Saturday 2 September 2017

పురాతన బురుజు గూడు నుంచి

పురాతన బురుజు గూడు నుంచి
పక్షుల్లా..
నా శిథిల మస్థిష్కం నుంచి జ్ఞాపకాలు ఎగిరిపోతున్నాయి..
గమ్యం లేక..
సుడిగాలిలో చిక్కుకున్న ఎండుటాకుల్లా..
వాటి రెక్కల చప్పుళ్లల్లో నా గుండె చప్పుడు..
పోతున్నాయి..ఎగురుతూ
వాటిని పట్టి ఆపాలని
నా హృధిలో బంధించాలని నే చేస్తున్న ప్రయత్నం..
ఒక యుద్దమే..
కళ్ల వాకిలి నుంచి.. దారగా.. నీళ్లు..
లావాలా.. నా చెక్కిళ్లను కాల్చేస్తూ..
ఎలా అర్థమౌతుందీ..
జ్ఞాపకాలు శూలాలై గుచ్చుతాయని..
జ్ఞాపకాలు అగ్నిశిఖలై కాల్చుతాయని..
మనసు పొరల్లో విస్పోటనం కలిగిస్తాయని..
గుండెను మెలిపెట్టి వికటాట్టహాసం చేస్తాయని..
అయినా..
వాటిని పట్టి ఆపాలని ప్రయత్నిస్తున్నా..
నాలోనేనే.. అలుపెరగని పోరాటం చేస్తున్నా..
లోహ ఖగాల గోళ్లల్లో చిక్కుకుని ఆర్తనాదం చేస్తున్నా..
ఎగిరిపోతున్నాయి.. జ్ఞాపకాల పక్షులు..
శిథిల హృది నుంచి
-- సరిదే నాగ్

సూర్యుడా.. జరుగు జరుగు

సూర్యుడా.. జరుగు జరుగు
కారు మేఘాలొచ్చేశాయ్
వడగాలీ చాలు చాలు.. చల్లబడు..
ఈదురుగాలు లొచ్చేశాయ్..
నేలమ్మా కంగారు పడకు..
తడిచి గుభాలించే టైమొచ్చేసింది
నువ్వు కడుపు నింపుకునే వర్షాలొచ్చేశాయి
రైతన్నా.. రచ్చబండ కబుర్లు చాలు..
తుండు గుడ్డ దులుపు..
గరువుకేళ్లే సమయమొచ్చింది..
బసవన్నా.. నెమరేత కట్టిపెట్టు..
కాడి ఎత్తి అరక దున్నేవేళయ్యింది..
చల్లబడింది.. బడుగు గుండె తెరిపిన పడింది
ముసలి ప్రాణం నిలిచింది..
తువ్వాయి పరుగులెత్తుతోంది..
బీడు పొలంలో సందడి పెరిగింది..
పచ్చదనం మొలకలెత్తే సమయమొచ్చింది
-- సరిదే నాగ్

నువ్వొచ్చిన క్షణం

//నువ్వొచ్చిన క్షణం//
తాజా పూల పరిమళం..
అగరొత్తుల ధూపం..
కాంతులీనే నేతి దీపం
గంటా నాదం..
మంత్రోచ్ఛారణం..
నీ అడుగుల శబ్దం..
దేవీ సాక్షాత్కారం..
నా గుండే ఆగిన క్షణం..
-- సరిదే నాగ్

చిరు చీకట్ల.. వెలుగులో..

చిరు చీకట్ల.. వెలుగులో..
నీ పాదాల సౌందర్యం..
చిరుమువ్వల సింగారం..
అద్భుతం..
మనసు నిండుగా నీ రూపం..
-- సరిదే నాగ్

తొలిరోజు బడికి బయలు దేరాడు..

