Friday 18 September 2015

అమ్మను చూశాను.. చాలా దగ్గరగా..

అమ్మను చూశాను..
చాలా దగ్గరగా..
ఎర్రని కుంకుమ రాసి పోసినట్టున్న
అమ్మను చూశాను
కళ్లల్లో కళ్లు పెట్టి జంకు లేకుండా..
ఆ కళ్లు దయను కురిపిస్తున్నాయి
ఆ నేత్రాలు వెన్నెలలా మెరుస్తున్నాయి
కన్నీటీతో అమ్మను చూశాను..
అడిగాను దీనంగా..
ఏమిటీ రక్తపు వాసన..
ఏందుకీ మూగ జీవుల రోధన..
తెగిపడుతున్న తలలకు లెక్కలేదా..
కన్న పేగునే బలికోరతావా..
నీ ఒడిలో జీవులు నిర్భీతిగా తిరిగే రోజు రాదా..
అమ్మ నవ్వింది..
ఆ నవ్వులో వేదన..
అమ్మ నోరు తెరిచింది.. ఉరుము ఉరిమినట్టు..
నాకు భయం వేయలేదు.. అమ్మే కదా..
అమ్మ అడిగింది..
నే అడిగానా..
నా బిడ్డలను నాకే బలి చేయమని..
నాకు ఇష్టమా.. నా బిడ్డల ఆక్రందన..
నే ఆదేశించానా.. రక్త కల్లాపీ చల్లమని..
ప్రకృతికే అందం నా లోవ కోన.. మరుభూమి చేయమన్నానా..
పాలు పోసినా వరాలిచ్చానే..
కొబ్బరి కొట్టినా స్వీకరించానే..
సాంభ్రాణి ధూపానికే మైమరిచానే..
దణ్ణం పెడితే ఆశీర్వదించానే..
తలలు నరకమని కోరానా..
అమ్మ అడిగింది..
ఏం చెప్పనూ..
మటన్ తో మజా కోసం మేకనీ..
కోడి పలావు కోసం కోడిని
అమ్మ వంకన కోస్తున్నామని ఒప్పుకోనా..
మదమెక్కి మందుకొట్టి తైతెక్కలాడటానికి..
మొక్కు వంక చెబుతున్నామని చెప్పనా..
సిగ్గుతో తల దించుకున్నా.
అమ్మ కళ్లలోకి మునుపటిలా చూడలేకపోయా..
దీనంగా మెట్లు దిగుతున్నా.. ఒక్కో మెట్టూ..

నోట్: ఎవరి నమ్మకాలు వారివి.. ఎవరి మనోభావాన్నైనా దెబ్బతీస్తే క్షంతవ్యుడిని..

--నాగ్

No comments:

Post a Comment