Wednesday 16 September 2015

నా కంటూ వున్నది నీవే

నా కంటూ వున్నది నీవే
నా దురదృష్టం నే వున్న సంగతే నీకు తెలీదు
నే అనుక్షణం తలచేదీ నిన్నే
నా తలపే నీకు లేదు
నాతో ఆడిన గుజ్జనగూళ్ళు..
పంచుకున్న కాకి ఎంగిళ్ళూ..
తాటి ముంజుల వాహనాలు..
ఆడుకున్న దాగుడుమూతలూ
నీకు గుర్తు లేవేమో గానీ
అవేనా ప్రేమకు ఆధ్యాలు

నా తొలి ప్రేమను నువ్వు గుర్తించలేదు
నా ప్రతిపాధనను నీ వంగీకరించలేదు
నిను కదిలించాలని చేసిన ప్రతి ప్రయత్నం ఫలించలేదు
అయినా నీ జ్ఞాపకం నను వదలడం లేదు

నిను చూసిన నా కళ్ళు.
మరే అందాన్నీ అంగీకరించనంటున్నాయి
నీ చిరునవ్వు సవ్వడికి అలవాటు పడిన నా చెవులు
మరే సంగీతమూ విననంటున్నాయి
నీ పేరు మాత్రమే పలికే నా పెదాలు
గాయత్రీ మంత్రం సైతం పలకడం లేదు

హృదయమంతా.. తెరిచి వుంచినా
కనీసం తొంగి చూడవు
జీవితమంతా ఎదుట పరిచినా
పలకరించవు..
వేచి చూడడమే ప్రేమ పరమార్థమని
తలపులోనే తన్మయముందని
విషాదంలోనే ఆనందముందని
నిను ప్రేమించాకే తెలిసింది

నీ కన్నుల వాకిట నిలవడానికే
ఈ జన్మ సరిపోతే ..
నీ హృదయం చేరటానికి
మరో జన్మ అవసరమే కధా.
--నాగ్
ఫోటో: గూగుల్ వారిది.. అసలు యజమాని తెలీదు.. వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment