Thursday 28 July 2016

తాటి రొట్టె

ఇప్పుడే మిత్రుడు తెచ్చాడు..
తాటికాయలు..
ఘుమ ఘుమలాడుతున్నాయి..
ఖచ్చితంగా మూడు టెంకలుంటాయి..
ఒక పండు కాల్చాలి..
మరి రెండు పాసం తీసి..
 బియ్యం నూక,
 కొబ్బరి కోరు,
 పచ్చిశనగ పప్పు
 బెల్లం వేసి రొట్టె కాల్చాలి..
ఆ కాల్చేప్పుడు రొట్టెపైన మూత మీద ఎర్రని నిప్పులు వేస్తే.. సమంగా కాలుతుంది..
ఆ పైన ఎర్రగా కాలిన మాడు తింటే తియ్యగా కర కరలాడుతూ భలే వుంటుంది..
కొన్ని వంటలకి గ్యాస్ స్టౌ నిషేదమబ్బా.. తప్పకుండా కట్టెల పొయ్యి అయితేనే బెటర్..
అన్నట్టు తాటి రొట్టె కూడా పులస పులస మాదిరే.. రాత్రి కాల్చి.. ఉదయం తినాలి ..
భలే వుంటుంది..

-- సరిదే నాగ్

Friday 22 July 2016

గిరి రాజ గోవులు..


గిరి రాజ గోవులు..
గో మూత్రంలో బంగారం వుందని ఇటీవల వార్తలొచ్చాయి.. ఈ ఆవు మూత్రం గురించే..
వీటిని గాదరాడ గ్రామం శివారు ఫాం హౌస్ లో చూశాను.
చాలానే వున్నాయి..
నిండు పొదుగుతో కళ్లకింపుగా వున్నాయి..
ఒక్కో ఆవు సుమారు 15 లీటర్ల పాలిస్తుందట..?
తువ్వాలు భలే అందంగా వున్నాయి..
మరో విషయం  ఈ ఆవులు అన్నీ ఇటుక రంగులో ఎర్రగా వున్నాయి..
వీటి చెవులు చాలా పొడవుగా పెద్దగా ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి..
అన్నీ భలంగా భలే వున్నాయి..
-- సరిదే నాగ్
ఫోటో : గాదరాడ శివారు తీసింది
నోట్ : నచ్చితే షేర్ చేయండి, కాపీ మాత్రం చేయొద్దు

Sunday 17 July 2016

రాములోరు సీతమ్మ వారు గోదారొడ్డున Badhrachalam


రాములోరు సీతమ్మ వారు గోదారొడ్డున ఇదిగో ఈ రాతి పల్లెం లోనే పళ్లు విప్ప పూవు తినేవారట.
భద్రాచలం పర్ణశాలకు కొంత దూరంలో
గోదాట్లో  స్వామి స్నానానంతరం నడుముకు చుట్టుకుని భుజానికి వేసుకునే ఉత్తరీయం పెట్టిన గుర్తులు అట
సీతమ్మ వారు ఆరేసుకున్న నార చీర గుర్తులు కూడా ఇక్కడ చూడొచ్చు.
ఇవన్నీ ఇక్కడి వాళ్లు చెప్పినవే..
-- సరిదే నాగ్
ఫోటోలు : భద్రాచలంలో తీసినవి
నోట్ : నచ్చితే షేర్ చేయండి, కాపీ మాత్రం వద్దు


1 min ·
ఇదిగిదిగో నా రాముడు
ఈడనె కొలువుండినాడు
ముద్దుల సీతతో ఈడనె మురిపాలాడినాడు
ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నార చీరె
ఇదె రాముడు కట్టుకొనగ పులకించిన పంచె
ఏడేడు లోకాలను ఏలెడి పాదాలివే
..

రచన : జె.కె.భారవి
చిత్రం : శ్రీరామదాసు (2006)






"ఏడేడు లోకాలు ఏలే పాదాలివే.."

"ఏడేడు లోకాలు ఏలే పాదాలివే.."
రామచండ్రుడు గోదారొడ్డున కూర్చున్న
రాతి సింహాసనం అట.
స్వామి పాదాలు గోదారి జలాల్లో..
ఈ సింహాసనం ను చూసి అంచనా వేయొచ్చు.. ఆజాను బాహుని రూపం.. పొడవు
-- సరిదే నాగ్
ఫోటో : భద్రాచలం పర్ణశాల సమీపం
నోట్ : నచ్చితే షేర్ చేయండి కాపీ మాత్రం చేయొద్దు

భద్రాచలం క్షేత్రంలో శూర్పణక ముక్కు చెవులు కోసిన స్థలం

పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు ఒక్కో ఆలయం వద్ద ఒక్కో ప్రత్యేకత వుంటుంది.
క్షేత్ర పురాణాన్ని బట్టి కూడా నమ్మకాలు  ఏర్పడతాయి.
భద్రాచలం క్షేత్రంలో ఇలాంటివి కొంచెం ఎక్కువే.
రామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా ఇక్కడే వనవాసం చేశాడనే నమ్మకం వల్ల ఆ ప్రత్యేకతలు వచ్చాయేమో.
ఈ ప్రాంతంలోనే రాముడు పర్ణశాలను నిర్మించుకున్నట్టు చెబుతారు.
ఇదిగో ఈ రాళ్ల గుట్టను చూడండి
ఇక్కడే తొలుత రాముని మోహించి.. ఆపై లక్ష్మణుని వద్దకు వచ్చిన శూర్పణకను  లక్ష్మణుడు ఇక్కడే ముక్కు చెవులు కోసి శిక్షించాడట.
ఇక్కడ చిన్న రాళ్ల గుట్టలోనివి మూడు రాళ్లు తీసుకుని ఏదైనా కోరిక కోరుకుని, రాముని వంటి కష్టాలు మనకు రాకూడదని ప్రార్థించి వెనుకకు తిరిగి ఎడమ చేతితో ఆ మూడు రాళ్లనూ ఈ గుట్టలో పడేలా విసరాలట.
ఇదో నమ్మకం.
ఇక్కడో సాధువు కూర్చుని వుంటాడు. రాళ్లు విసిరాక బొట్టు పెట్టుకుని దక్షణ వేసి రావాలి.
ఏమో ఏ నమ్మకంలో ఏముందో.. అంత దూరం వెళ్లాక చేయడం వచ్చే నష్టం అయితే లేదు కదా అని
నేనూ ఓ మూడు రాళ్లు విసిరాను
ఏం కోరుకున్నానో మాత్రం అడక్కండి..
చెప్పకూడదట.

-- సరిదే నాగ్
ఫోటో :
భద్రాచలం క్షేత్రంలో శూర్పణక ముక్కు చెవులు కోసిన స్థలం ఇదేనట.
నోట్ : నచ్చితే షేర్ చేయండి, కాపీ మాత్రం చేయొద్దు

Saturday 16 July 2016

శివుని తలపై గంగమ్మ Durgada

శివుని తలపై గంగమ్మ అందరికీ తెల్సినదే.
చిత్రపటాల్లో మినహా ఆ గంగమ్మ మనకు ఎక్కడా శివుని శిరస్సుపై కనిపించదు
కానీ మా పిఠాపురం దగ్గర గ్రామం దుర్గాడలో మాత్రం ఆ అద్భుతం గోచరిస్తుంది
ఇక్కడి శివ పంచాయతన సమేత ఉమా రామలింగేశ్వర స్వామి వారి శిరస్సుపై కొలువు తీరిన గంగమ్మను చూడొచ్చు.
ఇక్కడ శివలింగంపై మరో శిల వుంటుంది. అదే గంగమ్మ
సుమారు 50 ఏళ్ల క్రితం దుర్గాడ ప్రాంతం అంతా కరువు కాటకాలతో వుండేదట.
సహజంగానే మెట్ట ప్రాంతం ఆపై వర్షాలు లేక పంటలు పండక ప్రజలు కష్టాలు పడేవారట.
ఆ సమయంలో ప్రస్తుతం ఈ శివలింగం ఆలయానికి ఎదురుగా గల కోనేటి లో లభించిందట. ఆ శివలింగంపై మరో రాయి వుండటం గ్రామస్తులు గమనించారు.
దైవజ్ఞులు, వేద పండితులు, గ్రామ పెద్దలు  ఆలోచించి శివాలయం నిర్మించారట
శివలింగంపై మరో రాయి శాస్త్ర సమ్మతం కానందున ఆ రాయిని కోనేటిలోనే వదిలేసి
శివలింగాన్ని మాత్రం ప్రతిష్టించారట. అయితే తెల్లారే సరికి చిత్రంగా ఆ శిల మళ్లీ శివలింగపైన అలాగే  వుందట. పురోహితులు ఆలోచించి ఆ రాయిని  దగ్గరలోని అన్నవరం పంపానదిలో నిమజ్జనం చేసి వచ్చారట. అయినా మళ్లీ రాయి శివలింగంపై ప్రత్యక్షం కావడంతో  పండితులు ఆ రాయి గంగాదేవిగా భావించి అలాగే వుంచి అభిషెకాలు నిర్వహించారట. శాస్త్ర రీత్యా..   సూర్యుడు, లక్ష్మీనారాయణుడు, ఉమా దేవి, గణపతి విగ్రహాలను ప్రతిష్టించి శివ పంచాయతన క్షేత్రం చేశారట.
అప్పటి నుంచీ గ్రామంలో కరువు దరి చేరలేదు. గ్రామంలో సుఖశాంతులు వెలసిల్లాయి. '
గ్రామస్తులే చందాలతో ఆలయాన్ని అభివృద్ది చేసారు.
ఇప్పటికీ ఆలయంలో శివలింగంపై మరో రాయి కనిపిస్తుంది
ప్రతి ఏటా తొలి ఏకాదశికి ఇక్కడ సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. గ్రామం మొత్తం ప్రతి గడప నుంచీ ఒక బిందెతో మహిళలు నీళ్లు తీసుకొచ్చి స్వామికి అభిషేకం నిర్వహిస్తారు.
ఎన్ని రాజకీయా పార్టీలు, విభేదాలు వున్నా శివాలయం విషయంలో గ్రామస్తులు అందరూ ఏకమవుతారు. తలో చేయి వేసి ప్రతి క్రతువూ ఘనంగా నిర్వహిస్తారు.
ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తులు ఆలయాన్ని చక్కగా అభివృద్ధి చేస్తున్నారు.
స్వామి వారిని వాళ్లు అలంకరించే తీరు ఆ శ్రద్ద అద్భుతం అనిపిస్తుంటుంది
ప్రతి విశేషమైన రోజునా వారు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులను ఆలయం వైపు రప్పిస్తారు.
ఈ క్రమంలోనే ఈ రోజు స్వామి వారికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పండుగ వాతావరణం నెలకొంది
ధన్యవాదాలు
ఫోటోలు : దుర్గాడ సహస్ర ఘటాభిషేకం దృశ్యాలు
నోట్ : నచ్చితే షేర్ చేయండి కాపీ మాత్రం చేయొద్దు








Friday 15 July 2016

తలుపులు చూడండి. ఏకంగా వైకుంఠ పాళీ

ఒక్కోసారి అనిపిస్తుంటుంది ..
వ్యక్తుల సృజనాత్మతకు హద్దులు లేవేమో అని..
తలుపులు చూడండి. ఏకంగా వైకుంఠ పాళీని తలుపులు మీద రంగులు వేశారు.
ఇది గాదరాడ  శివ శక్తి పీఠం వద్ద కనిపించింది.
తలుపులు ఈ తలుపులు తీసుకుని వెళ్తే  పరమ పద సోపానం అయిన శక్తి నిలయాన్ని చేరుకుంటాం
బహుశా ఆ సింబాలిక్ కోసమే ఇలా తలుపులపై రంగులు వేశారేమో నిర్వాహకులు
అయితే ఇంత పెద్ద వైకుంఠ పాళీని ఇన్ని రంగులు, బొమ్మలు తలుపులపై చిత్రీకరించిన చిత్రకారులు మాత్రం అభినందనీయులే.
ధన్యవాదాలు
-- సరిదే నాగ్
ఫోటో : గాదరాడ ఓం శివశక్తి పీఠం
నోట్ : నచ్చితే షేర్ చేయండి కాపీ మాత్రం చేయొద్దు
 