మా వీధిలో పిల్లాడు తొలిరోజు బడికి బయలు దేరాడు..
వాళ్ల అవతారం .. అంతరిక్షానికి వెళ్లే వ్యోమగామిలా.. 
నేను బడికెళ్లిన రోజులు గుర్తొచ్చాయి..
అప్పుడు బడికి వెళ్లాలంటే ఓ పలక.. బలపం అంతే..
సన్నగా చినుకులు పడుతుంటే.. బరువైన మట్టి పలక.. చివర్లు ఇనుప రేకులు తాపడం చేసి వున్నది ఒక చేత్తో నెత్తిమీద పెట్టుకుని, మరో చేత్తో జారిపోతున్న నిక్కరు లాక్కుంటూ.. బడికి పరుగులు తీసిన రోజులు గుర్తొస్తున్నాయి..
నేల బల్ల మీద .. బాగా పొడిగా వున్న చోటు చూసుకుని కూర్చునే వాడిని.
జేబులో ఓ చిన్ని బలపం..
అ ఆ అని పెద్ద అక్షరాలు రాస్తే.. ఒక గంటలో అవి కాస్తా.. పెద్ద పెద్ద గుండు సున్నాలు అయిపోయేవి. అలా దిద్దేసేవాడిని..
మాస్టారు వాటిని చెరిపేసి తీసుకు రమ్మంటే.. పలకని వర్షంలో పెట్టి అక్షరాలు చెరిపేవాళ్లం.
ఇక్కడ మట్టి పలక గురించి చెప్పాలి.. ఎంత బరువనీ.. ఒళ్లో పెట్టుకోకుండా రాయలేకపోయేవాళ్లం..
పాల కనికితో మెత్తగా భలే రాసేది..
ఒక్కోసారి మా గొడవలకి అదే ఆయుధం.. 
తలలు పగిలిపోయేవి..
తల మీద నూనె జిడ్డు అంటుకుని బాగా రాయకపోతే
పలకలు బాగా రాయడానికి. కొండ పిండి అకుతో బాగా రుద్ది.. కడిగేవాళ్లం.
.పొరపాటున ఎవరైనా పలక తొక్కేస్తే .. అది పగిలిపోతే.. హమ్మో పెద్ద గొడవై పోయేది..
ఇంట్లో బడిత పూజ..
కొన్నిరోజులు ఆ పగిలిన పలక ముక్కతోనే తంటాలు.. అదే పనిష్మింటు 
తర్వాత తర్వాత రేకు పలకల హవా వొచ్చింది..
రేకులకు తగులుకుని చొక్కాలు చిరిగిపోయేవి
వర్షం వస్తే.. మాత్రం పలకలు మంచి గొడుగులా మారిపోయేవి..
కనికలు(బలపాలు) మంచి మారక ద్రవ్యాలు..
బహుశా జీవితంలో తొలి అప్పు బలపమేనేమో..
ఒకటో తరగతి వాళ్లు కొత్త పుస్తకాలు తీసుకొస్తుంటే.. వాళ్ల వైపు అసూయగా చూసేవాళ్లం..
అబ్బ కొత్త పుస్తకం సువాసన భలే వుండేది.. ఇక పెన్ను ఎప్పుడెప్పుడు పట్టుకుంటామా అని ఆత్రం..
బహుశా నాకు గుర్తు వున్నంత వరకూ అక్షరాలు.. గుణింతాలు.. పదాలు అయిపోయాక మొదటి పాఠం.. జామపళ్ల పాఠం అనుకుంటా.. తెల్ల, ఎర్ర జామకాయల పాఠం.. ఒకటో తరగతి తెలుగు పుస్తకం (ఒకటే పుస్తకం వుండేది) చివర్లో పాఠం.. అది చదివేస్తే.. హమ్మయ్యా.. ఒకటో తరగతి అయిపోయినట్టే..
-- సరిదే నాగ్

అతని కంటి చివరల నుంచి జారిన కన్నీటి చుక్క..

అతని కంటి చివరల నుంచి జారిన కన్నీటి చుక్క..
చాలానే చెప్పాలని..
మందులు తెస్తాడని ఎదురు చూసే తల్లికి..
మిఠాయి పొట్లం కోసం ఎదురు చూసే చంటిదానికి..
అదే చివరి వీడ్కోలు అని తెలీక గుమ్మం వరకూ వచ్చి వీడ్కోలు పలికిన భార్యకి..
ఇంకా..ఇంటిల్లిపాదికీ..
ఏదో చెప్పాలని..
ఆత్రంగా.. వెచ్చగా కంటి చివరల జారిన కన్నీటి చుక్క..
చెంప మీదుగా జారి.. ఏమీ చెప్పకుండానే మట్టిలో మాయమైంది..
కంటి నుంచి ఆరిపోయిన అతని వెలుగులా..
అతనిని గమ్యం చేర్చడానికి పరుగులు తీసిన బైకు చక్రం..
గిర్రున తిరుగుతూనే వుంది.. పడినచోటే..
నల్లని రోడ్డుపై ఒలికిన ఆయిలు అతని ఎర్రని రక్తంతో కలిసి..
వర్ణాలు అద్దుకుంటోంది..
చుట్టూ జనం.. గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటూ..
అతనికి వినిపించదని తెల్సినా.. గట్టిగానే మాట్లాడుకుంటున్నారు..
ఎవరో ఫోన్ లో మాట్లాడుతున్నారు.. యాక్సిడెంట్ వివరాలు చెబుతున్నారు..
దూరంగా బైకు స్పీడో మీటరు.. 120 దగ్గర ఆగి వుంది..
మౌనంగా రోదిస్తూ..
-- సరిదే నాగ్

నల్లరేగడి మడిలో.. మండే నెగడు..

కళ్ల నిండుగా నింపుకున్నా..
తడిచిన నేలమ్మ అందం..
కడుపాకలి తీర్చే..
అంకురం ప్రసవించే గర్భం
అదిగో..
నల్లరేగడి మడిలో..
మండే నెగడు..
నల్ల నేలల్లో ఉదయించే..
తొలిపొద్దు సూరీడు
మొలక పురిటి స్నానాకొచ్చాడు సూడు
చిరుజల్లుల తోడుగా
వెన్నెలమామగా మారిండు
తాను తనైన వేళ..
పకపక మన్నాడు మబ్బుసాటు సంద్రుడు

-- సరిదే నాగ్

నువ్వు నవ్వలేదని

నువ్వు నవ్వలేదని
అలిగిన జాబిల్లి.. మబ్బుల చాటుకెళ్లాడు..
నీ చిరునవ్వు చిరుగాలి పంపితే..
వెలుగు చూస్తాడు..
నువ్వు పలకరించలేదని
పూబాల విచ్చుకోలేదు..
నీ పిలుపు తుమ్మెదై వాలితే..
పరిమళాలు వెదచల్లుతుంది..
నువ్వు స్పర్శించలేదని..
అలిగి సెలయేరు సవ్వడి లేదు..
నీ చిరుమువ్వల పాదాలు తాకిస్తే..
గలగలల జలపాతం పరుగులెత్తుతుంది..
నీ చూపు తాకలేదని
నా హృదయం స్పందించనండి
అలవోకగానైనా.. నా వంక చూస్తే..
వేయి జన్మలైనా.. బతికేస్తా..
--సరిదే నాగ్ 2015

సో.. ఇది ఆట కాదు యుద్దం..

