Saturday, 16 April 2016

నా మనసు.. నీ హృదయానికి చిక్కుకుంది.. చూడు

స్వేచ్ఛగా ఎగిరే గాలిపటం
చెట్టు కొమ్మకు చిక్కుకున్నట్టు..
పరుగులు తీసే తువ్వాయ్..
కట్టు కొయ్యకు తగులుకున్నట్టు..
నా మనసు..
నీ హృదయానికి చిక్కుకుంది..
బంధీకావడంలో మాధుర్యం..
చిక్కుకోవడంలోనూ సంతోషం..
నా మనసుకు బాగా వంట బట్టినట్టుంది..
అందుకే..
నేనెంత స్వాతంత్ర్య పోరాటం చేసినా..
నిన్నొదిలి రానంది..
ఏమందు పెట్టావో గానీ
నా మాట అసలు వినకుంది
ఏం నేర్పి పెట్టావో కానీ..
నీ తలపే ఎక్కువైంది..
నా వునికే ప్రశ్నార్థకమైంది..
ఏం చేయను నేనూ రాజీ కొస్తున్నా
నా మనసు బాటనే పడుతున్నా..
అవునన్నా కాదన్నా..
నేను నువ్వయ్యే క్షణం కోసం చూస్తున్నా..
--నాగ్

ద్రాక్షారామం ఆలయం.. సర్ప శిల్పం..


భారతీయ శిల్ప కళా వైభం మన ఆలయాల్లో ప్రతిబింభిస్తూ వుంటుంది..
నిజానికి మన ఆలయాలను కాపాడుకోవడం అనేది
ఆధ్యాత్మికంగానే కాదు.. మన కళలను సంరక్షించుకోడానికి కూడా..
ప్రతి ఆలయంలో ఏదో ఒక ప్రత్యేకత..
నాటి మహానుభావుల గొప్పతనం..
కళా ఔన్నత్యం గోచరిస్తాయి..
అనిర్వచనీయమైన ఆనందాన్నిస్తాయి..
ఆశ్చర్యం గొలుపుతాయి..
అబ్బురం అనిపిస్తాయి..
ద్రాక్షారామం ఆలయం పశ్చిమ గోపురం స్థంభం మీద..
ఈ శిల్పం అధ్బుతమనిపించింది..
మొత్తం రాయి మీద.. చిన్న గీతలా సర్పం..
పట్టి చూస్తే..
తడిమి చూస్తే గానీ కనిపించనంతటి చిన్న సర్ప శిల్పం..
ఆ సర్పం కోసం శిల్పి మొత్తం రాతిని చెక్కాలి..
చిన్నపాటి తేడా వచ్చినా..
శిల్పి కష్టం బూడిదలో పోసిన పన్నీరే..
అది చెక్కడానికి ఎంత నిష్ట.. శ్రద్ద.. ఓపిక కావాలో కదా..
మహానుభావులు అందించిన సంపదని కాపాడుకోడానికి ఆ మాత్రం శ్రద్ధ, ఓపిక మనకి కనిపించడం లేదు..
ఈసారి ద్రాక్షారామం వెళ్తే.. తప్పకుండా ఈ శిల్ప కళా వైభవాన్ని చూడండి..
భక్తి సరే..
కూసింత కళా పోసన కూడా వుండాలి కదా..
--నాగ్
ఫోటో : ద్రాక్షారామ దక్షణ గోపురం స్థంభంపై శిలా సర్పం.. నా వెనుక వున్న స్థంభం పై
నోట్ : కాపీ వద్దు.. షేరే చేయండి.

