Friday 18 September 2015

సెలవిక.. కిర్రు కిర్రు శబ్దాలు..

సెలవిక..
కిర్రు కిర్రు శబ్దాలు..
ఇనుప చక్రాల హాహా కారాలు..
తుప్పు రేకుల ఘీంకారాలూ..
సెలవిక..
అన్నీవదిలి వెళ్తున్నానిక..
సత్తువు ఒడిగి.. బొమికలు మిగిలి..
ప్రాణమున్న తిత్తిలా.. వెళ్తున్నానిక

వస్తాడొకడు.. మీకు తోడుగా..
కర్కశ ఇనుప చక్రాల మధ్య..
కండలు కరిగించేవాడు..
తన వేడి ఊపిరి ఆవిరి మధ్య
సలసల బాయిలర్ల మండించేవాడు
క్తం మరిగించి.. యంత్రం నడిపేవాడు..
వస్తాడొస్తాడింకొకడు..
నరాలు మెలిపెట్టి.. చక్రం తిప్పి
యంత్రపొగల ఆవిరులకి
ఊపిరి తిత్తులు ఫణంగ పెట్టి..
గుండెను అరగతీసి.. బెల్టులు తిప్పి..
యంత్ర భూతాల మధ్య..
ఇనుప పిశాచాల కోరలకు కండలు ఎరగా వేసే
ఇంకొకడొస్తాడు..

బకాసురిడికి రోజుకొక్కడే..
లాభాల పిల్లలు పెట్టే.. ఖార్కానాశురుడి ఆకలికి ఎందరో..
అయినా..
వస్తాడింకొకడు..
తన ఆయువు.. ముద్దకట్టి
నీకు బలి ఇచ్చేందుకు..
అణాకానీ కూలికి.. బతుకంతా చాకిరీ చేసేందుకు..
చమట దారలుసైతం లెక్క చేయక..
వరుసలో నిలబడి మరీ..
వస్తాడింకొకడొస్తాడు..

యంత్ర రాక్షసుల ఇనుప కోరలెన్ని ఏళ్లు తోమినా..
రబ్బరు బెల్టులు తెగి వాతలు తేలినా..
కణ కణ మండే నిప్పురవ్వలు ఎగిరి పడినా..
రోజు సగం గడిచి.. పూట పస్తులున్నా..
చివరికి ఏమీ సాధించలేక..
బతుకు సమరంలో ఓడిన సైనికుడిలా..
తలవాల్చి నేను వెళ్తున్నా..

వస్తాడింకొకడు నా చోటులో..
బలిపశువు కాడానికి..
ఫ్యాక్టరీ సైరన్ విని పరుగు పరుగున..

--నాగ్

No comments:

Post a Comment