Thursday 27 October 2016

kummari కుమ్మరి prameda


ఆ వేళ్లకు ఇంద్రజాలం తెలుసు..
మట్టి నుంచి కళాఖండాల్ని తీస్తోంది..
అతని చేయి తగిలిన మన్ను.. 
మురిసి మెలికలు తిరుగుతోంది.. 
కరిగి మృణ పుష్పంలా విరబూస్తోంది..
అతని చమటకు పరిమళం వుంది..
మట్టితో కలిసి గుభాళీస్తోంది..
గిర్రున తిరిగే 'సారె' అక్షయ పాత్ర అనుకుంటా..
ఎన్ని పాత్రలు సృష్టిస్తొందో.. 
మట్టి నుంచి అతను చక చకా ప్రమిదలు తీస్తుంటే..
నా కనులు ఆల్చిప్పలయ్యాయి..
మనిషిని చేసినోడు బ్రహ్మ అయితే..
మట్టిని ముంతచేసినోడూ బ్రహ్మే కథా..
----


 మట్టిప్రమిదల్లో నూనె దీపం మన సంప్రదాయం..
కుమ్మరి సారెపై చేసిన ప్రమిదలతోనే దివ్వెల పండుగ  చేసుకుందాం
చైనా మతాబులొద్దు.. కుండ చిచ్చుబుడ్డే వెలిగిద్దాం..
మన కళను బతికిద్దాం.. కుమ్మరన్నను కాపాడుకుందాం

-- సరిదే నాగ్
నోట్ : కాపీ చేయొద్దు, షేర్ చేసుకోవచ్చు

ఫోటో : మా


కుమ్మరి వీధిలో ప్రమిదలు, చిచ్చుబుడ్డి గుల్లలు చేస్తున్న కార్మికుడు

Tuesday 25 October 2016

cheeramenu చీరమేను చిరుమేను

గోదారి ప్రజలు.. కోనసీమ వాసులకు మాత్రమే ప్రకృతి ఇచ్చిన మరో వరం చీరమేను



సేమియాలా తెల్లగా పొడవుగా కనిపిస్తున్నవి చేపలు.
చేప పిల్లలు
వీటిని సేరుమేను, చీరమేను, చిరుమేను అని పిలుస్తారు.  
గోదావరి తీరంలోని ప్రజలకు మాత్రమే లభించే మరో మత్స్య సంపద ఈ చీరమేను.
ఇవి ఒక జాతి చేపల పిల్లలు. ఎక్కువగా గోదావరి ఎర్రనీరు వచ్చే సమయంలో ఈ చీరమేను లభిస్తుంది. దసరా నుంచి దీపాలవళీ వరకూ ఇవి లభిస్తాయి. 
మత్స్యకారులు వీటిని రంగుల చీరలు వలలా చేసి పట్టడం వల్ల వీటిని చీరమేనులు అంటారు. 
అతిచిన్న చేపలు కావడం వల్ల ఇవి సాదారణ వలలకు దొరకవు.
గుంపుగా వేలు లక్షల సంఖ్యలో సంచరించే చేపల్ని మత్స్యకారులు పట్టి అమ్ముతారు. 
అలాగే అతి చిన్న శరీరం కలిగి వున్నందున్న వీటిని చిరుమేను అని కూడా అంటారు. 
ఇంకో విశేషం వీటిని సోల, తవ్వా, శేరు లెక్కల్లో అమ్ముతారు. 
ఒక శేరు రూ. వేయి వరకూ పలుకుతోంది. శేరుల లెక్కన అమ్ముతారు కాబట్టి వీటిని శేరుమేను అని కూడా పిలుస్తారు. గతంలో కుంచం చీరమేను రూ.3వేలు వుండేది. 
పులసకు ఎంత ప్రాశస్త్యం వుందో గోదావరి తీరంలో చీరమేనుకూ అంతే డిమాండ్ వుంది 
క్యారేజీలు, బిందెలల్లో వీటిని తెచ్చి అమ్ముతారు. 
చీరమేనుతో మషాలా పెట్టి పిట్టు వండుతారు, గారెలు చేస్తారు. 
చాలా రుచిగా వుంటుంది.  దీనిని వండితే బాసుమతి బియ్యంతో బిరియానీ చేసినట్టుగా వుంటుంది. 
అంత రుచీ వుంటుంది.  గారెలైతే చెప్పక్కర్లేదు.. అద్భుతమైన రుచి. అందుకే అంత రేటు.
-- సరిదే నాగ్
ఫోటో : బిందె, బకెట్ల లో చీరమేను, సోల, తవ్వా లెక్కల్లో చీరమేను అమ్ముతున్న మత్య్సకార మహిళ
నోట్ : కాపీ చేయొద్దు, షేర్ చేసుకోవచ్చు

