Saturday, 2 September 2017

మట్టి గణపతులనే పూజిద్దాం..

ఓ పదేళ్ల క్రితం వరకూ మా పిఠాపురంలో సుమారు 30 మంది కుమ్మరి కార్మికులు వుండేవారు.
ఇప్పుడు చూస్తే.. ఓ మూడు కుటుంబాల వారు మాత్రమే కుమ్మరి పని చేస్తున్నారు. 
వారిలో ఓ కుటుంబం అయితే అప్పుడప్పుడే ఈ పని చేస్తున్నారు.
అంటే.. ఓ పదేళ్లలో కుమ్మరి పని వారికి ఉపాధిలేక,
కుండలు, కుండీలు, కూజాలు, మట్టి దాకలు, సిబ్బిలు, డిబ్బీలు కొనేవాళ్లు లేక ఆయా కుటుంబాలు ప్రత్యామ్యాయ వృత్తులకు వలస వెళ్లిపోయాయి.
బతకలేక కుల వృత్తిని వాళ్ళు వదులుకున్నారు.
ఓ అందమైన అరుదైన కళ ఇలా కనుమరుగై పోతోంది..
మట్టి నుంచి అపురూప వస్తు సంపదను రూపొందించే వృత్తిదారులు మాయమైపోతున్నారు.
ఈ కళను కాపాడాలంటే కుమ్మరి వృత్తిదారులను ప్రోత్సహించాలి.
వారు తయారు చేసిన వస్తువులు అన్నీ కాకపోయినా..
కనీసం ఏడాదికి ఒక సారి వచ్చే వినాయక చవితికి మట్టి బొమ్మలు
దీపావళీకి మట్టి ప్రమిదలు, చిచ్చుబుడ్లు మట్టివే కొనుగోలు చేయాలి.
దీనివల్ల పర్యావరణాన్ని పరిరక్షించడంలో మన వంతు పాత్ర మనం పోషించడమే కాదు
మాయమైపోతున్న కుమ్మరి వృత్తిని .. ఆ కళని బతికించుకున్నవాళ్లం అవుతాం
......
మట్టి గణపతులనే పూజిద్దాం..
పర్యావరణాన్ని కాపాడుకుందాం..
కుమ్మరి కళను బతికించుకుందాం.. ✍️
-- సరిదే నాగ్

సాధ్యం అయితే ప్రయాణం చేయాలి

సాధ్యం అయితే ప్రయాణం చేయాలి
సూట్ కేసులు.. తినుబండారాలు.. వాటర్ బాటిల్స్ ఇవేవీ లేకుండా..
అప్పగింతలు.. ఒప్పందాలు.. కాకుండా..
ఇగోలు.. కోపతాపాలు.. టిక్కెట్లు గట్రా లేకుండా..
ఎవరో చూస్తున్నారని.. ఏదో అనుకుంటారని.. ఇంకేదో ఫీల్ అవుతారని.. అనుకోకుండా..
ప్రయాణం కట్టాలి..
మనలోనికి.. లోలోనికి..
అన్నీ వదిలి..
వెలుగు నిండిన మనసుతో..
నిండా వెలుగుతో..
తొణికిసలాడే ప్రేమతో..
ప్రయాణం చేయాలి..
పెదవిపై చిరునవ్వు..
ముఖంపై ఆనందపు వెలుగు..
హృదయం నిండా నువ్వు..
వెళ్లాలి..
లోలోపలికి..
అన్నీ మరిచి..
అన్నీ వదిలి..
నీ చేయందుకుని..
ఎవరూ లేని తావులకి..
భూమాకాశాలు కనిపించని లోకాలకి..
పయణమవ్వాలి..
నువ్వొస్తావా..
పిచ్చి ప్రశ్న..
నువ్వు రాకుండా నేను వెళ్లలేనుగా
-- సరిదే నాగ్

అద్భుతం..

