Wednesday 16 September 2015

రోదన సంగీతం అవుతుందా..

రోదన సంగీతం అవుతుందా..
ఏమో.
నువ్వు పుట్టగానే పెట్టిన కేక నాకు కీరవాణీ అయ్యింది
ఎప్పుడూ అమ్మ ఒడిలోనే వుంటూ..
నేను దగ్గరికి తీసిన ప్రతిసారీ నాపై చిచ్చు పోస్తే..
నే వుడుక్కున్నా.. అంతా ప్రేమరా అని మా అమ్మ చెప్పినా
నువ్వు నడుస్తుంటే చూడాలని తాపత్రయం..
నీ సైకిల్ వెనుక పరిగెడుతుంటే అంతా నవ్వేవారు..
వాళ్లకేం తెలుసు పడితే దెబ్బతగిలేది నా కొడుక్కి
నీ ప్రతి కదలికా నాకు తెలియాలి...
నీ అభివృద్దికి నీడ నే కావాలి..
నువ్వు ఓడినా.. ఫలితం నే భరించాలి..
నువ్వు గెలిచిన ప్రతిసారీ ఆ గొప్ప నీకే రావాలి..
నా ప్రతి రక్తపు బొట్టూ.. రూపాయి అయితే..
అది నీ ఖాతాకే జమ కావాలి..
నువ్వు రాజువైతే.. నే బోయీ కావాలి..
నువ్వు తారాజువ్వలా పై కెగిరితే..
నే కొవ్వొత్తిలా కింది నుంచి చూడాలి..
నీ నిర్లక్ష్యం నన్ను బాధించినా..
చిరునవ్వు చిలికే శక్తి నాకు రావాలి.
నీ చీత్కారాలు.. విధిలింపులు
అంతా ప్రేమే అనుకునే మనసు కావాలి
నే పోయే రోజున తలకొరివి పెట్టడానికి
నీకు విమానం టెక్కెట్ దొరకాలి..
నువ్వు బావుండాలి..
బిడ్డా చల్లగుండాలి..

--నాగ్
ఫోటో: గూగుల్ వారిది.. అసలు యజమాని తెలీదు.. వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment