటుగా..
మనసే...
మనసే...
 మనసే..
ఇక్కడ లేదు..
నీతో వచ్చేసింది..
అది లేనప్పుడు..
నేను వుండీ.. యంత్రమే కదా..
 
 --నాగ్
ఫోటో : గూగుల్ నుంచి సేకరించినది



Thursday 17 September 2015

అక్కడి స్తంభాలకు యాపిల్స్





అక్కడి స్తంభాలకు యాపిల్స్ కాచాయి..
ఆ పక్కనే మొక్కజొన్న పొత్తులు మొలిచాయి..
ఇంకాస్త దూరంలో ఎలక్కాయలు.. సీతాఫలాలు వచ్చాయి..
చిత్రంగా అవన్నీ మామిడి కొమ్మలకే వున్నాయి..
చెరకు గెడలు ఆ పక్కనే కనిపించాయి
చూడబోతే అదొక అడవి.. కాదు కాదు ఉద్యాన వనం.. ఉహూ.. రాఘవేంద్రరావు సినిమా సెట్టింగ్..
అడుగడుగునా యాపిల్స్ కళ్లకు ఇంపుగా..
అందమైన దృశ్యం పిఠాపురం జై గణేష్ ఆలయంలో గురువారం ఆవిష్కృతమైంది.
సుమారు 11000 యాపిల్స్, 1100 మొక్కజొన్న పొత్తులు, మరో 1000 వరకూ ఇతర కాయలు, పళ్లు ఉపయోగించారు.. ఆలయం ఆవరణంగా పాలవెల్లిగా మార్చాశారు..
ఈ కార్యక్రమాన్ని అర్చకులు ఎం రామకృష్ణ, ఈవో వెంకట రమణ మూర్తి ఆధ్వర్యంలో భక్తులు నిర్వహించారు..
--నాగ్
ఫోటో : జై గణేష్ ఆలయంలో భారీ పాలవెల్లి

Wednesday 16 September 2015

పిఠాపురం పాదగయ క్షేత్రంలో ప్రయాణ గణపతి

పిఠాపురం పాదగయ క్షేత్రంలో అడుగడుగునా విశేషాలు విచిత్రాలు గోచరిస్తాయి..
 ఉదాహరణకి.
ఆలయంలో తొలిగా దర్శనం చేసుకునే వినాయకుడిని గమనిస్తే.. గణనాధుడు మూషికంపై ఆశీనుడై ఎక్కడికో పయనం అవుతున్నట్టుగా దర్శనమిస్తాడు..
సాదారణంగా, చాలా చోట్ల వినాయకుడు పీఠం మీద ఆశీనుడై వుంటే.. ఆయన వాహనం మూషికం పక్కగా వుంటుంది.. కానీ పాదగయ క్షేత్రంలో మాత్రం స్వామి నేరుగా మూషిక వాహనంపైనే ఆశీనుడై..వుంటాడు..  ఈ తరహా విగ్రహం అరుదని ఇక్కడి పండితులు చెబుతున్నారు.. స్వామిని ప్రయాణ గణపతిగా పేర్కొంటున్నారు. 
వీలైతే పాదగయను దర్శించండి.. గణనాధుడి దీవెనలు అందుకోండి..

వినాయక చవితి శుభాకాంక్షలు
--నాగ్

చవితి అంటే..

మిత్రులకు 
వినాయక చవితి శుభాకాంక్షలు..
చవితి అంటే.. 
పాలవెల్లి..
పళ్లు..
పత్రి..
మట్టి గణపతి..
చవితి కథ..
ఉండ్రాళ్లు..
కలం, పుస్తకాలు

--నాగ్
ఫోటో : పిఠాపురం మార్కెట్ లో పాలవెల్లి అమ్ముతున్న మహిళ

నాకు కలలు రావు..

నాకు కలలు రావు..
కనుల నిండా నువ్వే వుంటే కలలకి చోటేదీ..
నాకు కన్నీళ్లూ రావు..
నా కనుల వాకిట నిలిచిన నిన్ను దాటి 
అవెలా వస్తాయి..
-నాగ్
Note: This photo taken from google.. thank  for original  wonar  fo this pic

వినాయక మట్టి విగ్రహాలు..

