Friday 18 September 2015

అప్పుడే వెలుగు చూశాను..

అప్పుడే వెలుగు చూశాను..
అమ్మ పొత్తిళ్ల వెచ్చదనం చూశాను..
ఎవరో వచ్చారు..
అమ్మపొత్తిళ్ల నుంచి నన్ను తీసి..
"అరే.. 'ఆడ' పిల్లరా అన్నారు
అప్పుడే తెల్సింది నా పేరు ఆడపిల్లనని..
ఆ కంఠంలో నిరుత్సాహం చెప్పింది..
నేనంటే వాళ్లకి ఇష్టం లేదని..
నేనేం చేశాననీ..

అప్పటి నుంచీ అంతా 'ఆడ' పిల్లే అన్నారు
ఈడ పిల్లను కాదట..
పరుగెత్తొద్దన్నారు..
గెంతెద్దన్నారు..
పగలబడి నవ్వొద్దన్నారు..
సైకిల్ నేర్చుకో వద్దన్నారు..
చెట్టెక్కొద్దన్నారు..
ఫ్యాంటు వేసుకోకూడదట..
కాలు మీద కాలేసుకోకూడదట..
అవన్నీ తమ్ముడి హక్కులట..
నా మీద ఎందుకింత కచ్చటా..

జారిపోయే ఓణీ అట..
ఒరుసుకు పోయే పట్టీలట..
ముక్కుకీ.. చెవులకీ కన్నాలట..
ఏమిటీ శిక్షా అంటే..
పొలం పనొద్దట.. వంట పని నేర్చుకోవాలట
వచ్చేవాడికి అవన్నీ ఇష్టమట..
ఇక్కడా ఆడదానివి కాదూ..
అదే మాట..
చిత్రం ఇవన్నీ చెప్పేదీ.. మరో ఆ... డదే..

అక్కడ అమ్మా నాన్నకి సేవ..
ఇక్కడ అత్తా మావకీ సేవే..
అక్కడ అన్నా తమ్ముడు దాష్టికం
ఇక్కడ మొగుడుగారి డాంభికం
పుట్టిన చోట ఆడ పిల్ల అన్నారు..
పెళ్లైనా అదే మాటా.. ఆడది..
ఇంతకీ నేను ఏడ దానినీ..
(ఓ సోదరి కన్నీటి ప్రశ్న.. సమాదానం తెలిస్తే చెప్పండి ప్లీజ్)

--నాగ్

No comments:

Post a Comment