Saturday 2 September 2017

పురాతన బురుజు గూడు నుంచి

పురాతన బురుజు గూడు నుంచి
పక్షుల్లా..
నా శిథిల మస్థిష్కం నుంచి జ్ఞాపకాలు ఎగిరిపోతున్నాయి..
గమ్యం లేక..
సుడిగాలిలో చిక్కుకున్న ఎండుటాకుల్లా..
వాటి రెక్కల చప్పుళ్లల్లో నా గుండె చప్పుడు..
పోతున్నాయి..ఎగురుతూ
వాటిని పట్టి ఆపాలని
నా హృధిలో బంధించాలని నే చేస్తున్న ప్రయత్నం..
ఒక యుద్దమే..
కళ్ల వాకిలి నుంచి.. దారగా.. నీళ్లు..
లావాలా.. నా చెక్కిళ్లను కాల్చేస్తూ..
ఎలా అర్థమౌతుందీ..
జ్ఞాపకాలు శూలాలై గుచ్చుతాయని..
జ్ఞాపకాలు అగ్నిశిఖలై కాల్చుతాయని..
మనసు పొరల్లో విస్పోటనం కలిగిస్తాయని..
గుండెను మెలిపెట్టి వికటాట్టహాసం చేస్తాయని..
అయినా..
వాటిని పట్టి ఆపాలని ప్రయత్నిస్తున్నా..
నాలోనేనే.. అలుపెరగని పోరాటం చేస్తున్నా..
లోహ ఖగాల గోళ్లల్లో చిక్కుకుని ఆర్తనాదం చేస్తున్నా..
ఎగిరిపోతున్నాయి.. జ్ఞాపకాల పక్షులు..
శిథిల హృది నుంచి
-- సరిదే నాగ్

సూర్యుడా.. జరుగు జరుగు

సూర్యుడా.. జరుగు జరుగు
కారు మేఘాలొచ్చేశాయ్
వడగాలీ చాలు చాలు.. చల్లబడు..
ఈదురుగాలు లొచ్చేశాయ్..
నేలమ్మా కంగారు పడకు..
తడిచి గుభాలించే టైమొచ్చేసింది
నువ్వు కడుపు నింపుకునే వర్షాలొచ్చేశాయి
రైతన్నా.. రచ్చబండ కబుర్లు చాలు..
తుండు గుడ్డ దులుపు..
గరువుకేళ్లే సమయమొచ్చింది..
బసవన్నా.. నెమరేత కట్టిపెట్టు..
కాడి ఎత్తి అరక దున్నేవేళయ్యింది..
చల్లబడింది.. బడుగు గుండె తెరిపిన పడింది
ముసలి ప్రాణం నిలిచింది..
తువ్వాయి పరుగులెత్తుతోంది..
బీడు పొలంలో సందడి పెరిగింది..
పచ్చదనం మొలకలెత్తే సమయమొచ్చింది
-- సరిదే నాగ్

నువ్వొచ్చిన క్షణం

//నువ్వొచ్చిన క్షణం//
తాజా పూల పరిమళం..
అగరొత్తుల ధూపం..
కాంతులీనే నేతి దీపం
గంటా నాదం..
మంత్రోచ్ఛారణం..
నీ అడుగుల శబ్దం..
దేవీ సాక్షాత్కారం..
నా గుండే ఆగిన క్షణం..
-- సరిదే నాగ్

చిరు చీకట్ల.. వెలుగులో..

చిరు చీకట్ల.. వెలుగులో..
నీ పాదాల సౌందర్యం..
చిరుమువ్వల సింగారం..
అద్భుతం..
మనసు నిండుగా నీ రూపం..
-- సరిదే నాగ్

తొలిరోజు బడికి బయలు దేరాడు..