మట్టి విగ్రహాలు..
ఈ వినాయక చవితికి ప్రజల్లో చక్కని చైతన్యం కనిపిస్తోంది..
ఎక్కడ చూసినా మట్టి వినాయకులే కనిపిస్తున్నారు..
కొన్ని చోట్ల ఉచితంగా కూడా పంచుతున్నారు.
ర్యాలీలూ.. సమావేశాలు బాగానే జరుగుతున్నాయి..
అదే విధంగా నిమజ్జనానికి కూడా ఇదే క్రమశిక్షణ అవసరం..
నదుల్లో.. చెరువుల్లో చివరికి సముద్రంలో కూడా పాస్టర్ ఆఫ్ పారీస్ విగ్రహాలను నిమజ్జనం చేయకుండా ఆపితే సరి..
ఒక సంవత్సరం అడ్దుకుంటే.. మరుసటి సంవత్సరం అయినా జాగ్రత్త పడతారు..
అలాగే పురపాలక సంఘం, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు అన్ని మండళ్లనూ పరిశీలించి పర్యావరణానికి భంగం కలిగించే విగ్రహాల ఏర్పాటును అడ్డుకోవాలి..
అయితే ఈఏర్పాటు మూడురోజులు ముందుగా చేపట్టాలి..
కానీ...

--నాగ్

ప్రేమా.. నెరజానవే..


ప్రేమా.. నెరజానవే..
మరవాలని ప్రయత్నించిన ప్రతిసారీ..
గుర్తు చేస్తూనే వుంటావ్
గుర్తొచ్చిన ప్రతిసారీ..
కన్నీరవుతావ్..
నీకోసం కన్నీరించిన వాళ్ళకు
కనుమరుగవుతావ్,,
కనిపించని వాళ్ళని కావాలంటావ్
కళ్ళముందు ప్రేమను కసురుకుంటావ్
ఏముందని మురిపిస్తావ్..
ఏం లేదని మరిపిస్తావ్
అప్పుడే కోపం రప్పిస్తావ్
అంతలోనే కావాలనిపిస్తావ్
ఏమైనా నీవే గెలుస్తావ్..
నన్ను ఓడించి గెలిపిస్తావ్
ఓటమిలోనూ ఆనందం
బాధలోనూ భావుకత్వం
నీకే సాధ్యం.. ఏమైనా
ప్రేమా నెరజానవే..
-నాగ్

పండు వెన్నెల.

పండు వెన్నెల..
చల్లని.. మలయ మారుతం
చుట్టూ నిశ్శబ్దం..
ప్లేబ్యాక్ లా సెలయేటి గలగల
ఎర్రని అంచు..
తెల్లని కాటన్ చీరలో నువ్వు..
చేతిలో వెండి పల్లెం..
వెన్నెలను తలదన్నేలా..
వెన్నలొలికే పెరుగన్నం..
నీ చిరునవ్వు ఆహ్వానం..
తినడానికా.. మరి...!
ఆత్రంగా పరుగున నేను..
అందవే.. ఊరించుతావే..
ఆకలిగా నేను..
చిక్కవే.. చిలిపిగా నవ్వుతావే..
అలిగి నేనాగితే..
గోరుముద్దతో నువ్వు ప్రత్యక్షం
ముద్దు లేనిదే.. ముద్ద దిగదని
నేను మారాం..అంతలో
వెండి మబ్బుమాటుకు.. వెన్నెల
గోరు ముద్ద.. ముద్దా..
తేల్చుకునే లోగా..
మాయదారి చందమామ
వెన్నెల కురిపించింది..
నా నోటికి పెరుగన్నం..
నీ పెదాలకు అంటిన మెతుకు..
ఈ ఆనందం చాలు కదూ..
ఈ బతుకుకు..
--నాగ్

హృదయం మెలిపెట్టినట్టు

ముడి వేళ్ళతో
హృదయం మెలిపెట్టినట్టు..
చల్ల కవ్వంతో మనసు చిలికినట్టు..
ఎంత వేదన.. బాధ
నీ తిరస్కారానిదా అంత శక్తి