అద్భుతం..
ఐదున్నర అడుగుల అబ్బురం..
ఆకాశమే గొడుగు పట్టిన అందం
అడుగు కింద నలిగిన గరిక పరవశం..
. ఆ నవ్వే.. నువ్వే.
మైమరుపే..!
-- సరిదే నాగ్

Tuesday, 31 January 2017

ఖో ఖో.. మన రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహించిన ఏకైక క్రీడాకారుడు సతీష్

జనవరి 29, 2017, రాత్రి ఎనిమిది గంటల సమయం..
ఇండియా - ఇంగ్లాండ్ ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది.
ఇప్పటికే ఒక మ్యాచ్ ని కోల్పోయిన కొహ్లీ సేన చాలా పట్టుదలగా ఆడుతోంది. కానీ చాల తక్కువ స్కోర్ కే ఇండియా బ్యాట్స్ మెన్ పెవిలియన్ కి వచ్చేశారు.
తక్కువ స్కోర్ లక్ష్యంగా బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ విజయం వైపు దూసుకు పోతోంది.
మన బౌలర్స్ ఇంగ్లాండ్ ని కట్టడి చేయడానికి స్లాగ్ ఓవర్స్ చమటోడ్చుతున్నారు. ప్రతి బంతీ ఉత్కంఠ.
సహజంగానే ఇండియాలోని క్రికెట్ ప్రేమికులు టీవీలకు అతుక్కుపోయారు. క్రికెట్ చూస్తున్నారు.
విజయం ఇండియా- ఇంగ్లాండ్ మధ్య దోబూచులాడుతోంది.
సరిగ్గా..
అదే రోజు..
అదే సమయంలో
అదే ఇంగ్లాండ్ క్రీడాకారులకు మరోచోట చమటలు పడుతున్నాయి.
ఇండియా కుర్రాళ్లు.. తెల్ల కుర్రాలతో ఒక ఆట ఆడేసుకుంటున్నారు..
ఆ ఆటే ఖో ఖో..
న్యూ ముంబాయి స్టేడియంలో ఇండియా వెర్సస్ ఇంగ్లాండ్ టెస్ట్ జరుగుతోంది
ఆది నుంచీ మన క్రీడాకారులు ఇంగ్లాండ్ పై ఆధిపత్యంతో ముందుకు దూసుకు పోయారు.
అయిదు పాయింట్లతో విజయం సాధించారు.
ఈ విజయంలో ఆంధ్ర ప్రదేశ్ కు అందునా తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం మండలం విరవ కుర్రాడు యాళ్ల సతీష్ ఆల్ రౌండ్ ప్రతిభ చూపించాడు.
మన రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహించిన ఏకైక క్రీడాకారుడు సతీష్
ఇతను పిఠాపురం మహరాజా డిగ్రీ కళాశాల(ఆర్ ఆర్ బి హెచ్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల) లో బికామ్ చదువుతున్నాడు.
అయితే దురదృష్టం.. ఇండియాలోనే కాదు చివరికి విరవ గ్రామంలో కూడా జనాలకి ఈ విజయం తెలీదు.
ప్రసార మాథ్యమాల్లో ఏ మూలా ఈ విజయానికి చోటు దక్కలేదు
గెలిచింది అంతర్జాతీయ మ్యాచ్ అయినా స్థానికంగా కూడా విలువ లేదు.
28 రాష్ట్రాల క్రీడాకారులు పోటీ పడితే .. ఎంపికైన 15 మందిలో ఒక్క ఆంధ్రుడికి స్థానం దక్కడం.
అదీ మా పిఠాపురం మండలం వాడికి ఆ గౌరవం దక్కడం నిజంగా చాలా గర్వ కారణం.
సతీష తండ్రి సత్తిబాబు గారు, సైకిల్ మీద వస్తువులు అమ్మే వ్యాపారి. తల్లి సత్యవతి గారు హౌస్ వైఫ్
సతీష కోచ్ పీఈటీ రాంబాబు గారు.
సతీష్ ఇప్పటికి 16 సార్లు రాష్ట్రం తరుపున ఆడాడు
మూడు బంగారు పలు రజత పథకాలు సాధించాడు
సతీష్ త్వరలో ఇంగ్లాండ్ లో జరగబోయే ఖో ఖో టెస్ట్ ల్లో ఆడనున్నాడు
శుభాకాంక్షలు సతీష
మరియు
ఆల్ ది బెస్ట్
-- సరిదే నాగ్
ఫోటో : ఖో ఖో క్రీడాకారుడు యాళ్ల సతీష్ , పిఠాపురం మండలం విరవ


