Wednesday, 16 September 2015

ఊరు నిదరోతోంది..

ఊరు కమ్మగా నిదరోతోంది..
ఇసుక తిన్నెపై నేను.. మౌనంగా
సముద్ర ఘోష మినహా ఏమీ వినిపించడం లేదు
దూరంగా నల్లని సంద్రంలో ఎర్రని సూరీడు
నల్లరేగడి మడిలో భోగిమంటలా..
మంట తగ్గిన నిప్పు కణికలా..
వంకాయల నడుమ మిరప పండులా..
పేరుతెలీని పక్షుల గుంపు..
సూర్యుని రాసుకుంటూ.. ఏంతో పని వున్నట్టు
కిలకిలా రావాలు సంద్ర ఘోషలో..
కనిపించని వాయిద్య కారుడు..
విచిత్ర వాయిద్యం వాయిస్తున్నట్టు
నిశ్శబ్దాన్ని చీల్చేస్తూ అందమైన ధ్వని

కిరణాలకు అలలు మెరుస్తున్నాయ్
ఇసుక తిన్నులు బంగారు కొండలవుతున్నాయ్
వేగంగా వచ్చిన అలలు
బండరాళ్ళను డీకొట్టి.. ఛిద్రమవుతున్నాయ్.
అంతలోనే బంగపడి అలిగినట్టు వెనక్కి వెళ్లిపోతున్నాయ్
సగటు మనిషి జీవితంలో ఆశలా
భానుడు ఉదయిస్తున్నాడు..
కష్ట సుఖాలకు సింబాలిక్ గా నీటిలో
మర పడవలు ఊగిసలాడుతున్నాయ్
పట్టణం చైతన్యమవుతోంది..
రణగోణద్వణులతో సంద్రం బిత్తరపోతోంది
యాంత్రిక జీవనం ఊపిరి పోసుకుంటోంది
అద్బుత దృశ్యం వివర్ణమవుతోంది
బాల భానుడు నిప్పులు కక్కుతున్నాడు
నాలో యంత్రం స్విచ్చాన్ అవుతోంది
కదలాలి.. కాంక్రీటు జంగిల్ లో వేటకు పరుగులు తీయాలి
అవును నేను యంత్రాన్ని..
మనిషిని అయ్యేది రేపు శుభోదయాన్నే
అంత వరకూ..

--నాగ్

నీరసం మీ ఇంటిపేరైనట్టూ

నీరసం మీ ఇంటిపేరైనట్టూ
విచారం సొంతపేరైనట్టు..
ఎవరో మీ వందకోట్ల ఆస్తై దొబ్బేసినట్టు.
ఏందుకా విచారం..
ఓడిపోతే ఏమైందీ..
ఆట అయిపోలేదుగా..
జారిపోతే ఏమైంది..
పైకే లేచే సమయం వుందిగా
మునిగిపోతే.. ఏమైందీ
ఎదురీదే శక్తి వుందిగా
పడిపోతే.. లేవలేమా
పరుగెత్తి చూపమా..
గేలి చేసిన చోటే.. గెలిచి చూపాలి
గట్టుదాటలేనని కెరటం ఆగుతుందా..
ఉప్పెనై.. ముంచెత్తదా
పదిమంది అన్నమాట చెల్లేది..
పాత రోజుల్లో
నీవన్నదే జరిగాలి.. ఈ జమానాలో
ఏదైనా నీ చేతిలోనే..
రేఖలు కాదు.. చేతలు నమ్ముకో
కొడితే దిమ్మతిరగక్కర్లేదు..
నీ జీవితం సాఫీగా సాగితే చాలు
ఓటమి నిప్పైతే..
నిరాశ గాలిలా తోడవుతుంది..
అందుకే నిశ్శత్తువను తొక్కేసి..
ముందుకు ఉరికితే..
ఓటమి తోకముడుస్తుంది
గెలుపు నీ ఇంటి కుక్కవుతుంది
లేదు..కాదు.. అవదు.. మాటలు
నీకు సూటు కావు నేస్తం
మొదలెట్టు..
అటో ఇటో ఎటో వైపు
---నాగ్

ముసుగేసుకున్న ముఖాలు.