కాదన్నావని కాదు..
కనీసం కన్నెత్తి చూడలేదని
నాతో మాట్లాడొద్దు..
మౌనంగా నైనా చూడు

నీకిద్దామని రాసిన లేఖ
జేబులో చిరిగిపోతోంది
చెప్పాలన్న మాట
గొంతులో నలిగిపోతోంది

నేనిచ్చిన గులాబీ
నీ కాళ్ళకింద నలుగుతుంటే
ఉబికే కన్నీళ్ళు దాచి
నా అయోమయం నవ్వు

ఎన్నాళ్ళని ఎదురు చూడాలి
అవును ఇన్నాలని నువ్వు చెప్పలేదుగా
ఎన్నేళ్ళైనా చూస్తే ఏం..
నీ ఎదురు చూపులో
జీవితం అయిన చిన్నదే గా

---నాగ్

ఉత్తుంగ తరంగం


ఉత్తుంగ తరంగం ఒక్కసారిగా..
నన్ను ముంచెత్తింది..
నిలువునా తడవక ముందే..
తేరుకుని చూసే సరికి
అదృశ్యమైంది..
సుదూరంగా నురుగల నవ్వులు రువ్వుతూ
నను వెక్కిరించింది..
కాళ్ళ కింద నిరాశ ఇసుక
నిశీథిలో ఒంటరిగా నేను..
దూరంగా ఆశల మినుగురులు
వాటిని అందుకునే ప్రయత్నంలో నేను
ముందుకు సాగనీయని కెరటాలు
కడలి ఒడ్డున నేను.. కన్నీటితో
ప్రతి గవ్వా నన్ను చూసి నవ్వుతోంది
ప్రతి పడవా నన్ను చూసి జాలిపడుతోంది
నీతోడు నాకెంత అవసరమో నీకు తెలుసు
అయినా నీవు రావు..
వెన్నుతట్టి నిమిరే నీ చేయి ..
ఓటమీలోనూ ధైర్యమిచ్చే నీ మాట
నాకు దూరం..
ఎందుకిలా.. నన్ను ఒంటరిగా..
---నాగ్

నా కంటూ వున్నది నీవే

నా కంటూ వున్నది నీవే
నా దురదృష్టం నే వున్న సంగతే నీకు తెలీదు
నే అనుక్షణం తలచేదీ నిన్నే
నా తలపే నీకు లేదు
నాతో ఆడిన గుజ్జనగూళ్ళు..
పంచుకున్న కాకి ఎంగిళ్ళూ..
తాటి ముంజుల వాహనాలు..
ఆడుకున్న దాగుడుమూతలూ
నీకు గుర్తు లేవేమో గానీ
అవేనా ప్రేమకు ఆధ్యాలు

నా తొలి ప్రేమను నువ్వు గుర్తించలేదు
నా ప్రతిపాధనను నీ వంగీకరించలేదు
నిను కదిలించాలని చేసిన ప్రతి ప్రయత్నం ఫలించలేదు
అయినా నీ జ్ఞాపకం నను వదలడం లేదు

నిను చూసిన నా కళ్ళు.
మరే అందాన్నీ అంగీకరించనంటున్నాయి
నీ చిరునవ్వు సవ్వడికి అలవాటు పడిన నా చెవులు
మరే సంగీతమూ విననంటున్నాయి
నీ పేరు మాత్రమే పలికే నా పెదాలు
గాయత్రీ మంత్రం సైతం పలకడం లేదు

హృదయమంతా.. తెరిచి వుంచినా
కనీసం తొంగి చూడవు
జీవితమంతా ఎదుట పరిచినా
పలకరించవు..
వేచి చూడడమే ప్రేమ పరమార్థమని
తలపులోనే తన్మయముందని
విషాదంలోనే ఆనందముందని
నిను ప్రేమించాకే తెలిసింది

నీ కన్నుల వాకిట నిలవడానికే
ఈ జన్మ సరిపోతే ..
నీ హృదయం చేరటానికి
మరో జన్మ అవసరమే కధా.
--నాగ్
ఫోటో: గూగుల్ వారిది.. అసలు యజమాని తెలీదు.. వారికి కృతజ్ఞతలు