టను ఆటలానే చూడాలి..
ఆస్వాదించాలి..
....
సారీ బాస్
ఆ స్థాయిని ఎప్పుడో దాటేశాం..
ఇది ఆటే అయితే 200 కోట్లు బెట్టింగులు ఎందుకు..
ఇది ఆటే అయితే ఒక్క ఆటతో వందల జీవితాలు రోడ్డున పడటం ఎందుకు..
ఇది ఆటే అయితే గెలిచిన టీమ్ కి ప్రభుత్వాలు ప్రజాధనంతో నజరానాలు ఎందుకు
ఇది ఆటే అయితే గెలిచే హాకీని వదిలేసి ఓడి పోతుందని తెలిసీ క్రికెట్ ఎందుకు చూడాలి
ఇది ఆటే అయితే దేశంలో సగానికిపైగా ప్రజలు అన్నిపనులూ మానేసి టీవీలకి ఎందుకు అతుక్కుపోయారు
ఇది ఆటే అయితే పాకిస్తాన్ బోర్డర్ లో అక్కడి సైనికిలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు..
ఇది ఆటే అయితే స్టేడియంలో ప్రజలు ఎందుకు ప్రార్థనలు చేస్తున్నారు
ఇది ఆటే అయితే గెలిచిన హాకీ టీం ని పొగడటం మానేసి..ఓడిన క్రికెట్ టీంని ఎందుకూ తెగడటం
సో..
ఇది ఆట కాదు యుద్దం..
ఆ సంగతి ప్రతి భారతీయుడికీ తెలుసు..
దురదృష్టం..
భారత ఆటగాళ్లకే తెలియలేదు..
యాడ్ ఫిల్మ్స్ లో సింగిల్ టేక్ తో ఓకే చేసే నైపుణ్యం వున్న మన ఆటగాళ్ళు..
ప్రతి మ్యాచ్ లో చివరికి ప్రాక్టీసులో కూడా ప్రజాధనం ఖర్చు చేసే ఆటగాళ్లు
ఒక్కడు.. ఒక్కడూ ఒంటి చేత్తో గెలిపించే అంకిత భావం లేకపోవడం
దురదృష్టమే..
నిజమే
గతంలో గెలిచారు చివరాటలో గెలిస్తే కదా గుర్తింపు
-- సరిదే నాగ్

ముత్యాలకే కాదు..

ముత్యాలకే కాదు..
కన్నీటి చుక్కకూ మెరుపుంది..
విలువుంది..
అందుకే వాటిని వృథా చేయడం లేదు..
ముత్యాల పెట్టెలో లాగానే..
హృదయపు గదిలో పెట్టి తాళం వేస్తున్నా..
నాకు తెలుసు.. ఏదో ఒకరోజు..
వాటి అవసరం వస్తుంది..
కన్నీరించే క్షణం తప్పక వస్తుంది..
మది కదిలించిన నాడు..
ఏడబాటు తప్పని నాడు..
అవే కదా నాకు ఆస్తి
-- సరిదే నాగ్

సంద్రం అంటే నాకిష్టం..

సంద్రం అంటే నాకిష్టం..
అందుకే
ఆ నీళ్లను కళ్లల్లో బంధించేశా..
ఆ ఘోషను.. బడబాగ్నిని
హృదయంలో నిక్షిప్తం చేశా
ఒక్క క్షణం ఎగిసిన కెరటాన్ని చూస్తే..
ఉత్తేజం.. ఉత్సాహం..
విజయాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆనందం
-- సరిదే నాగ్

నా కవిత..

కళ్ల ముందు దృశ్యం.
కంటిలో నలుసై మెరిగినప్పుడు..
ఎదలో బాధ సుడులు తిరిగి
కన్నీరుగా జారినప్పుడు..
కడుపులో బడబాగ్ని వుండలేక
భళ్లున వెలికి వచ్చినప్పుడు
పేగులు మెలిపెట్టే ఘర్షణ.. హృదయాన్ని చేరి
మండించినప్పుడు
భావం బాకులా హృదయాన్ని
ముక్కలు చేస్తున్నప్పుడు
నరనరాల్లో వేదన ప్రవహించి..
గుండె నాళాల్లో తిష్టవేసి..
ఊపిరి ఆగిపోతున్నప్పుడు
వేదన అక్షరాలై..
రోదన పదాలుగా రూపుదిద్ది..
కడుపు చించుకుని వచ్చేదే
కవిత..!!!!
నా కవిత..
--సరిదే నాగ్

జగన్నాటకం..

రుద్రభూమిలో శవాల యుద్దం
ఆరడుగుల నేల కోసం..
చెట్టుపై రాబందుల గోల
పీనుగలో వాటా కోసం
గుడిమెట్లపై ముష్టివాళ్ల పోట్లాట
అడుక్కునే జాగా కోసం
బురదలో జలగల పోటీ..
పశువుల రక్తం పీల్చడం కోసం
వీధిలో కుక్కల అరుపులు..
ఎంగిలి విస్తరి కోసం..
చీకట్లో చీరల కన్నీటాట..
నాలుగు కాసుల కోసం..
రోడ్డుపక్కన చిన్నారుల భిక్షాట
పిడికెడు మెతుకుల కోసం..
జగమంతా .. ఆరాటం..పోరాటం..
దారిద్ర రక్కసి వికటాట్టహాసం..
.........
ఇవన్నీ చూస్తూ.. భగవంతుని
జగన్నాటకం.. అదీ ఆటే..
-- సరిదే నాగ్ (2015)

శపించుతల్లి ఈ బుద్దిహీనులని..

