Monday, 14 September 2015

పల్లె మండిపోతోంది..

పల్లె మండిపోతోంది..
కరువు రక్కసి కోరళ్లో..
ఊరు వల్లకాడవుతోంది..
కాలుతున్న ఎండల్లో..

బావి బావురు మంటోంది..
చెరువు గుండె చెరువైంది..
పంట నేల పగుళ్లు తీస్తే..
చిరుమొక్క వాడిపోయింది..
పచ్చగడ్డి కోసం ఆవుదూడ ఆర్తనాదం

దూరంగా గొంతెండిన కాకి అరుపు
పురుగు కోసం కొంగ వెతుకులాట
ఎండిన కాలువలో ఎలుక కోసం పాము..
వడగాలికి ఊగుతున్నమామిడి కొమ్మ

మొలక మాడిన పత్తి చేలు..
పూలు రాలిన బీర పాదులు..
ఎండి మోడైన మొక్కజొన్న
వాడి రాలిన కనకాంబరాలు


కాలువ గట్టు మీద కాపు..
గట్టు తెగిన కంటనీరు
పెట్టుబడి అంతా మట్టి పాలైతే..
పగబట్టిన తాచులా వెంటాడుతున్న అప్పు

ఆకాశంలో మబ్బు తునక లేదు..
ఏతమేయడానికి యేరులో నీరు లేదు..
పంపు మోటారు కాడ కరెంటు లేదు..
కన్నీటితో గరువు తడవదు..

పోలేరమ్మకు మొక్కినా..
బోనాలు ఎత్తినా..
పోతురాజులుకు బలులిచ్చినా..
కరువు రక్కసి శాంతించేనా..

ఘోర కలి ఇది..
నేలకొరిగిన తరువు శాపమిది..
నేలారాసిన పచ్చదనం రోదనిది..
చెట్టుకూలిన చోట వాన చుక్క రాదంతే మరి..

--నాగ్

No comments:

Post a Comment