పలభా యంత్రం (సన్ డయల్..) Annavaram

పలభా యంత్రం (సన్ డయల్..)
మన పూర్వికుల కాల గణన జ్ఞానానికి ఇదొక నిదర్శనం.
తాటిచెట్టు, ఇంటి చూరు నీడను బట్టి టైం చెప్పేవాళ్లు, టైం అడిగితే తలపైకెత్తి సూర్యుని  చూసి ఖచ్చితంగా సమయం చెప్పేవాళ్లు ఇప్పటికీ గ్రామాల్లో వున్నారు.
మనమైతే చేతి గడియారం చూసే టైం కూడా లేక సెల్ ఫోన్ లో అంకెలు చూసి టైమెంతో చెబుతున్నాం..
సూర్య గమనాన్ని బట్టి.. దాని నీడను బట్టి ఖచ్చితమైన సమయాన్ని లెక్కించి చెప్పేదే సన్ డయల్..
ఇది అన్నవరం క్షేత్రంలో వుంది.  చాలా మందే చూసి వుంటారుకానీ ఇప్పటి పిల్లలకు ఆ శాస్త్ర విజ్ఞానాన్ని వివరించడం లేదని నా ఆవేదన.
ఈ సన్ డయల్ ని 1943 జిలై లో రాజమండ్రికి చెందిన  దైవజ్ఞ సార్వభౌమ బిరుదాంకితులు పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి గారు రూపొందించారట. దీని నిర్మాణాన్ని రాజా యినుగంటి వేంకట రాజ గోపాల రామ సూర్య ప్రకాశరావు బహద్దూర్ చేపట్టారట.
కొంతకాలానికి సన డయిల్ శిథిలం అవుతుండటంతో  1958 జూన్ లో పునర్నిర్మాణం కావించారట.
ధన్యవాదాలు
-- సరిదే నాగ్
ఫోటో : అన్నవరం సన్ డయల్
నోట్ : నచ్చితే షేర్ చేయండి కాపీ మాత్రం వద్దు

Wednesday 13 July 2016

కుక్కుట లింగం

పాదగయా క్షేత్రం కుక్కుట లింగానికి బుధవారాం రాత్రి అష్టదిగ్భందన క్రతువు నిర్వహించారు.
స్వయం  భూః శివలింగ  వేలాది సంవత్సరాల నుంచి భక్తులకు దర్శనమిస్తోంది.
నిత్యం అభిషేకాది క్రతువులతో భక్తులు కుక్కుటేశుని కొలుస్తున్నారు
ఈ క్రమంలో ఇటీవల కుక్కుట లింగం కొంత తరుగుదలకు గురైంది.
దీంతో 2003లో ఒక మారు అష్ట దిగ్భంధన చేసి శివలింగానికి రక్షణ చర్యలు చేపట్టారు
కాల క్రమేణా పై పూత ఇటీవల మరో మారు దెబ్బతిన్నట్టు అర్చకులు గుర్తించారు.
దానిని సరి చేయడానికి ఈవో చందక దారబాబు, వేదపండితులు, అర్చకులు కలిసి వేదోక్తంగా
స్థపతుల సలహాల మేరకు మరో మారు శివలింగ పరిరక్షణా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
-- సరిదే నాగ్

ఫోటో1 : కుక్కుట లింగం మొదటి రూపం
ఫోటో 2:


కుక్కుట లింగం 2003 పరిరక్షణ అనంతరం రూపం
ఫోటో 3: కుక్కుట లింగం 2016 పరిరక్షణ అనంతరం రూపం
నోట్ : షేర్ చేయండి.. కాపీ చేయొద్దు

