మీరొస్తారా.. నే వెళ్తున్నా.. వెలుగుల లోకానికి.. తుమ్మెదల తోటకి.. తువ్వాయిల వెంట పరుగు తీస్తూ.. గువ్వల కువకువలను వెదుక్కుంటూ నే వెళ్తున్నా.. కోరలు.. కొమ్ములు లేని మనుష్యులున్న తోవకి మాయా మర్మం తెలియని తీరాలకి నే చేరుకుంటున్నా.. మీరొస్తారా చిరుగాలి.. చిగురుటాకు.. చిన్న చినుకు.. చిరు వెన్నెల.. బోసినవ్వుల లోకానికి విరుద్ద జాతులు జతకట్టే శాంతి వనానికి పలవరిస్తూ.. శోధిస్తూ.. నే వెళ్తున్నా.. మీరొస్తారా..
దిక్కులు పిక్కుటిల్లేలా అరవక్కర్లేదు.. ఊపిరి బిగపట్టి.. బాకా ఊదక్కర్లేదు.. బలమంతా ఉపయోగించి నగారా మోగించక్కర్లేదు.. నువ్వసలు పెదవి విప్పనే వద్దు.. కనురెప్ప ఎత్తి.. చూస్తే చాలు.. పెదవి చివర చిరునవ్వు చాలు.. వేల పిలుపులు.. మరెన్నో .. సందేశాలు.. అది చాలు.. సైన్యమై నీ వెనుక నడుస్తా.. ధుర్గమై నిన్ను కాచుకుంటా.. దూసుకొచ్చే శర పరంపరకు నా హృదయం డాలును చేస్తా.. కవచమై.. నిన్ను దాచుకుంటా.. కాపాడుకుంటా..
ఆకురాలిన ప్రతి సారీ.. మొక్క ఉలిక్కిపడుతుంది.. ఎండిన ఆకైనా.. తల ఊపి వీడ్కోలు పలుకుతుంది ఆ రాలిన చోటే మొలకొస్తే.. పులకిస్తుంది.. కొత్త ఆకు సొగసు చూసి .. మురిసిపోతుంది ఆకురాలిన గాయం తలచుకుంటూ.. తొడిమ మెరుపుకు మురిసిపోతూ.. సాగుతుంది.. పై పైకి ఎదుగుతుంది.. కొమ్మ చేతులు విస్తరిస్తుంది.. చెట్టై.. మానై నీడనిస్తుంది.. కొత్త మొక్కలకు ఆలంభనవుతుంది..
ఆకురాలిన ప్రతి సారీ.. చెట్టు కుమిలిపోతే.. ఏండుటాకు రాలిన చోటే నిలిచిపోతే.. మొక్క చెట్టు కాదుగా..
పడినచోటే వుండి పోతే.. దగా పడిన మనసు పుంజుకోకపోతే.. అడుగులు పడకపోతే.. గతాన్ని మరుగున పెట్టకపోతే.. నువ్వులేవు నేస్తం.. నీ ప్రగతి శూన్యం..
మనసుపై పడిన ప్రతి దెబ్బా.. బలం కావాలి గుండె కార్చిన కన్నీరు.. అమృతంగా మారాలి నిలిచి చూపు నేస్తం.. నీ నీడకే వస్తారా జనం
మనం కవలలం.. పుట్టుకతోనే మన పక్కనే .. చావునీ తోడు తెచ్చుకున్నాం.. అందుకే .. మనం చావు పుట్టుకల కవలలం
ప్రతియేడూ పెరిగే పెద్దరికం.. చావుకు దగ్గర తనం తెలియక గొప్పగా అనుకుంటాం.. ప్రేమను అణిచేసి.. పెత్తనం చెలాయిస్తాం.. ఎంత సంపాదించినా.. ఎన్ని సాధించినా.. మృత్యువును తప్పించుకోలేం..
అందుకే.. మంచిని చేద్దాం.. మనసులు గెలుద్దాం.. మనం లేకున్నా.. మన రూపాన్ని.. భావాల్ని.. మనవాళ్ల మదిలో వదిలి వెల్దాం