Monday, 14 September 2015

నీ అక్షరం నీ బలి కోరుతోంది..

నీ అక్షరం నీ బలి కోరుతోంది..
విశ్లేషన మరిచిన విలేకరీ..
నిన్న వరకూ నీ చేతిలో
అలవోకగ నర్తించిన కలం
కరాళ నృత్యం చేస్తోంది..
జీర్ణం కాని నిజాలను
కక్కేస్తోంది.. నీ తాట తీసేస్తోంది

నీ దీనరూపం చూసీ..
పత్రిక కన్నీరుతో తడిచిపోతోంది..
దీనికి నీ సమాధానం.. అంటూ
లోగో పెట్టి ప్రశ్నిస్తోంది..

ఎముకల గూడుకు.. పైజమా తగిలించి
చిరిగిన చెప్పులు వేసుకునే
నీరూపం మారింది..
చొక్కా లోపలికి తోసి. జీను ఫ్యాంటు వేసినా..
లోపల చిరిగిన బనీను అలానే వుంది
బక్కచిక్కిన డొక్క ఎండుతూనే వుంది

సమాజ ఉద్దరణ కోసం..
అక్షరాలు కుమ్మరిస్తావ్
అవినీతి.. అక్రమం అంటూ..
రంకెలెన్నో ఏస్తావ్
నీ కింద నలుపు.. కనబడకుండా దాచేస్తావ్

నీకుందా కనీస వేతనం.?
నీది కాదా శ్రమదోపిడీ
కట్టు బానిసలు లేరని ఎవరన్నారు..
నిన్ను నీవు చూసుకో అద్దంలో..
కార్మిక చట్టాలు ఔపోసన్ పెట్టిన
ఓ అమాయక లేఖరీ..
నీ కెక్కడయ్యా ఆ చట్టాల బాసట

ఓ విలేఖరీ నీకు..
బయట పల్లకీల మోత
అది.. ఇంటి వరకూ రాదు..
వస్తే.. ఈగల మోత..
ఎప్పుడో ఆగి వుండేది

సలాముల మత్తులో
చంటిదాని పాల సంగతి మరిచిపోయావ్.
మంత్రిగారి కరచాలనంతో..
అమ్మ మందులూ గుర్తు రాలేదు..
అక్షరం నీ సొత్తని విర్ర వీగావ్
నీ భార్య ఒంటిపై వీసమెత్తు సొత్తు లేదని
మరిచిపోయావ్
నీసంస్థ కంటిన పార్టీల రంగు..
అక్షరాని కంటించావు..
ఆ పాపానికి ఫలితం..
వర్గపోరుకు బలి అయ్యావు
ప్రశ్నించడం శృతి మించితే..
శాడిజం అని మరిచిపోయావ్

నీ కంటికి ..మినహా..
నీకు లేదు దూరదృష్టి
వుంటే.. నీ చొక్కా చిరిగేదు కాదు
నీ గెడ్డం మాసేది కాదు.
జర్నలిజం మత్తులో
సర్వం కోల్పోయేవాడివీ కాదు

వెనుదిరిగి చూస్తే..
నువ్వు సాధించిందేముంది..
పాత పేపర్ల కటింగులు తప్పా..
నేతలు చేతులేసి దిగిన చిత్రాలు గొప్పా
అందుకే నీ అక్షరమే..
నీ బలి కోరుతోంది..
నీ కలమే నేడు..
రుధిరం కక్కుతోంది..
సమాధానం చెప్పలేని
ప్రశ్నలెన్నో లోగో అడుగుతోంది..

--నాగ్

No comments:

Post a Comment