కోడి పుంజుల బొమ్మలు

తూ. గో. జిల్లా గాదరాడలో ఓ కామందు తన ఇంటి గేటు పైన ఈ కోడి పుంజుల బొమ్మలు పెట్టుకున్నాడు. అచ్చం నిజం పుంజుల్లా బోర ఎత్తి మరీ ఎలా చూస్తున్నాయో చూడండి పుంజులు
ఒకతి తీతువ, మరోటి నెమలి అనుకుంటా..
-- సరిదే నాగ్
నోట్ : నచ్చితే షేర్ చేయండి.. కాపీ డౌన్లోడ్ మాత్రం వద్దు

కోడి కూయనిదే.. గోదారి జిల్లా పల్లెలో తెల్లారదు

కోడి కూయనిదే.. గోదారి జిల్లాలో పల్లెలో తెల్లారదు
కోడి కోయందే.. పండగ వెళ్లదు..
కోడి ఇక్కడి ప్రజల జీవితాల్లో మమైకం అయ్యిందంటే అతిశయోక్తి కాదేమో..
ఇంటి నిర్మాణంలో  పడక గది.. వంట గది.. పిల్లల గది.. పూజా గది.. మరుగుదొడ్డి..ఇలా అన్ని గదులతో పాటూ పెరట్లో కోళ్ల గూడు కూడా కట్టుకోవడం ఇక్కడి  ప్రజలు కోళ్లకు ఇచ్చే ప్రాథాన్యం..
తాను తిన్నా.. తినకపోయినా టైం కి కోడి పుంజులకు బాదం పిస్తా, జీడిపప్పు మేత పెట్టే రైతులు నాకు తెలుసు..
ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే..
కోడి పుంజుల మీద మమకారంతో  తూగో జిల్లా గాదరాడ లో ఓ రైతు తన ఇంటి ముందు వాటి బొమ్మల్ని పెట్టుకున్నాడు
చూడండి ఆ బొమ్మలు ఎంత అందంగా జీవం వుట్టిపడేలా వున్నాయో..
అద్గదీ గోదారోళ్లంటే..
తిండి పెట్టిన కాటన్ దొర బొమ్మల్ని ఊరూరా పెట్టుకున్నట్టే..
కడుపు నింపే కోడి పుంజు బొమ్మనీ ఇంటి ముందెట్టుకుంటాం..
గోదారి నీటిలో వుందా ప్రేమ.. ఆప్యాయత.. కృతజ్ఞత.
--- సరిదే నాగ్
ఫోటో : గాదరాడ లో తీసింది
నోట్ : నచ్చితే షేర్ చేయండి.. అంతే కానీ కాపీ చేయొద్దు





Tuesday 12 July 2016

కోనేట్లో ఈ రాయి తేలుతూ కనిపిస్తోంది.

సీతమ్మ లంకలో రావణుని చెరలో వుందని తెలుసుకున్న రాముడు వానర సైన్యంతో లంకపైకి దండయాత్ర చేస్తాడు.
ఆ సమయంలో లంకను చేరుకోడానికి సముద్రం దాటాల్సి వస్తుంది. అపుడు అక్కడ వున్న రాళ్లను సముద్రంలో వేసి వానరుల సాయంతోనే వారధిని నిర్మిస్తాడు రామచంద్రుడు.  తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో ఆ రాళ్లు మనకు కనిపిస్తాయి. పెద్ద పెద్ద బండలని నీళ్లల్లో వేసినా అవి తేలుతుంటాయి.
ప్రత్యేకమైన స్పాజిల్ తరహా రాళ్లు కావడంతో అవి తేలుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అది వేరే విషయం.
నీటిలో తేలే ఆ రాళ్లు రామేశ్వరంలో మాత్రమే కనిపించేవి. అయితే తూర్పుగోదావరి జిల్లా గాదరాడలో ఓం శక్తి పీఠం వద్ద  ఇటీవల సుమారు 46 ప్రసిద్ద దేవాలయాల నమూనాలను నిర్మించారు.
అక్కడ ఈ రాయిని కూడా సందర్శకుల కోసం వుంచారు.
అక్కడి కోనేట్లో ఈ రాయి తేలుతూ కనిపిస్తోంది. వీలుంటే.. ఆసక్తి వుంటే వెళ్లి చూడండి ఈ నీటిలో తేలే రాయిని
ఇది రాజానగరం జంక్షన్ నుంచి కి. మీ. 13
ధన్యవాదాలు
-- సరిదే నాగ్
ఫోటో : కోనేట్లో తేలుతున్న రాయి
నోట్: నచ్చితే షేర్ చేయండి కాపీ మాత్రం చేయొద్దు

