Saturday, 2 September 2017

సో.. ఇది ఆట కాదు యుద్దం..

టను ఆటలానే చూడాలి..
ఆస్వాదించాలి..
....
సారీ బాస్
ఆ స్థాయిని ఎప్పుడో దాటేశాం..
ఇది ఆటే అయితే 200 కోట్లు బెట్టింగులు ఎందుకు..
ఇది ఆటే అయితే ఒక్క ఆటతో వందల జీవితాలు రోడ్డున పడటం ఎందుకు..
ఇది ఆటే అయితే గెలిచిన టీమ్ కి ప్రభుత్వాలు ప్రజాధనంతో నజరానాలు ఎందుకు
ఇది ఆటే అయితే గెలిచే హాకీని వదిలేసి ఓడి పోతుందని తెలిసీ క్రికెట్ ఎందుకు చూడాలి
ఇది ఆటే అయితే దేశంలో సగానికిపైగా ప్రజలు అన్నిపనులూ మానేసి టీవీలకి ఎందుకు అతుక్కుపోయారు
ఇది ఆటే అయితే పాకిస్తాన్ బోర్డర్ లో అక్కడి సైనికిలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు..
ఇది ఆటే అయితే స్టేడియంలో ప్రజలు ఎందుకు ప్రార్థనలు చేస్తున్నారు
ఇది ఆటే అయితే గెలిచిన హాకీ టీం ని పొగడటం మానేసి..ఓడిన క్రికెట్ టీంని ఎందుకూ తెగడటం
సో..
ఇది ఆట కాదు యుద్దం..
ఆ సంగతి ప్రతి భారతీయుడికీ తెలుసు..
దురదృష్టం..
భారత ఆటగాళ్లకే తెలియలేదు..
యాడ్ ఫిల్మ్స్ లో సింగిల్ టేక్ తో ఓకే చేసే నైపుణ్యం వున్న మన ఆటగాళ్ళు..
ప్రతి మ్యాచ్ లో చివరికి ప్రాక్టీసులో కూడా ప్రజాధనం ఖర్చు చేసే ఆటగాళ్లు
ఒక్కడు.. ఒక్కడూ ఒంటి చేత్తో గెలిపించే అంకిత భావం లేకపోవడం
దురదృష్టమే..
నిజమే
గతంలో గెలిచారు చివరాటలో గెలిస్తే కదా గుర్తింపు
-- సరిదే నాగ్

ముత్యాలకే కాదు..

ముత్యాలకే కాదు..
కన్నీటి చుక్కకూ మెరుపుంది..
విలువుంది..
అందుకే వాటిని వృథా చేయడం లేదు..
ముత్యాల పెట్టెలో లాగానే..
హృదయపు గదిలో పెట్టి తాళం వేస్తున్నా..
నాకు తెలుసు.. ఏదో ఒకరోజు..
వాటి అవసరం వస్తుంది..
కన్నీరించే క్షణం తప్పక వస్తుంది..
మది కదిలించిన నాడు..
ఏడబాటు తప్పని నాడు..
అవే కదా నాకు ఆస్తి
-- సరిదే నాగ్

సంద్రం అంటే నాకిష్టం..

సంద్రం అంటే నాకిష్టం..
అందుకే
ఆ నీళ్లను కళ్లల్లో బంధించేశా..
ఆ ఘోషను.. బడబాగ్నిని
హృదయంలో నిక్షిప్తం చేశా
ఒక్క క్షణం ఎగిసిన కెరటాన్ని చూస్తే..
ఉత్తేజం.. ఉత్సాహం..
విజయాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆనందం
-- సరిదే నాగ్

నా కవిత..

కళ్ల ముందు దృశ్యం.
కంటిలో నలుసై మెరిగినప్పుడు..
ఎదలో బాధ సుడులు తిరిగి
కన్నీరుగా జారినప్పుడు..
కడుపులో బడబాగ్ని వుండలేక
భళ్లున వెలికి వచ్చినప్పుడు
పేగులు మెలిపెట్టే ఘర్షణ.. హృదయాన్ని చేరి
మండించినప్పుడు
భావం బాకులా హృదయాన్ని
ముక్కలు చేస్తున్నప్పుడు
నరనరాల్లో వేదన ప్రవహించి..
గుండె నాళాల్లో తిష్టవేసి..
ఊపిరి ఆగిపోతున్నప్పుడు
వేదన అక్షరాలై..
రోదన పదాలుగా రూపుదిద్ది..
కడుపు చించుకుని వచ్చేదే
కవిత..!!!!
నా కవిత..
--సరిదే నాగ్

జగన్నాటకం..

రుద్రభూమిలో శవాల యుద్దం
ఆరడుగుల నేల కోసం..
చెట్టుపై రాబందుల గోల
పీనుగలో వాటా కోసం
గుడిమెట్లపై ముష్టివాళ్ల పోట్లాట
అడుక్కునే జాగా కోసం
బురదలో జలగల పోటీ..
పశువుల రక్తం పీల్చడం కోసం
వీధిలో కుక్కల అరుపులు..
ఎంగిలి విస్తరి కోసం..
చీకట్లో చీరల కన్నీటాట..
నాలుగు కాసుల కోసం..
రోడ్డుపక్కన చిన్నారుల భిక్షాట
పిడికెడు మెతుకుల కోసం..
జగమంతా .. ఆరాటం..పోరాటం..
దారిద్ర రక్కసి వికటాట్టహాసం..
.........
ఇవన్నీ చూస్తూ.. భగవంతుని
జగన్నాటకం.. అదీ ఆటే..
-- సరిదే నాగ్ (2015)

శపించుతల్లి ఈ బుద్దిహీనులని..

అంతరిక్షాన్ని ఏలుతున్నాం.,
పసిపాపను కాపాడలేకపోయాం..
మింగింది బోరుబావి కాదు,.
నిలువెత్తు మా నిర్లక్ష్యం
శపించుతల్లి ఈ బుద్దిహీనులని..
శిక్షించు చిన్నారీ ఈ అసమర్థులని..
ఆచిరునవ్వు చాలమ్మ మాగుండెలు మండించడానికి
నీ మౌనం చాలు మమ్మల్ని మేము ప్రశ్నించుకోడానికి
నీ ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటూ..
సరిదే నాగ్

నువ్వు.. ఎవరు..

కనుల ఎదురుగా నువ్వు
కనులు మూస్తే.. కల వు
కనులు తెరిస్తే.. కన్నీరు వు
కలతలో ఓదార్పువు..
మనసు వేదనలో నలిగే వేళ..
మదిలో గిలిగింతలు పెడతావు
ఓటమి చెంది కుమిలే వేళ
చెలిమి చేతిని అందిస్తావు..
గుండెలవిసి.. ఒంటరినైతే..
మమతల కోవెల కడతావు
మనసుకు దగ్గరైన నువ్వు..
ఎవరు..?
మనసు పూపొదను కదిపి వెళ్లిన
ఓ అనామికా
నువ్వు.. ఎవరు..
-- సరిదే నాగ్