సముద్రంలో వేట నిషేదం

సముద్ర మత్స్య ప్రియులకి ఒకింత ఇబ్బందే..
ఈనెల 15 నుంచి 45 రోజుల పాటు
కన్యాకుమారి నుంచి కలకత్తా వరకూ ఇదే నిబంధన.
ఆ పిరియడ్ లో సముద్రంలోకి మత్య్సకారులు వేటకు వెళ్లడం నేరం
సో ఆ కాలంలో సముద్రం చేపలు దొరకవు. చెరువు చేపలే దిక్కు..
విషయానికి వస్తే..
ప్రతి సంవత్సరం సముద్రంలో ఈ కాలం లో వేట నిషేదం అమలులో ఉంటుంది
ప్రతి ఏప్రిల్ 15 నుంచీ సముద్రంలోకి వేట బోట్లు వెళ్లడం నేరం
ఆ కాలంలో చేపలు గుడ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతాయట. దానికి కనీసం 45 రోజులు పడుతుంది అట.
మర బోట్లు మెకనైజ్ద్ స్టీమర్లు, సముద్రంలోకి వెళ్తే చేపలకు హాని కలుగుతుందని వేటని నిషేదిస్తోంది ప్రభుత్వం.
అయితే సంప్రదాయ నాటు పడవలతో సముద్రంలో కొంత మేర వేటకు అనుమతి వుంది. మిషన్లు వున్న పడవలు వాడకూడదు అంతే..
ఈ నిషేదం కాలంలో మత్య్స కారులు వేటకు వెళ్లితే వారికి రూ.2500వరకూ జరిమానా విధిస్తారు..
పట్టుకున్న చేపల్ని బోటు సహా సీజ్ చేస్తారు. ఒక్కోసారి ఏడాది వరకూ జైలు కూడా వేయొచ్చు.
మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లకుండా తీరంలో పోలీసు, మెరైన్, నావీ పోలీసులు గస్తీ తిరుగుతారు
సుమారు రెండు నెలల పాటు చేపలు పట్టేవారికి ఉపాధి వుండదు.
ఆ కాలంలో ప్రభుత్వం నెలకి రూ.2వేలు, 25 కిలోలు పరిహారంగా అందజేస్తుంది..
ఇది ఏ మాత్రం మత్య్స కారులకి సరిపోదు.. అందుకే దొంగ చాటుగా అయినా వేటకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటారు.. జరిమానాలు సరే సరి..

సముద్రంలో వేట నిషేదం అమలులో ఉంటుంది.
--నాగ్
ఫోటోలు : ఉప్పాడ జట్టీ దగ్గర పడవను ఒడ్డుకు చేర్చే పని నటిస్తూ..
వేట నిషేదం పై ది హాన్స్ ఇండియా పత్రికలో నా కథనం

మూడు రకాల పుచ్చకాయలు

ముగ్గురు యువకులు..
ఉన్నత చదువులు చదువుకున్నారు..
వ్యవసాయం మీద మక్కువతో
గొల్లప్రోలు మండలం చిన జగ్గంపేట శివారు 18 ఎకరాలు లీజుకు తీసుకుని వ్యవసాయం ప్రారంభించారు.
వాళ్లే విశాఖకు చెందిన ఏజీవీ ప్రసాద్, గొల్లప్రోలుకు చెందిన వీరబాబు, విజయనగరంకు చెందిన ప్రసన్న ఈ ముగ్గురు మిత్రులూ పుచ్చసాగులో ఆధుని పద్దతులు పాటిస్తూ అద్భుతాలు చేస్తున్నారు. 
వీరు ప్రస్తుతం


మూడు రకాల పుచ్చకాయలు పండిస్తున్నారు.
ఎల్లో కింగ్.. ఈ పుచ్చకాయ పైన గ్రీన్ కలర్ వుండి లోపలి గుజ్జు పసుపు రంగులో వుంటుంది
ఎల్లో క్వీన్ .. ఈ పుచ్చకాయ పైన పసుపు రంగులో వుండి లోపల గుజ్జు ఎరుపు రంగులో వుంటుంది
ఏపిల్ మిలాన్ .. ఇది జామ, దోస, ఏపిల్ సంకరం. దీనిని తొక్క, పిక్కలు సహా జామకాయలా తినొచ్చు..
దీనిపై.. ది హ్యాన్స్ ఇండియాలో నా కథనం..
--నాగ్

భక్తరామదాసు బంధీఖానా


గోల్కొండలో కోటలో
బంధీగా వుంటూనే భగవంతుని సేవలో తరించారు రామదాసు..
పైన కనిపిస్తున్న కన్నంలో నుంచే ఆయనకు ఆహార, పానీయాలను అందించేవారట.
అదే వెలుతురు మార్గం కూడానూ..
ఒకప్పుడు సామాన్లు భద్రపరచాడానికి ఉపయోగించిన (అంటే మన స్టోర్ రూం అన్నమాట) గదులని బంధీఖానాగా మార్చి వుపయోగించారట అప్పటి తానీషా.(1672-1787)
ఇది పుక్కిటి పురాణం కాదు.. చరిత్ర..
కనులెదుట సాక్షీభూతంగా నిలిచిన బంధీఖానా..