Saturday 22 October 2016

పసోడి నెత్తిన పచ్చగడ్డి బరువు

పసోడి నెత్తిన పచ్చగడ్డి బరువు
పశువు గిట్టలకింద ఆడి చదువు.
పొట్టకోయనక్కర్లేదు.. ఆడిపొట్టలేవు అక్షరాలు..
పాలికాపుతనమే ఆడి ఇంటికి ఆదరవు
ఊరికే అరుస్తాయి పేగులు ఆకలి అరుపు..
బలిసినోళ్ల బ్రహ్మ చెవుడు..
అందుకే వినిపించదు పిల్లోడి గోడు
నేతల నాలుకకు నరం లేదు..
చెప్పిందే చెబుతాయి అభ్యుదయం అబద్దాలు..
గ్రామ ప్రగతే దేశ ప్రగతి..
బాపూ చూడు ఈ బుడ్డోడి గతి
స్వరాజ్యమిచ్చి.. చక్కా పోయావు
సురాజ్యం కాస్తా అసురుల పాల్చేశావు
పెంటకుప్పలపై రేపటి బాలలు..
మెతుకులేరుతున్నారు చూడు
మహాత్మా మళ్లీ పుట్టొద్దు..
అసమర్థులు.. అయోగ్యుల చేతిలో దేశాన్ని పెట్టొద్దు..
మరోసారి ఆ తప్పు మళ్లీ చేయొద్దు..
-- సరిదే నాగ్
ఫోటో : కొత్తపల్లి మండలం రామ రాఘవపురం లో తీసింది

ఊరు 'చివరి' ఫోటోవు.. Sez village

ఊరు 'చివరి' ఫోటోవు..
అందరికీ ఎలా అర్థం అయినా..
నిజమైన అర్థం తూర్పు గోదావరి జిల్లా యు. కొత్తపల్లి మండలం రావివారి పోడు గ్రామస్తులకు మాత్రం ఖచ్చితంగా తెలుసు.
అవును ఇది ఆ ఊరి శివర తీసినదే..
కానీ ఇదే ఆ ఊరికి చివరి ఫోటోవు అయినా ఆశ్చర్యం లేదు
రావివారి పోడు సహా 14 గ్రామాల్లో భూములను ప్రత్యేక ఆర్థిక మండలి కోసం తీసుకున్నారు
ఏకంగా 8వేల ఎకరాలను ప్రభుత్వం ఈ ప్రాంతంలో సేకరించింది.
(దేశంలో అతిపెద్ద భూ సేకరణల్లో ఇదొకటి)
సెజ్ ల లాభాలు.. నష్టాలు చర్చ పక్కన పెడితే..
సెజ్ ప్రభావిత గ్రామాల్లో ప్రథానమైనది రావివారి పోడు. ఇతర గ్రామాలు లానే త్వరలోనే ఈ గ్రామం కనుమరుగైనా ఆశ్చర్యం లేదు..
అప్పుడు ఈ చెట్టూ వుండదు..
చెట్టుకింది హనుమంతు..
చప్టామీద ముసలి ఒరుగులూ..
ఏవీ ఏవీ వుండవు
అప్పుడు ఈ ఫోటోవు చివరి ఫోటోవు కావొచ్చు..
-- సరిదే నాగ్
నోట్ : కాపీ చేయొద్దు.. షేర్ చేసుకోవచ్చు

Saturday 1 October 2016

eduru choopu ఎదురు చూపు

చాలా రోజులు.. కాదు కాదు చాలా సంవత్సరాలు విరామం తర్వాత నేను రాసిన  కథ
ఈ రోజు ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది..
కొంచెం ఓపిక చేసుకుని చదవండి.. అభిప్రాయం చెప్పండి..
మరో కథరాసే ఓపిక.. వస్తుంది

ధన్యవాదాలు
-- సరిదే నాగ్