అంతరిక్షాన్ని ఏలుతున్నాం.,
పసిపాపను కాపాడలేకపోయాం..
మింగింది బోరుబావి కాదు,.
నిలువెత్తు మా నిర్లక్ష్యం
శపించుతల్లి ఈ బుద్దిహీనులని..
శిక్షించు చిన్నారీ ఈ అసమర్థులని..
ఆచిరునవ్వు చాలమ్మ మాగుండెలు మండించడానికి
నీ మౌనం చాలు మమ్మల్ని మేము ప్రశ్నించుకోడానికి
నీ ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటూ..
సరిదే నాగ్

నువ్వు.. ఎవరు..

కనుల ఎదురుగా నువ్వు
కనులు మూస్తే.. కల వు
కనులు తెరిస్తే.. కన్నీరు వు
కలతలో ఓదార్పువు..
మనసు వేదనలో నలిగే వేళ..
మదిలో గిలిగింతలు పెడతావు
ఓటమి చెంది కుమిలే వేళ
చెలిమి చేతిని అందిస్తావు..
గుండెలవిసి.. ఒంటరినైతే..
మమతల కోవెల కడతావు
మనసుకు దగ్గరైన నువ్వు..
ఎవరు..?
మనసు పూపొదను కదిపి వెళ్లిన
ఓ అనామికా
నువ్వు.. ఎవరు..
-- సరిదే నాగ్

కొత్త బంగారు లోకం

తిరగని గడియారం..
శభ్దం వచ్చే ఫ్యాను
శొట్టపడిన మరచెంబు..
చూరులో పిచ్చికల రొద..
దేవుడి పటం దగ్గర సగం కాలిన అగరొత్తి
గదిలో నువ్వు నేనూ..
నలభైయేళ్లుగా..
నాకు నువ్వు.. నేను నేనే..
అదే ప్రపంచం..
చిరాకులు.. పరాకులు
ప్రేమ పలవరింతలు.
ప్రతిదినం.. అనుక్షణం..
కొత్తగా మలచుకుంటూ..
ప్రతిరోజూ కొత్త కాపురం
ప్రేమైక జీవనం..
బ్రేకప్ లు.. భేషజాలు లేని ప్రపంచం
జీవన సంద్రం.. కష్టాలతో చిలకరిస్తే..
ప్రభవించిన ప్రేమామృతం..
ముదివయసు ప్రేమికుల
కొత్త బంగారు లోకం
----సరిదే నాగ్

జనం నైజం

// జనం నైజం//
అంతా.. అది గమనించారు..
ఇదేమిటీ అనుకున్నారు..
ఇంత దారుణమా అని కూడా..
అడ్డుకోవాలనుకున్నారు..
అసలు ఇది ఊరా వల్లకాడా..
కొందరు గొణుక్కున్నారు..
అడగాల్సిందే యువకుల ఆవేశం..
అడ్దుకోవల్సిందే యువతుల ఆక్రందన..
అయ్యో.. కలికాలం.. వృద్దుల వైరాగ్యం..
పాపమమ్మా.. ఇదెక్కడి అన్యాయం.. దీర్గం తీసిందో అమ్మ..
పది నిమిషాలు గడిచింది..
......
ఏమీ మారలేదు..
ఎవరి అడుగూ పడలేదు..
ఎవరి నోరూ పెగలలేదు..
అంతా ఎవరి పనుల్లో వాళ్లు..
కాలం కదిలి పోతోంది..
అన్యాయం.. అదుపు లేకుండా జరిగిపోతోంది..
మళ్లీ కొత్త జనం..
ఇదేమిటీ.. ఇంత దారుణమా..
మళ్లీ మామూలే..
జనం.. గొర్రె మొహం జీవులే..
--సరిదే నాగ్

నే విజేతను

// నే విజేతను //
ఆ ఆకాశ హార్మ్యంలో..
ఆ మూల గదిలో..
నీ రాక కోసం ఎదురు చూస్తూ..
నేను దీనంగా
మేళ తాళాల విజయగీతికల మధ్య..
నీ పిలుపు కోసం ఆశగా..
చుట్టూ వందిగామాదులు..
నే ఒంటరిగా..
స్త్రోత్రపాఠాలు.. పలకరింపులు.
నే మూగగా..
ఎవరోయి నీవు..
అన్నీ వున్న నన్ను
నీ ముందు మోకరిల్లేలా చేశావు..
ఏమీ కానను కున్న నన్ను..
నీ హృదయ సింహాసనంపై నిలిపావు..
నీ మునివేలి స్పర్శ ఇచ్చిన దైర్యంతో చెబుతున్నా..
నే విజేతను..
నీ హృదయ సామ్రాజ్యానికి నేనే పాలికను
ఒంటరి స్వర్గానికి అధినేతను..
నే విజేతను
-- సరిదే నాగ్

కనులు మూస్తే.. కలలొస్తాయ్..

కనులు మూస్తే..
కలలొస్తాయ్..
కన్ను తెరిస్తే..
కన్నీరిస్తాయ్..
నా కనులవాకిట నిలిచిన నీకు..
నా కలలు తెలియవా.. విడ్డూరం
నా మనసులో కొలువైన నీకు..
నా మనసు తెలీదా నా ప్రారబ్దం
మల్లెకేం తెలుసు విరహం..
విరిసి.. సువాసన చల్లి మాడిపోతుంది..
వెన్నెలకేం తెలుసు వేదన..
వెలుగులు కుమ్మరించి కరిగిపోతుంది..
నా భ్రమ కానీ..
రాతిపై విత్తు మొలకెత్తుతుందా..
నీ మనసులో..
ప్రేమ చిగురిస్తుందా..
--సరిదే నాగ్ (2015)

