Friday 18 September 2015

నా గురువు బలవంతుడు..

నా గురువు బలవంతుడు..
చిటికెన్న వేలిపై 'భూగోళం' తిప్పేస్తాడు..
మా గురువు ధనవంతుడు
'లెక్కలు' అలవోకగా చెప్పేస్తాడు..
మా గురువు జ్ఞానవంతుడు
'సైన్స్ రహస్యం ' చిటికెలో విప్పేస్తాడు
మా పంతులుగారి నాలుక పలుచన..
'తెలుగు' మధురంగా పలికిస్తాడు
మా మాష్టారు నోరు విప్పితే..
'ఆంగ్లం' సైతం ఎంత తీయన..
క్లిష్టమైన హింధీ మాటలు
ఆయన నోట వీనుల విందే కదా..
మాతో 'ఆట' లాడేవేళ
ఆయన మాకన్నా చిన్నోడే..
చతురులాడితే... పొట్ట చెక్కలే..
దండిస్తే.. దెబ్బ శరీరానికి కాదు..
తగిలేది మనసుకే..
ఆయన చేతితో దండించినా..
మనసులో కన్నీరు కార్చడం మాకు తెలుసు
సెలవు రోజు పాఠాలేమిటని కసురుకున్నాం.
ఆ సెలవును ఆయన మాకోసం త్యాగం చేశారని మరిచిపోయాం
మేము ఏడాడికొక్కసారే పరీక్షలు రాస్తే..
ఏడాది పొడవునా మాతో ఆయనకు పరీక్షలే
అమ్మా.. నాన్న తర్వాత..
'మా పిల్లలు' అని సంభోదించేది మా గురువులే
మా గురువు గొప్పవాళ్లకు గొప్పవాడు
ఎంత గొప్పవాడైనా అయన పాదాలకే నమస్కరిస్తాడు
మా గురువు మహానుభావుడు..
మా మనస్సుల్లో ఇప్పటికీ నీతి పాఠాలు చెబుతూనే వున్నాడు..
తట్టి హెచ్చరికలు చేస్తూనే వున్నాడు

(నేనెరిగిన గురువు గురించి)
--నాగ్

No comments:

Post a Comment