Wednesday 16 September 2015

ఆకలి., నాకు నచ్చిన మాట..

ఆకలి.,
నాకు నచ్చిన మాట..
నన్ను పెంచిన పదం
అదంటే నాకు గౌరవం
బతకడం ఎలాగో చెప్పిన తండ్రి

బతికున్నానని నిత్యం గుర్తు చేసే తల్లి..
నాకు ప్రపంచాన్ని పరిచయం చేసిన గురువు
నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన స్నేహితుడు
ఆకలి.. ఆకలి

ఆకలి.. నా నెచ్చెలి.
పోరాడమని చెప్పింది..
పోరాటం నేర్పింది..
నన్ను ప్రేమించింది..
నా చేత ప్రేమించ బడింది..
అవును.. ఆకలి నా ప్రేయసి
తనని తలవందే నేను లేను
నన్ను తడవనిదే తాను లేదు
నిత్యం నా వెంట వుంటుంది..
ప్రేయసిలానే దుంప తెంచుతుంది..
అది లేనిదే.. నేను లేను
తన కోసమే ఈ పరుగు..
అగే వరకూ అలసే వరకూ..
ఆగి 'పోయే' వరకూ పరుగు

--నాగ్

No comments:

Post a Comment