నా శత్రువులే .. నా గురువులు

నా శత్రువులే .. నా గురువులు
ఎందుకంటే..
జీవితానికి ఎదురీదడం నేర్పింది వారే..
ఎందుకంటే..
ఎలా ప్రశ్నించాలో చెప్పింది వాళ్లే..
కాలికి తగిలిన తొలి రాయి..
మనసున కలిగిన తొలి గాయం..
వెన్ను తట్టిన తొలి మోసం..
ఒంటరిని చేసిన తొలి అవమానం..
అన్నీ అన్నీ.. నా గురువులే
ఎలా నడవ కూడదో చూపిన.. ఎలా బతక కూడదో చెప్పిన..
బాధ దిగమింగడం నేర్పిన.. అవమానం తట్టుకోవడం అలవాటు చేసిన..
చివరికి
ఎలా నిలవాలో.. ఎలా గెలవాలో.. ఎలా ధిక్కరించాలో చూపించింది వారే..
నా శత్రువులే నా గురువులు..
అందుకే వారికి గురుపౌర్ణమి శుభాకాంక్షలు
--- సరిదే నాగ్

మనసా.. కుశలమా..!!

అక్షరాలు పరిమళిస్తున్నాయి..
భావాలు గుభాళిస్తున్నాయి..
పదాలు వెన్నెళ్లో ఆడపిల్లలవుతున్నాయి
......
.......
నాకు నేను రాసుకున్న
నీ లేఖలో..
మనసా.. కుశలమా..!!
-- సరిదే నాగ్

అనుకుంటాం కానీ..

అనుకుంటాం కానీ..
అనుభవాలు మహా చెడ్డవి..
వెంటాడేస్తాయి.. వేదిస్తాయి
ఆకురాయిలా మనసుని రాపాడిస్తాయి..
చుక్క చుక్కగా కన్నీరు రాలుస్తాయి..
క్షణ క్షణానికి బలపడే తుపానులా..
హృదయాన్ని పట్టి కుదుపుతాయి..
వేదనల తీరం దాటి..
నిస్సహాయ.. ప్రశాంతతనిస్తాయి..
ఓ బలహీన క్షణాన..
మనసు వాయుగుండంలో మళ్లీ విజృంభిస్తాయి..
అనుభవాలు మహా దుర్మార్గమైనవి..
కన్నీటి దాహం ఎక్కువ వాటికి
-- సరిదే నాగ్

నీ కెంత నమ్మకం..

నీ కెంత నమ్మకం..
నీ చిరునవ్వు అస్త్రంతో నన్ను గెలవొచ్చని..
నీ దెంత ధీమా..
నీ వాల్జెడ వయ్యారానికి నే చిత్తవుతానని
నీ కెంత పొగరూ..
నీ పెదవి విరుపు కోసం పడిచస్తానని
నా కంతే గర్వం..
ఈ అందాలన్నీ నా సొంతమని..
నా మనసులో బంధీ అని
-- సరిదే నాగ్

నిశీది వినిపించే నిశ్శబ్ద సంగీతం..

నిశీది వినిపించే నిశ్శబ్ద సంగీతం..
చిరుగాలి స్పర్శ లోని ఆత్మీయం..
పచ్చిక పరుపులోని మెత్తదనం..
వెన్నెల వెలుగులోని అందం..
విరిసిన మల్లెలోని సౌగంధం..
నిన్ను గుర్తు చేస్తున్నాయి..
మనసును మెలిపెడుతున్నాయి
-- సరిదే నాగ్

నిన్ను చదవడం మొదలు పెట్టా..

నిన్ను చదవడం మొదలు పెట్టా..
అదేమి చిత్రమో
ఎన్ని ఏళ్లు గడిచినా..
మొదటి పేజీలోనే వున్నా..
--సరిదే నాగ్

మీరొస్తారా.. నే వెళ్తున్నా..

మీరొస్తారా..
నే వెళ్తున్నా..
వెలుగుల లోకానికి..
తుమ్మెదల తోటకి..
తువ్వాయిల వెంట పరుగు తీస్తూ..
గువ్వల కువకువలను వెదుక్కుంటూ
నే వెళ్తున్నా..
కోరలు.. కొమ్ములు లేని మనుష్యులున్న తోవకి
మాయా మర్మం తెలియని తీరాలకి
నే చేరుకుంటున్నా.. మీరొస్తారా
చిరుగాలి.. చిగురుటాకు.. చిన్న చినుకు.. చిరు వెన్నెల..
బోసినవ్వుల లోకానికి
విరుద్ద జాతులు జతకట్టే శాంతి వనానికి
పలవరిస్తూ.. శోధిస్తూ.. నే వెళ్తున్నా..
మీరొస్తారా..
-- సరిదే నాగ్

వెచ్చని తడిని గుండెల మీద మోస్తున్నా..

మనసు పుస్తకం తెరిచిన ప్రతిసారీ..
నీ జ్ఞాపకాల నెమలీక బయటపడుతూనే వుంది
రంగుల.. మెరుపుల మేళవింపుల ప్రియ కానుక
ఎంతో మురిపెంగా దాచుకున్నా
పుస్తకంలో పింఛం పిల్లలు పెడుతుందని ఎదురు చూసిన పసాడిలా..
నీ సాంగత్యం పునరావృతం అవుతుందని వేచివున్నా..
నెమలికన్ను తింటుందనే భ్రమలో మేతపెట్టే చిన్నారిలా..
నీతో గడిపిన క్షణాలకు కన్నీళ్లు నైవేద్యమిస్తున్నా
నాకేం తెలుసు.. నాదీ పసోడి మనసని
సాధ్యం కాదని తెలిసీ కాలం గడిపేస్తున్నా..
మనసు పుస్తకం తెరిచి.. నీ గురుతుల పింఛం తడిమి చూస్తున్నా..
వెచ్చని తడిని గుండెల మీద మోస్తున్నా..
--సరిదే నాగ్

కాపాడుకుంటా..

దిక్కులు పిక్కుటిల్లేలా అరవక్కర్లేదు..
ఊపిరి బిగపట్టి.. బాకా ఊదక్కర్లేదు..
బలమంతా ఉపయోగించి నగారా మోగించక్కర్లేదు..
నువ్వసలు పెదవి విప్పనే వద్దు..
కనురెప్ప ఎత్తి.. చూస్తే చాలు..
పెదవి చివర చిరునవ్వు చాలు..
వేల పిలుపులు.. మరెన్నో .. సందేశాలు..
అది చాలు..
సైన్యమై నీ వెనుక నడుస్తా..
ధుర్గమై నిన్ను కాచుకుంటా..
దూసుకొచ్చే శర పరంపరకు నా హృదయం డాలును చేస్తా..
కవచమై.. నిన్ను దాచుకుంటా..
కాపాడుకుంటా..
-- సరిదే నాగ్

ఆకురాలిన ప్రతి సారీ..

ఆకురాలిన ప్రతి సారీ..
మొక్క ఉలిక్కిపడుతుంది..
ఎండిన ఆకైనా.. తల ఊపి వీడ్కోలు పలుకుతుంది
ఆ రాలిన చోటే మొలకొస్తే.. పులకిస్తుంది..
కొత్త ఆకు సొగసు చూసి .. మురిసిపోతుంది
ఆకురాలిన గాయం తలచుకుంటూ..
తొడిమ మెరుపుకు మురిసిపోతూ.. సాగుతుంది..
పై పైకి ఎదుగుతుంది.. కొమ్మ చేతులు విస్తరిస్తుంది..
చెట్టై.. మానై నీడనిస్తుంది.. కొత్త మొక్కలకు ఆలంభనవుతుంది..
ఆకురాలిన ప్రతి సారీ.. చెట్టు కుమిలిపోతే..
ఏండుటాకు రాలిన చోటే నిలిచిపోతే..
మొక్క చెట్టు కాదుగా..
పడినచోటే వుండి పోతే..
దగా పడిన మనసు పుంజుకోకపోతే..
అడుగులు పడకపోతే..
గతాన్ని మరుగున పెట్టకపోతే..
నువ్వులేవు నేస్తం.. నీ ప్రగతి శూన్యం..
మనసుపై పడిన ప్రతి దెబ్బా.. బలం కావాలి
గుండె కార్చిన కన్నీరు.. అమృతంగా మారాలి
నిలిచి చూపు నేస్తం.. నీ నీడకే వస్తారా జనం
-- సరిదే నాగ్ (2016)

గుండెని పిడికెట్లో పట్టి

రబ్బర బ్యాండ్ ని బాగా సాగదీసి..
ఒక్కసారిగా గుండెపై లాగి కొడితే..
ఎలా వుంటుందో తెలుసా...
గుండెని పిడికెట్లో పట్టి బలంగా నొక్కితే..
మనసుని మునివేళ్లతో పట్టి లాగితే..
.....
......
.......
ఎప్పుడైనా అనుభవంలోకి వచ్చిందా..
నాకు కొన్నేళ్లుగా వస్తూనే వుంది..
నీ ఎడబాటుతో..
-- సరిదే నాగ్

మనం కవలలం..

మనం కవలలం..
పుట్టుకతోనే మన పక్కనే ..
చావునీ తోడు తెచ్చుకున్నాం..
అందుకే .. మనం
చావు పుట్టుకల కవలలం
ప్రతియేడూ పెరిగే పెద్దరికం..
చావుకు దగ్గర తనం
తెలియక గొప్పగా అనుకుంటాం..
ప్రేమను అణిచేసి.. పెత్తనం చెలాయిస్తాం..
ఎంత సంపాదించినా.. ఎన్ని సాధించినా..
మృత్యువును తప్పించుకోలేం..
అందుకే..
మంచిని చేద్దాం..
మనసులు గెలుద్దాం..
మనం లేకున్నా..
మన రూపాన్ని.. భావాల్ని..
మనవాళ్ల మదిలో వదిలి వెల్దాం
-- సరిదే నాగ్

రాత్రంతా.. నీ జ్ఞాపకాల జాతర

నిదురించే వేళ..
కనురెప్పపై కదలాడే రూపం..
మదిని కలవరపరిచే జ్ఞాపకం నీదే..
వెలిగే తెల్లని పూలు.. చుక్కలు
వెన్నెల వలని పరిచే చంద్రుడు
నువ్వు పంపిన దూతలేమో..
ఒక్క క్షణం నిద్రపోనివ్వరే..
చిరుగాలి.. మేనిపై నీ స్పర్శను గుర్తు చేస్తుంటే..
పెదవిపై చిరునవ్వు మొలుస్తోంది..
ఇంకెక్కడి నిదుర..
రాత్రంతా.. నీ జ్ఞాపకాల జాతర
-- సరిదే నాగ్

ప్చ్.. ఇంతే లోకం.

