Sunday, 13 September 2015

నువ్వు నాకు నచ్చలేదు..


అవును.. ఇది నిజం
దీపావళీ నువ్వు నాకు నచ్చలేదు
లక్షల దీప కాంతులతో..
వెలుగుల మాలలు ధరించి..
టపాసుల తాళాలతో..
మెరుపుల నవ్వులు చిందిస్తూ..
వచ్చే నువ్వు..
ఈ సారి మాత్రం నాకు నచ్చలేదు

తుపాను పుణ్యమా అని..
ఆనందాలకు చిరునామా..
మా విశాఖ. శోక సంద్రమైన వేళ..
నువ్వు మెరుపు చిమ్ముతూ రావడం..
నాకు నచ్చలే..
నవ్వుల దివ్వెలతో ఆడే చిన్నారులు..
దైన్యం నిండిన మోములతో వుంటే..
నువ్వు మతాబులా వెలిగి పోవడం...
నాకు అసలే నచ్చలే..

ధరలు మండిపోతుంటే..
తాగడానికే నీళ్లు సైతం కరువైతే..
కట్టు బట్టలతో నా జనం నిలబడితే..
నువ్వు మెరుపుల చీర సింగారించుకోవడం..
నాకు సుతరామూ నచ్చలేదు..

అందుకే.. ఓ వెలుగుల దేవతా..
నిను చూసి ఆనందించే సమయం ఇప్పుడు లేదు..
వెళ్లు.. వెళ్లి..
నా వాళ్ల మోములు వెలిగే రోజున రా..
విశాఖ విశ్వపట్టణమైన తరుణాన రా..
అప్పుడే నీకు సార్థకత్వం.. మాకు పర్వదినం
(సంతోషం లేని నాడు.. పండగా లేదు)
--నాగ్

--నాగ్
ఈ కవిత 2014 అక్టోబర్22న రాసింది.. హుదుత్ తుపానుకు నష్టపోయిన రాష్ట్రంలో పరిస్థితులు ఇవి 

ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment