Saturday 2 September 2017

తొలిరోజు బడికి బయలు దేరాడు..

మా వీధిలో పిల్లాడు తొలిరోజు బడికి బయలు దేరాడు..
వాళ్ల అవతారం .. అంతరిక్షానికి వెళ్లే వ్యోమగామిలా.. 
నేను బడికెళ్లిన రోజులు గుర్తొచ్చాయి..
అప్పుడు బడికి వెళ్లాలంటే ఓ పలక.. బలపం అంతే..
సన్నగా చినుకులు పడుతుంటే.. బరువైన మట్టి పలక.. చివర్లు ఇనుప రేకులు తాపడం చేసి వున్నది ఒక చేత్తో నెత్తిమీద పెట్టుకుని, మరో చేత్తో జారిపోతున్న నిక్కరు లాక్కుంటూ.. బడికి పరుగులు తీసిన రోజులు గుర్తొస్తున్నాయి..
నేల బల్ల మీద .. బాగా పొడిగా వున్న చోటు చూసుకుని కూర్చునే వాడిని.
జేబులో ఓ చిన్ని బలపం..
అ ఆ అని పెద్ద అక్షరాలు రాస్తే.. ఒక గంటలో అవి కాస్తా.. పెద్ద పెద్ద గుండు సున్నాలు అయిపోయేవి. అలా దిద్దేసేవాడిని..
మాస్టారు వాటిని చెరిపేసి తీసుకు రమ్మంటే.. పలకని వర్షంలో పెట్టి అక్షరాలు చెరిపేవాళ్లం.
ఇక్కడ మట్టి పలక గురించి చెప్పాలి.. ఎంత బరువనీ.. ఒళ్లో పెట్టుకోకుండా రాయలేకపోయేవాళ్లం..
పాల కనికితో మెత్తగా భలే రాసేది..
ఒక్కోసారి మా గొడవలకి అదే ఆయుధం.. 
తలలు పగిలిపోయేవి..
తల మీద నూనె జిడ్డు అంటుకుని బాగా రాయకపోతే
పలకలు బాగా రాయడానికి. కొండ పిండి అకుతో బాగా రుద్ది.. కడిగేవాళ్లం.
.పొరపాటున ఎవరైనా పలక తొక్కేస్తే .. అది పగిలిపోతే.. హమ్మో పెద్ద గొడవై పోయేది..
ఇంట్లో బడిత పూజ..
కొన్నిరోజులు ఆ పగిలిన పలక ముక్కతోనే తంటాలు.. అదే పనిష్మింటు 
తర్వాత తర్వాత రేకు పలకల హవా వొచ్చింది..
రేకులకు తగులుకుని చొక్కాలు చిరిగిపోయేవి
వర్షం వస్తే.. మాత్రం పలకలు మంచి గొడుగులా మారిపోయేవి..
కనికలు(బలపాలు) మంచి మారక ద్రవ్యాలు..
బహుశా జీవితంలో తొలి అప్పు బలపమేనేమో..
ఒకటో తరగతి వాళ్లు కొత్త పుస్తకాలు తీసుకొస్తుంటే.. వాళ్ల వైపు అసూయగా చూసేవాళ్లం..
అబ్బ కొత్త పుస్తకం సువాసన భలే వుండేది.. ఇక పెన్ను ఎప్పుడెప్పుడు పట్టుకుంటామా అని ఆత్రం..
బహుశా నాకు గుర్తు వున్నంత వరకూ అక్షరాలు.. గుణింతాలు.. పదాలు అయిపోయాక మొదటి పాఠం.. జామపళ్ల పాఠం అనుకుంటా.. తెల్ల, ఎర్ర జామకాయల పాఠం.. ఒకటో తరగతి తెలుగు పుస్తకం (ఒకటే పుస్తకం వుండేది) చివర్లో పాఠం.. అది చదివేస్తే.. హమ్మయ్యా.. ఒకటో తరగతి అయిపోయినట్టే..
-- సరిదే నాగ్

No comments:

Post a Comment