నెమలి ఈకని పుస్తకంలో దాస్తే..
పిల్లల్ని పెడుతుందట..
దానికి తాటి ఆకు పూవారం ఆహారమట..
ఎంత అమాయకత్వం..
జామకాయను చొక్కాతో మూసి కొరికితే 
ఎంగిలి కాదట.
కాలికి పలక తగిలితే చదువు రాదట..
నిజమేనేమో..
ఆ అమాయకత్వమే బావుంది..
నిజం కాకున్నా.. నిజమని నమ్మడమే ఆనందమిచ్చింది..
జ్ఞానం పెరిగి ఏం లాభం..
మోసపోవడం.. మోసగించడం
ప్చ్.. ఇంతే లోకం..
-- సరిదే నాగ్

చిత్తు పుస్తకం

బహుశా చిన్నతనంలోనే పొదుపు మంత్రం..
ఓ మధుర జ్ఞాపకం
మన చిత్తు పుస్తకం..
ఒకే నోట్ పుస్తకంలో 
కొన్ని తెల్లకాగితాలు..
మరికొన్ని డబుల్ రూళ్లు..
ఇంకొన్ని సింగిల్ రూల్..
ఆపై ఫోర్ రూళ్లూ పేపర్లు..
నానాజాతి సమితిలా..
మొత్తం అన్నీ ఒకే పుస్తకంలో వుంటే..
అదే రఫ్ బుక్కు..
గుర్తుందా..
ముందు తరగతిలోని నోట్స్ పుస్తకాల్లో మిగిలిన కాగితాలు అన్నీ తీసి..
ప్రెస్ లో బైండింగ్ చేయించిన పుస్తకం..
ప్రతి ఒక్కరి పుస్తకాల దొంతరలో ఇది వుండాల్సిందే..
ఇప్పుడైతే.. కార్పొరెట్ కాన్వెంట్లలో వాళ్లు అమ్మిన పుస్తకాలే కొనాలి.. వాడాలి..
పాత పుస్తకాలు వినియోగిస్తామంటే.. ఒప్పుకోరే..
వాళ్ల వ్యాపారం పడిపోదూ..
అయినా
చిత్తు పుస్తకం ఓ మధుర జ్ఞాపకం..
-- సరిదే నాగ్

ప్రేమదేముందీ..

ప్రేమదేముందీ..
ఎన్నిసార్లైనా ప్రేమించొచ్చు..
నువ్వు కనిపించిన ప్రతిమారూ..
నువ్వు పలకరించిన బోలెడు సందర్బాల్లో
నువ్వు గుర్తొచ్చిన్న అన్ని క్షణాల్లో..
మళ్లీ మళ్లీ
ప్రేమించొచ్చు..
పాత ప్రేమనే
కొత్తగా..
ఎన్నేళ్లయినా..
యుగాలైనా..
నువ్వు లేకున్నా..
నా ఊపిరి ఆగేదాకా
-- సరిదే నాగ్
రోజంతా మగ్గం కదిలినా..
ఆకలి తీరడం లేదు..
అలుపెరగక చరఖా తిరిగినా..
పూట గడవడం లేదు..
పడుగూ పేకలను కలిపినా..
బతుకు తెల్లారడం లేదు..
అగ్గిపెట్టెలో పట్టే ఆరడుగుల చీర నేసిన నైపుణ్యం..
సర్కారుకు ఆనడం లేదు..
దునియాకి నాగరికత నేర్పిన నేతన్న..
మగ్గం గోతులే నీకు సమాదులు..
జాంథానీ జిలుగులెన్ని వున్నా..
నీ కళ్లల్లో వెలుగు లేదు..
రంగు బట్టనేసినా..
నీ బతుకున రంగవళ్లి లేదు
పవర్ లూములొచ్చి పనిని కొల్లగొడితే..
కర్ర మగ్గం కుంగతీసి రోగాల పాల్జేసింది..
గోతిలోని దోమలు విషజ్వరాలు తెస్తే..
నాడి పరుగులు కీళ్ల వాతాలిచ్చింది..
మర మగ్గమొచ్చి..
చెయ్యి విరిచేసింది..
జీఎస్సీ ఎస్టీ వచ్చి..
నెత్తిన తాటి పండేస్తోంది..
అంబాసిడర్లేమి చేస్తారంటే..
పంచ్ డౌలాగులేసి.. సెల్ఫీలు దిగుతారంతే..
-- సరిదే నాగ్
నేడు చేనేత దినోత్సవం అట..
రాళ్లే.. డైనింగ్ టేబుళ్లు..
పల్చని సాంబారు.. వంకాయ కూరే..
పంచ భక్ష్య పరమాన్నాలు
చుట్టూ ఎలా వుంటే ఏం..
నందనవనమే కదా..
నేస్తం.. నీతో పంచుకున్న అన్నం..
అమృత సమానం..
దేవతలు సైతం పోటీ పడరా..
ఓ ముద్దకోసం..
-- సరిదే నాగ్

బాధ గులక రాయి అయితే

బాధ గులక రాయి అయితే విసిరేయొచ్చు..
దుఃఖం బండరాయి అయితే భరించేయొచ్చు..
వేదన భరించలేని పర్వతం అయితే..
... నలిగిపోవడమే
.....
.....
నలిగిపోతున్నా...
...
....
ఆనందంగా
(బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్ అన్నాడుగా కవి)
-- సరిదే నాగ్

ఆలుమందలు

ఆలుమందలు
వెన్నముద్దలు..
గోపికల ముద్దులే కాదు..
యశోదమ్మ మొట్టికాయలు..
కంసుడి పిడిగుద్దులూ
నీలాప నిందలు..
కపట నాటక ఆరోపణలు..
కురుక్షేత్ర క్లేశాలు
గీతోపదేశాలూ
కృష్ణుడికే..
....
....
అందుకే రాముడే కాదు..
కృష్ణుడూ మన జీవితాలకు ఓ రోల్ మోడలే
కృష్ణ జయంతి శుభాకాంక్షలు
-- సరిదే నాగ్

సంజీవిని అంటే..