Monday 11 July 2016

భద్రాచలం క్షేత్రం పర్ణశాల

పిచ్చి పది రకాలట..
అవేమో కానీ..
విషయంలోకి వస్తే..
పిల్లలు లేని దంపతులు.. ఈ చెట్టుకు ఊయల కడితే పిల్లలు పుడతారని నమ్మకం..
ఇలానే చాలా పుణ్యక్షేత్రాల్లో చెట్లకు ఊయలలు కడుతుంటారు. 
అలాగే పర్ణశాల వద్ద చెట్టుకు కూడా చాలా మంది ఊయలలు వేశారు.
సరే ఎవరి నమ్మకం వాళ్లది..
కానీ
పాలిథిన్ కవర్లతో ఊయలలు వేసారు..
చెట్టుకు కట్టిన ఊయలలో సగానికి పైగా పాలిథిన్ సంచులే..
భద్రాచలం క్షేత్రం పర్ణశాల వద్ద ఈ చెట్టును చూశాక నిజమే అనిపించింది.
నిజానికి
చంటి బిడ్డకు ఎలా అయితే పాతచీరను ఊయల చేస్తారో అలా చిన్న గుడ్డ పీలికను ఊయలలా వేలాడ తీస్తారు..
హైటెక్ భక్తులు ఎక్కువై..
భక్తిలోనూ.. కోరికలలోనూ ఆధునికతను జోడించేస్తున్నారు..
రేపు పుట్టే పిల్లలు కూడా .. కేర్ కేర్ మనేవాళ్లు కావాలని మొక్కుకుంటారో..
లేక హైటేక్ స్టైల్ లో పుట్టగానీ మమ్మీ.. డాడీ అంటూ నేరు ఇంజనీరింగ్ క్లాస్ లకు వెళ్లేవాడు పుట్టాలని కోరు కుంటారో మరి..
కలికాలం.. !!
-- సరిదే నాగ్
ఫోటో : భద్రాచలం పర్ణశాల వద్ద తీసిన ఫోటో

ద్రాక్షారామ నమూనా అలయం

ద్రాక్షారామ ఆలయ నిర్మాణ సమయంలో శిల్పులు ఆలయం ఎలా నిర్మించాలా అని చర్చించుకుని ఒక నమూనా ఆలయాన్ని చెక్కారట.
ఇప్పట్లో కాగితం మీద ప్లాన్లు గీచి.. ఆ తర్వాత నిర్మాణం చేపట్టడం మన ఇంజనీర్ల అలవాటు
అయితే అప్పట్లో శిల్పులకు ఈ అవకాశం లేదు. వారు నేరుగా నిర్మాణ స్థలాన్ని పరిశీలించి ఒక ప్రణాళీకను అనుకుని, ప్రధాన శిల్పి అధ్యక్షతన మిగిలిన శిల్పులు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి నిర్మాణం ప్రారంభించేవారట.
ఆ క్రమంలో ద్రాక్షారాయ ఆలయ నమూనాను కూడా ముందుగా చెక్కి చూసుకుని ఆపై ప్రధాన అలయాన్ని నిర్మించారట.
ఇదిగో అదే ఆ
నమూనా అలయం. లోపల భీమేశ్వరుడు మినహా.. ఈ బుల్లి ఆలయం ప్రధాన ఆలయాన్ని పోలి వుంటుంది
-- సరిదే నాగ్
ఫోటో : ద్రాక్షారాయం ఆలయంలోని నమూనా ఆలయం
నోట్ : నచ్చితే షేర్ చేసుకోండి.. కాపీ మాత్రం చేయొద్దు

