Saturday 2 September 2017

అతని కంటి చివరల నుంచి జారిన కన్నీటి చుక్క..

అతని కంటి చివరల నుంచి జారిన కన్నీటి చుక్క..
చాలానే చెప్పాలని..
మందులు తెస్తాడని ఎదురు చూసే తల్లికి..
మిఠాయి పొట్లం కోసం ఎదురు చూసే చంటిదానికి..
అదే చివరి వీడ్కోలు అని తెలీక గుమ్మం వరకూ వచ్చి వీడ్కోలు పలికిన భార్యకి..
ఇంకా..ఇంటిల్లిపాదికీ..
ఏదో చెప్పాలని..
ఆత్రంగా.. వెచ్చగా కంటి చివరల జారిన కన్నీటి చుక్క..
చెంప మీదుగా జారి.. ఏమీ చెప్పకుండానే మట్టిలో మాయమైంది..
కంటి నుంచి ఆరిపోయిన అతని వెలుగులా..
అతనిని గమ్యం చేర్చడానికి పరుగులు తీసిన బైకు చక్రం..
గిర్రున తిరుగుతూనే వుంది.. పడినచోటే..
నల్లని రోడ్డుపై ఒలికిన ఆయిలు అతని ఎర్రని రక్తంతో కలిసి..
వర్ణాలు అద్దుకుంటోంది..
చుట్టూ జనం.. గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటూ..
అతనికి వినిపించదని తెల్సినా.. గట్టిగానే మాట్లాడుకుంటున్నారు..
ఎవరో ఫోన్ లో మాట్లాడుతున్నారు.. యాక్సిడెంట్ వివరాలు చెబుతున్నారు..
దూరంగా బైకు స్పీడో మీటరు.. 120 దగ్గర ఆగి వుంది..
మౌనంగా రోదిస్తూ..
-- సరిదే నాగ్

No comments:

Post a Comment