ముసుగేసుకున్న ముఖాలు..
తెచ్చి పెట్టుకున్న చిరునవ్వులు
అప్యాయత చిలకరించిన పలకరింపులు
ఇరుకు మనస్సుల్లో ఈగోలు
అవును మనం మారిపోయాం
ముఖాలకు అద్దె మాస్కులు తగిలించుకున్నాం..
వెలిసిపోయిన బొమ్మలకు
ఆర్భాటాల చెమ్కీలు అలంకరిస్తున్నాం
మనసుల మధ్య అంతారాల అడ్డుగోడలు కడుతున్నాం
మనిషి పెరిగే కొద్దీ
మనసు తరిగి పోతుందా..
అవునేమో..

గట్టిగా శబ్దం వచ్చేలా నవ్వి ఎంతకాలమైంది..
గుండె బరువు తగ్గేలా బిగ్గరగా ఏడ్చి ఏన్నేళ్లయ్యింది..
నోరారా నిజం మట్లాడాలంటే ఎన్ని నిభందనలు..
పిజ్జాల మాటున.. మాగాయి పెరుగన్నం మాయం.
కరెన్సీ నోట్ల లెక్కల మధ్య
పసితనపు స్వచ్చత గల్లంతు..
అంతస్తులు పెరిగే కొద్దీ..
పాతాళానికి మన అస్తిత్వం
ఏదీ ఒక పట్టాన ఒప్పుకోలేని సంకుచితత్వం

అవును..ఈ కృత్రిమ లోకం నుంచి హఠాత్తుగా మాయం అయితే ఎంతబావున్ను..
తగిలించుకున్న మాస్కులు తగలేసి
పాల నవ్వుల.. మనసు తెల్లన లోకానికి వెళ్లిపోతే ఎంతబావున్ను.
హద్దులేని.. అవదులు లేని..
ఈగోలా చట్రాలు లేని..
మాయ ముసుగులు లేని
ఆ లోకంలోకి మరోమారు వేళ్లిపోతే ఎంత బావున్ను

---నాగ్

పెరట్లో అంతా సాంబ్రాణి ధూపం..

పెరట్లో అంతా సాంబ్రాణి ధూపం..
ఆమె తల ఆరబోసుకుంటోంది..'
తడారని కురుల నుంచి ముత్యాల్లా..
రాలిపడుతున్న నీటిబిండువులు
సూర్య కాంతికి అవి భువిపై చుక్కలు తెస్తున్నాయ్
శుప్రభాత కాంతిలో..
అప్పుడే దిద్దిన కుంకుమ మరో సూర్యుడిలా
మంద్రస్థాయి సంగీతంలా సవ్వడి చేసే చిరునవ్వు
దైవత్వం నిండిన ఆ మోము..
ఆమె కదిలింది.. చిరుమువ్వల సవ్వడి..
అంతవరకూ ఆమె కూర్చున్న మొక్కాలిపేట అలిగింది
అనంత సౌందర్యం తన నుంచి దూరమైందని
తడారని మడి చీర తపతపల మధ్య..
కాలి అందెల శబ్ధం..
ఏదో పేరులేని కొత్త రాగంలా.
నడుము వంపు అలకనందలా..
జాలువారిన కురుల భరత నాట్యం..
ఆమె వెళ్లిపోతోంది.. వెళ్లిపోతోంది
నా కాళ్లు కదలడం లేదు..
చేతన.. అచేతన స్థితి..
మనసు ఆదేశాలు శరీరానికి అండడం లేదు
అవును అందేంత దగ్గరగా మనసు లేదు..
ఆమె వెంట పరుగులు తీస్తోంది
అందెల శభ్దంతో మమేకమై
కురుల నాట్యానికి పక్కతాళం వేస్తూ..
అలకనందలో చిక్కిపోడానికి
వెళ్లిపోయింది..
మతి పోయింది..
--నాగ్

దున్నపోతుల బండి.

దున్నపోతుల బండి..
ఎప్పుడో చిన్నప్పుడు చూశా.. మళ్లీ ఇన్నేళ్ళకి చింతపల్లి వెళ్లే దారిలో కనిపించింది
భారతం లో బకాసురుడు ఇలా దున్నపోతుల బండి నిండా అన్నం ఇతర పదార్థాలు తినేవాడట.. ఏదో సినిమాలో చూసిన గుర్తు..