కోరుకొండ.. ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించారని చెబుతారు

కోరుకొండ.. ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించారని చెబుతారు
ఆలయం దర్శిస్తే దీనిని నిర్మించింది దేవతలు కాకపోయినా.. నిర్మించినవారు దేవతలే అనిపిస్తుంది
సుమారు 370 మెట్లు వున్న కొండపైన ఈ ఆలయం నిర్మించడం నిజంగా అద్భుతమే.
ఆలయం మూడు వైపులా శిల్ప సంపద అబ్బుర పరుస్తుంది.
దశావతారాలు, రామాయణ దృశ్యాలు, నృత్యాలు ఈ గోడలపై చెక్కారు.
ఒక్కో రాయిపై ఒక్కో శిల్పాన్ని చెక్కారు.
జీవం ఉట్టిపడేలా శిల్పాలు వున్నాయి.
తూర్పుగోదావరి జిల్లాలో తప్పని సరిగా చూడాల్సిన ఆలయం ఇది.
మెట్లు నిటారుగా చాలా ఇబ్బందిగా వుంటాయి. చాలా చిన్నవి కూడానూ..
ఈ మధ్య ఇనుప పైపులు ఊతంగా ఏర్పాటు చేశారు కానీ గతంలో అవి కూడా వుండేవి కావు.
పైన స్వామి వారి ఆలయం గురించి మరో పోస్టులో 
-- సరిదే నాగ్
ఫోటో : కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం

కోరుకొండ ఆలయం



కోరుకొండ ఆలయం
ఎతైన కొండపైన స్వామి కొలువు తీరి వున్నారు.
స్వామి వారి గర్భాలయంలో లక్ష్మీనారసింహస్వామి కొలువు తీరి వుంటారు.
అయితే అదే గర్భాలయంలో దక్షిణ ముఖంగా కేవలం అడుగు ఎత్తున ఏక శిలా ఆలయం వుంటుంది
ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించారని స్వామి ఆలయం సహా స్వయం భూః గా వెలిశారని అర్చక స్వామి వివరించారు.
ఈ ఆలయంలో స్వామిని ఒంగొని చూడాలి.
అంత చిన్న రాతి ఆలయంలో స్వామి వారి విగ్రహాన్ని.. ఆయన తొడపై ఆశీనురాలైన లక్ష్మీ దేవిని ఎలా ఏర్పాటు చేశారు అనేది నిజంగా అద్భుతమే. ఈ ఆలయానికి రెండు వైపులా శంఖు చక్రాలు ద్వారపాలకులుగా చెక్కారు.
పైగా స్వామి ఆలయం సహా స్వయం భూః కాబట్టి దేవతల చేత నిర్మితమైన ఆలయంగా దీనిని చెబుతున్నారు.
ఇంత ఎత్తైన కొండపైకి శిలల్ని తరలించడం ఆశ్చర్యమే.
ఇక ఈ ఆలయం చేరుకోవాలంటే 360 కి పైగా మెట్లు ఎక్కి రావాలి. అతి చిన్న మెట్లు అవి.
ఆలయంలో మరో పక్క లక్ష్మీదేవి ఆలయం వుంటుంది.
అలయం చుట్టూ శిల్పాలు అబ్బుర పరుస్తాయి. జీవ కళతో అలరారుతుంటాయి.
కళాభిమానులు తప్పకుండా చూడాల్సిన ఆలయం కోరుకొండ లక్ష్మీనారసింహుని ఆలయం
కొండ దిగువున స్వామి వారిని ప్రతిష్టించారు. కొండ ఎక్కలేని వారు స్వామిని దర్శించుకునే వీలు కల్పించారు.
దేవస్థానం అన్నదాన కమిటీ ఇక్కడ భక్తులకు అన్న ప్రసాదాలు అందిస్తున్నారు.
ఈ ఆలయం రాజానగరానికి సుమారు 14 కి. మీ.
-- సరిదే నాగ్
ఫోటో : గర్భాలయంలో దేవతలు నిర్మించినట్టు చెప్పబడుతున్న స్వయం భూః ఆలయం
నోట్ : నచ్చితే షేర్ చేయండి.. కాపీ మాత్రం చేయొద్దు

కోరుకొండ ఆలయంలో శిల్పా కళా వైభవానికి ఇదొక మచ్చుతునక..