సంజీవిని అంటే..
నీ పెదవి విరుపులో చిరునవ్వే కదా..
నాలో ప్రాణం నిలిపేది..
అమృతం అంటే..
నీ పెదవి నుంచి జారిన నీటి చుక్కే కదా...
నాలో చైతన్యం నింపేది..
ఈ సత్యం తెలిస్తే..
దేవతలే క్యూ కడతారేమో..
నీ గుండె వాకిట..
వాళ్లకేం తెలుసు..
అది ఖాలీ కాదని..
నేనెప్పుడో తిష్టవేశానని..
-- సరిదే నాగ్

అదిగో .. కోనేరు గట్టు



అదిగో ..
కోనేరు గట్టు మధ్య మెట్టు మీద..
పాదాలకు తాకుతున్న నీరు..
గాలి తాకిడికి అలలు చేసే సవ్వడి 
గుడి ధ్వజస్తంభం మీది చిరు గంటల శబ్దాలు
గాలిలో నాగమల్లి పూల పరిమళం..
ఒడిలో తిలక్ వర్షం కురిసిన రాత్రి..
చెవిలో నువ్వు చెప్పిన ఊసులు..
మదిలో నీ జ్ఞాపకాల గిలిగింతలు..
-- సరిదే నాగ్

నీ మౌనం చాలు

హృదయం బద్దలు కావడానికి..
అణుబాంబులేమీ అవసరం లేదు..
.....
......
......
నీ మౌనం చాలు
-- సరిదే నాగ్

మట్టి గణపతులనే పూజిద్దాం..

ఓ పదేళ్ల క్రితం వరకూ మా పిఠాపురంలో సుమారు 30 మంది కుమ్మరి కార్మికులు వుండేవారు.
ఇప్పుడు చూస్తే.. ఓ మూడు కుటుంబాల వారు మాత్రమే కుమ్మరి పని చేస్తున్నారు. 
వారిలో ఓ కుటుంబం అయితే అప్పుడప్పుడే ఈ పని చేస్తున్నారు.
అంటే.. ఓ పదేళ్లలో కుమ్మరి పని వారికి ఉపాధిలేక,
కుండలు, కుండీలు, కూజాలు, మట్టి దాకలు, సిబ్బిలు, డిబ్బీలు కొనేవాళ్లు లేక ఆయా కుటుంబాలు ప్రత్యామ్యాయ వృత్తులకు వలస వెళ్లిపోయాయి.
బతకలేక కుల వృత్తిని వాళ్ళు వదులుకున్నారు.
ఓ అందమైన అరుదైన కళ ఇలా కనుమరుగై పోతోంది..
మట్టి నుంచి అపురూప వస్తు సంపదను రూపొందించే వృత్తిదారులు మాయమైపోతున్నారు.
ఈ కళను కాపాడాలంటే కుమ్మరి వృత్తిదారులను ప్రోత్సహించాలి.
వారు తయారు చేసిన వస్తువులు అన్నీ కాకపోయినా..
కనీసం ఏడాదికి ఒక సారి వచ్చే వినాయక చవితికి మట్టి బొమ్మలు
దీపావళీకి మట్టి ప్రమిదలు, చిచ్చుబుడ్లు మట్టివే కొనుగోలు చేయాలి.
దీనివల్ల పర్యావరణాన్ని పరిరక్షించడంలో మన వంతు పాత్ర మనం పోషించడమే కాదు
మాయమైపోతున్న కుమ్మరి వృత్తిని .. ఆ కళని బతికించుకున్నవాళ్లం అవుతాం
......
మట్టి గణపతులనే పూజిద్దాం..
పర్యావరణాన్ని కాపాడుకుందాం..
కుమ్మరి కళను బతికించుకుందాం.. ✍️
-- సరిదే నాగ్

సాధ్యం అయితే ప్రయాణం చేయాలి

సాధ్యం అయితే ప్రయాణం చేయాలి
సూట్ కేసులు.. తినుబండారాలు.. వాటర్ బాటిల్స్ ఇవేవీ లేకుండా..
అప్పగింతలు.. ఒప్పందాలు.. కాకుండా..
ఇగోలు.. కోపతాపాలు.. టిక్కెట్లు గట్రా లేకుండా..
ఎవరో చూస్తున్నారని.. ఏదో అనుకుంటారని.. ఇంకేదో ఫీల్ అవుతారని.. అనుకోకుండా..
ప్రయాణం కట్టాలి..
మనలోనికి.. లోలోనికి..
అన్నీ వదిలి..
వెలుగు నిండిన మనసుతో..
నిండా వెలుగుతో..
తొణికిసలాడే ప్రేమతో..
ప్రయాణం చేయాలి..
పెదవిపై చిరునవ్వు..
ముఖంపై ఆనందపు వెలుగు..
హృదయం నిండా నువ్వు..
వెళ్లాలి..
లోలోపలికి..
అన్నీ మరిచి..
అన్నీ వదిలి..
నీ చేయందుకుని..
ఎవరూ లేని తావులకి..
భూమాకాశాలు కనిపించని లోకాలకి..
పయణమవ్వాలి..
నువ్వొస్తావా..
పిచ్చి ప్రశ్న..
నువ్వు రాకుండా నేను వెళ్లలేనుగా
-- సరిదే నాగ్

అద్భుతం..

అద్భుతం..
ఐదున్నర అడుగుల అబ్బురం..
ఆకాశమే గొడుగు పట్టిన అందం
అడుగు కింద నలిగిన గరిక పరవశం..
. ఆ నవ్వే.. నువ్వే.
మైమరుపే..!
-- సరిదే నాగ్