Saturday 16 April 2016

అర్థరాత్రి రాములోరి పెళ్లి..

అర్థరాత్రి రాములోరి పెళ్లి..
మీరు సరిగ్గానే చదివారు..
అచ్చంగా అర్థరాత్రి 11 గంటల లగ్నానికి సీతారాముల పెళ్లి..
ఇది గొల్లప్రోలు మండలం చేబ్రోలు సీతారామాలయంలో ప్రతి ఏటా జరిగే శుభకార్యం
సాదారణంగా సీతారామ కల్యాణం మిడసరి లగ్గంలో అంటే.. మధ్యాహ్నం జరుగుతుంది.
భద్రాద్రి అయినా. అన్నారం అయినా.. తిరపతైనా.. ఇదే ముహూర్తం.
అయితే ఒక్క చేబ్రోలులో మాత్రం నిశి వెళ కల్యాణం జరుగుతుంది..
దీనికి ఐతిహాసిక కారణాలు ఏవీ లేవు కానీ
చారిత్రక కారణం మాత్రం వుంది.
చేబ్రోలు పిఠాపురం జమీందారీలో శివారు గ్రామం.
పిఠాపురం మహారాజా రావు వెంకట గంగాధర రామారావు క్రీ.శ 1800లో ఇక్కడ ఆలయాన్ని కట్టించారు.
అలాగే ప్రతి శ్రీరామ నవమికి మహారాజా తన రాజ్యంలోని రామాలయాలు అన్నీ తిరిగి కల్యాణం తిలకించడం ఆనవాయితే..
పిఠాపురం రాజ్యంలో రామాలయాలు అంటే తక్కువేమీ కాదు.
ఈ ఆధునిక కాలంలోనూ వీధికో రామాలయం వుంది..
దీంతో మహారాజా శివారు గ్రామం చేబ్రోలు వచ్చేసరికి రాత్రి అయిపోయేది..
అక్కడి జనం మహారాజు మీద గౌరవంతో ఆయన వచ్చే వరకూ రాములోరిని తాళీ కట్టనిచ్చేవారు కాదు.
మహారాజా ఈ ఆచారాన్ని మాన్పించాలని మొదట్లో అనుకున్నా ప్రజలందరూ.. తమకూ ఈ ముహూర్తమే బావుందని, రైతులు, కూలీలు,, కార్మికులు, చిన్నా పెద్దా.. ఆడా మగా తమ పనులు పూర్తి చేసుకుని చక్కగా.. చల్లగా సీతారామ కల్యాణం చూడటానికి బావుందని మహారాజుకు విన్నవించడంతో మహారాజు కూడా దానికి అంగీకరించి. అర్థరాత్రి ముహూర్తాన్నే ఖాయం చేశారట.
ఇక అప్పటి నుంచీ చేబ్రోలు సీతారాములకు రాత్రి 10 దాటాకే కల్యాణం జరుగుతుంది.
ఈ రోజు కూడా రాత్రి 11 గంటలకు ముహూర్తం..
కల్యాణ క్రతువు జరుగుతోంది..
అన్నట్టు ఒంటిమిట్టలోనూ రాత్రివేళే కల్యాణం అట..
--నాగ్
ఫోటో : చేబ్రోలులో రాత్రివేళ రాములోరి కల్యాణం ఫోటోవులు
నోట్ : నచ్చితే షేర్.. లేకుంటే పరవాలేదు.. కానీ కాపీ మాత్రం వద్దు

No comments:

Post a Comment