Sunday 4 September 2016

గొప్పోడివయ్యా సామీ..

గొప్పోడివయ్యా సామీ..
గరికకు పూజాధికారమిచ్చావు..
ఎలుకకు ఏనుగు బలమిచ్చావు..
చప్పిడి కుడుమును ప్రసాదం చేశావు
భలేవాడివయ్యా.. సామీ..
తలేమో ఓ రాక్షసుడు..
వాహనం ఇంకో రక్కసుడు..
నీ చుట్టూ గణాలు.. విఘ్నాలు..
అయినా తొలి పూజలందుకునే వేల్పువి..
ఎట్టాగయ్యా నిన్ను నమ్మేది..
.
తలెత్తి చంద్రుడిని చూసిన కృష్ణుడిని కూడా అపనిందల పాల్జేశావు..
పకపకలాడే చంద్రుడిని ఒంటిగాడిని చేసేశావ్
అయ్య మెడలో పామును నడుముకు చుట్టేసుకున్నావు
అమ్మా అయ్యా చుట్టూ తిరిగేసి.. తమ్ముడిని ఓడించేశావు..
గొప్పోడివయ్యా సామీ..
పశువులు తినే ఆకులు అలమలుతో పూజన్నావు
పళ్లూ కాయలతో పాలవెళ్లి కట్టించావు..
కథ మొత్తం చదవందే పూజ పూర్తి కాదని కిరికిరి పెట్టావు
చలిమిడి వడపప్పుతో సరిపెట్టుకుంటావు...
భలేవోడివయ్యా సామీ..
సిక్స్ ప్యాక్ ల కాలంలో.. ఫ్యామిలీ ప్యాక్ తో నువ్వు
వీధికో పది కుక్కలున్న మా మధ్య నీ ఎలకతో..
తొమ్మిది రోజులు ఎలా వుంటావయ్యా..
డ్రైనేజీ కంపు.. దోమల రొథ.. సినిమా పాటల భజన..
గంటకో పాలి పోయే కరెంటు.. వానా కాలంలోనూ ఉక్కపోత వెదరు
వీధి వీధినా బాసిమటం ఏసుకుని కూర్చుంటావ్..
తొమ్మిదో రోజున మురికి నీళ్లలో ముంచేస్తామని తెలిసీ ..
మామీద ప్రేమతో ఎలా వుంటావయ్యా..
అమాయకపు సామీ..
ముంచేస్తారని తెలిసీ అయిదేళ్లకో పాలి ఓట్లేసే మా అసుంటోడివే సుమా..
-- సరిదే నాగ్
నోట్ : ఏదో సరదాగా రాసింది సీరియస్ గా తీసుకోకండి.. అలాగే కాపీ కూడా చేయకండి..
ఫోటో : చంద్రగిరి మ్యూజియంలో తీసింది

No comments:

Post a Comment