Monday, 14 November 2016

జ్వాలాతోరణం

సర్వ పాపహరం..
నరక బాధా విముక్తి కారకం..
జ్వాలాతోరణం


సాగర మథనం సమయంలో పాలకడలి నుంచి పుట్టిన ఆలాహలాన్ని పరమశివుడు స్వీకరించి తన కంఠంలో నిలిపుతాడు. అయితే ఆలాహలం మంటలకు శివునికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని పార్వతీదేవి సహజసిద్దమైన బేలతనం వల్ల భయపడుతుంది. తన భర్తకు ఆలాహలం మంటలు వల్ల ఏమీ కాకుండా వుండాలని దానికి ప్రతిగా ప్రతి కార్తీక పౌర్ణమికి తన భర్తతో సహా జ్వాలాతోరణం దాటుతానని అగ్నిదేవునికి మొక్కుకుంటుంది. శివునికి ఏమీ కాలేదు. ఈ కారణంగా ప్రతి కార్తిక పౌర్ణమి రోజునా పరమేష్టి పరమశివుని సహా జ్వాలాతోరణం దాటుతుంది
ఈ తోరణాన్ని కొత్తగడ్డితో చేస్తారు. కొత్త గోగునారని తాడుగా పేని రెండు వేప చెట్లకు మధ్యగా తోరణంలా కడతారు. కొత్తగడ్డిని అంటించగానే అది రెపరెపలాడుతూ కాలిపోతుంది. ఆ మంట ఆరేలోగా స్వామి వారిని మూడు మార్లు తోరణం కిందుగా తీసుకు వెళ్తారు.
భక్తులు ఈ జ్వాలతోరణం కిందిగా వెళ్తే నరక బాధలు తప్పుతాయని నమ్మకం. కైలాస ద్వారం తెరుకుంటుందని చెబుతారు
అలాగే తోరణం మండగా మిగిలిన గడ్డిని రైతులు ధాన్యం గాదెల్లో వేస్తారు. పశువులకు తినిపిస్తారు దీనివల్ల పాడి పంటలు సమృద్దిగా లభిస్తాయని నమ్ముతారు.
గడ్డి మండగా మిగిలిన నుశిని బొట్టులా పెట్టుకుంటారు. దీనివల్ల నరదిష్టి, భూత ప్రేతాత్మల పీడా వుండని నమ్మకం.
ఇది అంతా పెద్దలు చెప్పిందే దీనిలో తర్కానికి చోటు లేదు
పాటిస్తే వచ్చే నష్టమూ లేదు. కానీ తోరణం దాటేప్పుడు మెళకువగా లేకపోతే అగ్నిప్రమాదాలు జరగొచ్చు.
ఎందుకంటే గడ్డి మండుతూ రాలుతూ వుంటుంది. స్వామి అమ్మవార్లను కూడా చాలా వేగంగా తోరణం కిందుగా తిప్పుతారు

-- సరిదే నాగ్
ఫోటోలు పాదగయా క్షేత్రం పిఠాపురం లో జ్వాలా తోరణం

-- సరిదే నాగ్

పాదగయా క్షేత్రంలో జ్వాలాతోరణం

Saturday, 5 November 2016

బంతి .. బంతి పూల తోట

బుంగమూతి పూ బంతి..
పలుకనంటే ఎలా చెప్పుమరి..
క్రీగంటచూసి.. ఆశ రేపి..
ముడుచుకుంటే పాపమే సొగసరి

నీ తనువు బంగారం..
పలుకు కూడా బంగారమే..?
అర్భకుడిని తాళజాలనే..
కనులెదుట నిన్ను చూసి.. తాకకనే..

-- సరిదే నాగ్
ఫోటో : మాధవపురం బంతి పూల తోటలో

మునగాకు Drum stick leaves

ఈ రోజు

మునగాకు ఫ్రై..
దీనిలో  పీచు పదార్ధము ఎక్కువగా ఉంటుందట..
 ఎ, సి, విటమిన్లు , ఇనుము, క్యాల్సియం , పొటాషియం, తదితరాలు సమృద్దిగా వుంటాయట.
మా ఇంటి దగ్గర్లో చాలా మునగ చెట్లు వున్నా ఎప్పుడూ తినలేదు
ఈరోజే మొదటి సారి తినడం
-- సరిదే నాగ్