కోరుకొండ ఆలయంలో శిల్పా కళా వైభవానికి ఇదొక మచ్చుతునక..
రామ రావణ యుద్ద ఘట్టం కళ్లకు కట్టినట్టు చెక్కారు ఆనాటి శిల్పులు
రాముడు, దశకంఠుడు రథాలపై వచ్చి , ధనుస్సులు ఎక్కుపెట్టి శరపరంపర కురిపించిన ఘట్టాన్ని కడు రమ్యంగా చెక్కారు
రాముడు, రావణుడు వేసిన బాణాలు వారి మధ్య ప్రయాణిస్తున్న తీరును..
రాముని బాణాల తాకిడికి నేల రాలిన రావణుని శరస్సులు ఈ శిల్పంలో చూడొచ్చు
ఇలాంటి ఎన్నో ఘట్టాలు ఇక్కడి గోడపై దర్శనమిస్తాయి
-- సరిదే నాగ్
ఫోటో : కోరుకొండ ఆలయం గోదపై రామ రావణ యుద్ద ఘట్టం
నోట్ :వివరాలు నచ్చితే షేర్ చేయండి.. కాపీ చేయొద్దు

తూర్పుగోదావరి జిల్లాలోనూ జ్యోతి దర్శనం

తూర్పుగోదావరి జిల్లాలోనూ జ్యోతి దర్శనం
---------------------------------------------------
జ్యూతి దర్శనం అంటే మనకు గుర్తొచ్చేది కేరళ లోని శబరిమలై అయ్యప్ప జ్యోతి దర్శనం.
అయితే తూర్పుగోదావరి జిల్లాలోనూ భగవానుడు జ్యోతి స్వరూపునిగా దర్శనం ఇచ్చే క్షేత్రం వుందంటే నమ్మగలరా..
అదే కోరుకొండ మండలం కణుపూరు శైవ క్షేత్రం.
ఈ క్షేత్రంలో భ్రమరాంభా సమేత పంచముఖ మల్లికార్జున స్వామి వారు. స్వామి స్వయం భూః లింగం
362 మెట్లు ఎత్తైన కొండపై వెలిశారు. శివలింగం ఫోటోలో చూపిన విధంగా అయిదు ముఖాలతో వుంటుంది.
ఇక్కడి మహత్యం ఏమిటంటే.. ప్రతి శివరాత్రికీ స్వామి వారు జ్యోతి స్వరూపునిగా భక్తులకు దర్శనమిస్తారట.
శివరాత్రి రోజు నుంచి ఇక్కడ అయిదు రోజులు ఉత్సవాలు చేస్తారు. ఈ అయిదు రోజుల్లో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జాము 1 గంటలోగా ఈ జ్యోతి కొండపై కనిపిస్తుందట. ఆ దర్శనం కోసం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కొండపైనా, దిగువునా కాచుకుని వుంటారట. అక్కడే మకాం వేసి వుంటారట. జ్యోతి దర్శనం ఎప్పుడు అయితే అప్పటితో శివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.
లేదంటే కనిపించే వరకూ అయిదు రోజులపాటు కొనసాగుతాయట.
ఒక కొండపైన స్వామి వెలిశాడు. అక్కడికి చేరుకోవాలంటే సుమారు 362 మెట్లు ఎక్కాల్సిందే.. మరో మార్గం లేదు. మెట్లు ఈ మధ్యనే అభివృద్డి చేశారు.
శివరాత్రి అయిదు రోజులూ కొండంతా జనమే.
మామూలు రోజుల్లో మధ్యాహ్నం వరకూ మాత్రమే ఆలయం వుంటుంది
మిగిలిన సమయాల్లో నిర్మానుష్యమే. ఎవరైనా భక్తులు వస్తే అక్కడ అర్చక స్వామి సెల్ నెంబర్ రాసి వుంటుంది ఫోన్ చేస్తే ఊర్లో నుంచి వస్తారాయన.
ధన్యవాదాలు
-- సరిదే నాగ్
ఫోటో : పంచముఖ మల్లికార్జున స్వామి వారు. కొండపైకి వెళ్లే మెట్ల మార్గం, ఆలయం