బంధీఖానాలో వున్న భక్తరామదాసు (కంచర్ల గోపన్న) పూజించిన సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాములు వీరు.
--నాగ్

అర్థరాత్రి రాములోరి పెళ్లి..

అర్థరాత్రి రాములోరి పెళ్లి..
మీరు సరిగ్గానే చదివారు..
అచ్చంగా అర్థరాత్రి 11 గంటల లగ్నానికి సీతారాముల పెళ్లి..
ఇది గొల్లప్రోలు మండలం చేబ్రోలు సీతారామాలయంలో ప్రతి ఏటా జరిగే శుభకార్యం
సాదారణంగా సీతారామ కల్యాణం మిడసరి లగ్గంలో అంటే.. మధ్యాహ్నం జరుగుతుంది.
భద్రాద్రి అయినా. అన్నారం అయినా.. తిరపతైనా.. ఇదే ముహూర్తం.
అయితే ఒక్క చేబ్రోలులో మాత్రం నిశి వెళ కల్యాణం జరుగుతుంది..
దీనికి ఐతిహాసిక కారణాలు ఏవీ లేవు కానీ
చారిత్రక కారణం మాత్రం వుంది.
చేబ్రోలు పిఠాపురం జమీందారీలో శివారు గ్రామం.
పిఠాపురం మహారాజా రావు వెంకట గంగాధర రామారావు క్రీ.శ 1800లో ఇక్కడ ఆలయాన్ని కట్టించారు.
అలాగే ప్రతి శ్రీరామ నవమికి మహారాజా తన రాజ్యంలోని రామాలయాలు అన్నీ తిరిగి కల్యాణం తిలకించడం ఆనవాయితే..
పిఠాపురం రాజ్యంలో రామాలయాలు అంటే తక్కువేమీ కాదు.
ఈ ఆధునిక కాలంలోనూ వీధికో రామాలయం వుంది..
దీంతో మహారాజా శివారు గ్రామం చేబ్రోలు వచ్చేసరికి రాత్రి అయిపోయేది..
అక్కడి జనం మహారాజు మీద గౌరవంతో ఆయన వచ్చే వరకూ రాములోరిని తాళీ కట్టనిచ్చేవారు కాదు.
మహారాజా ఈ ఆచారాన్ని మాన్పించాలని మొదట్లో అనుకున్నా ప్రజలందరూ.. తమకూ ఈ ముహూర్తమే బావుందని, రైతులు, కూలీలు,, కార్మికులు, చిన్నా పెద్దా.. ఆడా మగా తమ పనులు పూర్తి చేసుకుని చక్కగా.. చల్లగా సీతారామ కల్యాణం చూడటానికి బావుందని మహారాజుకు విన్నవించడంతో మహారాజు కూడా దానికి అంగీకరించి. అర్థరాత్రి ముహూర్తాన్నే ఖాయం చేశారట.
ఇక అప్పటి నుంచీ చేబ్రోలు సీతారాములకు రాత్రి 10 దాటాకే కల్యాణం జరుగుతుంది.
ఈ రోజు కూడా రాత్రి 11 గంటలకు ముహూర్తం..
కల్యాణ క్రతువు జరుగుతోంది..
అన్నట్టు ఒంటిమిట్టలోనూ రాత్రివేళే కల్యాణం అట..
--నాగ్
ఫోటో : చేబ్రోలులో రాత్రివేళ రాములోరి కల్యాణం ఫోటోవులు
నోట్ : నచ్చితే షేర్.. లేకుంటే పరవాలేదు.. కానీ కాపీ మాత్రం వద్దు

చూపు తిప్పుకోనివ్వడం లేదు మరి...ఆ అందం

మరోలా అనుకోకండి
ఆ అందం చూపు తిప్పుకోనివ్వడం లేదు మరి...
చిత్రకారులు ఎం ఎన్ రాయ్ గారట..
--నాగ్
ఈ ఫోటో : సాలార్ జంగ్ మ్యూజియంలో పెయింటింగ్