మా వీధిలో పిల్లాడు తొలిరోజు బడికి బయలు దేరాడు..
వాళ్ల అవతారం .. అంతరిక్షానికి వెళ్లే వ్యోమగామిలా.. 
నేను బడికెళ్లిన రోజులు గుర్తొచ్చాయి..
అప్పుడు బడికి వెళ్లాలంటే ఓ పలక.. బలపం అంతే..
సన్నగా చినుకులు పడుతుంటే.. బరువైన మట్టి పలక.. చివర్లు ఇనుప రేకులు తాపడం చేసి వున్నది ఒక చేత్తో నెత్తిమీద పెట్టుకుని, మరో చేత్తో జారిపోతున్న నిక్కరు లాక్కుంటూ.. బడికి పరుగులు తీసిన రోజులు గుర్తొస్తున్నాయి..
నేల బల్ల మీద .. బాగా పొడిగా వున్న చోటు చూసుకుని కూర్చునే వాడిని.
జేబులో ఓ చిన్ని బలపం..
అ ఆ అని పెద్ద అక్షరాలు రాస్తే.. ఒక గంటలో అవి కాస్తా.. పెద్ద పెద్ద గుండు సున్నాలు అయిపోయేవి. అలా దిద్దేసేవాడిని..
మాస్టారు వాటిని చెరిపేసి తీసుకు రమ్మంటే.. పలకని వర్షంలో పెట్టి అక్షరాలు చెరిపేవాళ్లం.
ఇక్కడ మట్టి పలక గురించి చెప్పాలి.. ఎంత బరువనీ.. ఒళ్లో పెట్టుకోకుండా రాయలేకపోయేవాళ్లం..
పాల కనికితో మెత్తగా భలే రాసేది..
ఒక్కోసారి మా గొడవలకి అదే ఆయుధం.. 
తలలు పగిలిపోయేవి..
తల మీద నూనె జిడ్డు అంటుకుని బాగా రాయకపోతే
పలకలు బాగా రాయడానికి. కొండ పిండి అకుతో బాగా రుద్ది.. కడిగేవాళ్లం.
.పొరపాటున ఎవరైనా పలక తొక్కేస్తే .. అది పగిలిపోతే.. హమ్మో పెద్ద గొడవై పోయేది..
ఇంట్లో బడిత పూజ..
కొన్నిరోజులు ఆ పగిలిన పలక ముక్కతోనే తంటాలు.. అదే పనిష్మింటు 
తర్వాత తర్వాత రేకు పలకల హవా వొచ్చింది..
రేకులకు తగులుకుని చొక్కాలు చిరిగిపోయేవి
వర్షం వస్తే.. మాత్రం పలకలు మంచి గొడుగులా మారిపోయేవి..
కనికలు(బలపాలు) మంచి మారక ద్రవ్యాలు..
బహుశా జీవితంలో తొలి అప్పు బలపమేనేమో..
ఒకటో తరగతి వాళ్లు కొత్త పుస్తకాలు తీసుకొస్తుంటే.. వాళ్ల వైపు అసూయగా చూసేవాళ్లం..
అబ్బ కొత్త పుస్తకం సువాసన భలే వుండేది.. ఇక పెన్ను ఎప్పుడెప్పుడు పట్టుకుంటామా అని ఆత్రం..
బహుశా నాకు గుర్తు వున్నంత వరకూ అక్షరాలు.. గుణింతాలు.. పదాలు అయిపోయాక మొదటి పాఠం.. జామపళ్ల పాఠం అనుకుంటా.. తెల్ల, ఎర్ర జామకాయల పాఠం.. ఒకటో తరగతి తెలుగు పుస్తకం (ఒకటే పుస్తకం వుండేది) చివర్లో పాఠం.. అది చదివేస్తే.. హమ్మయ్యా.. ఒకటో తరగతి అయిపోయినట్టే..
-- సరిదే నాగ్

అతని కంటి చివరల నుంచి జారిన కన్నీటి చుక్క..

అతని కంటి చివరల నుంచి జారిన కన్నీటి చుక్క..
చాలానే చెప్పాలని..
మందులు తెస్తాడని ఎదురు చూసే తల్లికి..
మిఠాయి పొట్లం కోసం ఎదురు చూసే చంటిదానికి..
అదే చివరి వీడ్కోలు అని తెలీక గుమ్మం వరకూ వచ్చి వీడ్కోలు పలికిన భార్యకి..
ఇంకా..ఇంటిల్లిపాదికీ..
ఏదో చెప్పాలని..
ఆత్రంగా.. వెచ్చగా కంటి చివరల జారిన కన్నీటి చుక్క..
చెంప మీదుగా జారి.. ఏమీ చెప్పకుండానే మట్టిలో మాయమైంది..
కంటి నుంచి ఆరిపోయిన అతని వెలుగులా..
అతనిని గమ్యం చేర్చడానికి పరుగులు తీసిన బైకు చక్రం..
గిర్రున తిరుగుతూనే వుంది.. పడినచోటే..
నల్లని రోడ్డుపై ఒలికిన ఆయిలు అతని ఎర్రని రక్తంతో కలిసి..
వర్ణాలు అద్దుకుంటోంది..
చుట్టూ జనం.. గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటూ..
అతనికి వినిపించదని తెల్సినా.. గట్టిగానే మాట్లాడుకుంటున్నారు..
ఎవరో ఫోన్ లో మాట్లాడుతున్నారు.. యాక్సిడెంట్ వివరాలు చెబుతున్నారు..
దూరంగా బైకు స్పీడో మీటరు.. 120 దగ్గర ఆగి వుంది..
మౌనంగా రోదిస్తూ..
-- సరిదే నాగ్

నల్లరేగడి మడిలో.. మండే నెగడు..

కళ్ల నిండుగా నింపుకున్నా..
తడిచిన నేలమ్మ అందం..
కడుపాకలి తీర్చే..
అంకురం ప్రసవించే గర్భం
అదిగో..
నల్లరేగడి మడిలో..
మండే నెగడు..
నల్ల నేలల్లో ఉదయించే..
తొలిపొద్దు సూరీడు
మొలక పురిటి స్నానాకొచ్చాడు సూడు
చిరుజల్లుల తోడుగా
వెన్నెలమామగా మారిండు
తాను తనైన వేళ..
పకపక మన్నాడు మబ్బుసాటు సంద్రుడు

-- సరిదే నాగ్