అడ్డిపిక్కలట.

ఈ పిక్కలు చూశారా.. వీటి పేరు
అడ్డిపిక్కలట..
అదేనండి మనం అడ్డాకు అంటాం(విస్తరాకు) కథా.. అదే తీగకు ఈ కాయలు కాస్తాయి..
వాటి పిక్కలే ఇవి.. గిరిజనులు వీటిని బాగా కాల్చి చింతపల్లి సంతలో అమ్ముతున్నారు..
ఒక్కో పోగు రూ.10..
నేనూ నా మిత్రుడు బాలిపల్లి రాంబాబు కొత్తగా అనిపించినా ఆ పిక్కలు కొని తిన్నాం..
అచ్చంగా మన వేరుశనగ లానే వున్నాయి.. రూ. 10 తక్కువే అనిపించింది.
మరి ఎండుకు మనవైపు రావడం లేదో తెలేదు గానీ ఇవి సీజనల్ గానే దొతుకుతాయని అక్కడి గిరిజనులు చెప్పారు..
ఫోటోలో నేనూ నా మిత్రుడు.. ఇన్ సెట్ లో అడ్డి పిక్కలు
ధన్యవాదాలు

--నాగ్

సెలయేటి..గలగల..

సెలయేటి..గలగల..
చిరుగజ్జెల ఘణఘణ
తామరాకులాంటీ పాదాలపై.. నీటి అల'జడి'
నా హృదయంలో ఏదో అలజడి

నువ్వొస్తావన్న మాట.. నాలో కోటి వీణలు మీటితే..
నువ్వు రాలేదన్న సత్యం..నాలో నిశ్శబ్ద వేదన మిగిల్చింది
నీ ఊహ మది తట్టగానే..
పారే నదిలో వున్నా.. పరువం వేడెక్కుతోంది
మాట తప్పావన్న బాధను..
నీ జ్ఞాపకాల ఆనందం అణిచేస్తోంది..
అలగాలని చూసినా.. ఏమిటో ప్రేమే వస్తోంది..
కోపంగా వెళ్లాలని ప్రయత్నించిన ప్రతిసారీ..
నా కాళ్ళు కదలడం లేదు..
కోపంగా ఎర్రబారిన కళ్ళను..
నీ తలపులో.. కవ్వింపులో.. సిగ్గులో..
ఎరుపెక్కిన చెక్కిలి డామినేట్ చేస్తోంది.
ఇప్పుడు నువ్వు రాకుంటేనే నయం..
విరహం ఆవిష్కృతమైన నన్ను చూసి లోకువ చేస్తావు
నిన్ను చూసిన వెంటనే అదిరే అధరాలు..
నీ వైపు అసంకల్పితంగా కదిలే కాళ్ళు..
కెంజాయి రంగు పులిమిన చెక్కిలి..
అసలుకే ఒంపు.. నిను చూసిన సందడిలో
మరింత మెలికలు తిరిగిన నడుము..
విల్లులాంటీ మేడపై.. పట్టిన చమట
నన్ను నీకు పట్టిస్తాయి..
నది సవ్వడిని మించిన నా మనసు ఘోషను నీకు వినిపిస్తాయి..
ఇక నువ్వు నన్ను లెక్క చేస్తావా..
కోంటేగా.. ఆట పట్టించవూ..
నీ సంగతి తెలిసిందిలే అన్నట్టు.. సన్నని మందహాసం
పెదవి విరిపుతో వెక్కిరిస్తే తట్టుకో గలనా..
కోపం.. అలకలను నదిలో కలిపేసి..
పరుగున ఒచ్చి నీ ఒడిలో గువ్వలా ఒదిగిపోనూ..

ఏమున్నది నేస్తం.. ఆ చూపులో
నాలో ఏమీ లేకుండా చేస్తున్నావ్ నిమిషంలో
ఏమున్నది ప్రియా ఆ చేతి స్పర్శలో..
నాకు అన్నీ ఇచ్చి ఏమీ లేనివాడవవుతావ్

--నాగు