Friday 18 September 2015

ఓ చల్లని సాయంత్రం..గోదారి ఒడ్డున ఒంటరిని..

ఓ చల్లని సాయంత్రం..
భానుడు నీరెండగా మారి సెలవు తీసుకునే క్రమం
పిల్లగాలులు పరుగులు తీసే సమయం..
మదిలో నీ ఊసులు సందడి చేసే క్షణం..
గోదారి గట్టుపై.. 
అలల సోయగాలను చూస్తూ..
చిరు చేపల అల్లరికి మైమరిచి..
వేచి వున్నా నీకోసం..
దూరంగా పచ్చని కొబ్బరి చెట్ల వరుస..
నది కన్యను కాపాడే వస్తాదుల్లా..
మరో వంక..
అలల తాకిడికి ఊగుతూ.. ఒంటరి పడవ..
తీరం చేరడానికి అది పడుతున్న తహతహ..
నా మదిలో ఆరాటానికి ప్రతి రూపంలా..
నదిలో నీడలు కదిలిపోతున్నాయి..
నదిపై విహాంగాలు గూడు చేరుతున్నాయి..
అప్పటి వరకూ గోదారి సోయగాలు చూసి ఎర్రబడ్డ సూర్యుడు..
ఆ నదీ గర్బంలోనే తల దాచుకుంటున్నాడు.. సిగ్గుతో..
నా మదిలో గుబులు..
నువ్వు రావేమో..
ప్రకృతి పరిహసిస్తోంది.. అనుభవించవేమని
చిరుగాలి గేలి చేస్తోంది.. ఆనందించరా అని..
గోదరమ్మ చేయి పట్టి లాగుతోంది.. తనను చేరమని..
ఏం చెప్పనూ..
నా ఆనందం.. సంతోషం.. నీవేనని..
వాటికి ఎలా చెప్పనూ..
గోదారి ఒడ్డున ఒంటరిని..
ఒడ్డుపై వున్న బండరాళ్లల్లో ఒకడిని..

నోట్ : ఇది సరదాగానే రాశానండోయ్..
నేనేదో విఫల ప్రేమికుడిని అని అనుకుని జాలి కురిపించొద్దు ప్లీజ్ smile emoticon
--నాగ్

No comments:

Post a Comment