Monday, 14 September 2015

కింటుకూరు.. ప్రయాణం

అతిథి మర్యాదల్లో గిరిజనులు చాలా గొప్పవారు..
పట్టణవాసం దుష్టలక్షణాలు వారికి ఇంకా సోకలేదు..
బహుశా ఇప్పటికీ ప్రకృతమ్మ ఒడిలో పసిపాపల్లా జీవిస్తున్నందువల్లనేమో..
మాయా మర్మం వారికి అంటలేదు..
రంపచోడవరం మండలం ఆకూరు పంచాయతీ శివారు గ్రామం కింటుకూరు.. ప్రయాణంలో ఈ విషయం స్పష్టమైంది..
ఈ గ్రామం చేరాలంటే.. రంపచోడవరం నుంచీ మారేడుమిల్లి వెళ్లే దారి నుంచి కచ్చారోడ్డు వైపుగా మళ్లాలి.. అక్కడి నుంచి కనీసం 20 కిలోమీటర్ల దూరం రాళ్లదారిలోనే ప్రయాణించాలి.. మధ్యహ్నాం దారిలో ఆకలి వేయడం ప్రారంభించింది. మా కన్నా ముందు వెళ్లిన వాళ్ల దగ్గరే అన్నీ వుండిపోయాయి.
మాదగ్గర తినడానికి ఏవీ లేవు. ముందు వెళ్లిన వారి వద్దే వున్నాయి అన్నీ..
కారుఈ దశలో ఇద్దరు గిరిజన యువకులు దోసకాయలు(కీరాలా వున్నాయి) తీసుకు వెళ్తున్నారు.. మాకు ప్రాణం లేచొచ్చింది. వాటిని కొనడానికి ఆ యువకులను ఆపాం.
కొండమీద పోడు వ్యవసాయంలోనే ఆనబ, దోస, బీర పాదులు వేసారట. అక్కడ నుంచి ఈ కాయలను వాళ్లు తినడానికి తెచ్చుకున్నారట.
మేము అడగగానే వాళ్ళు కాయలు కత్తితో చెక్కి కోసి మరీ పెట్టారు. డబ్బులు ఇవ్వబోతే తీసుకోలేదు. మేము ఇంకా తెచ్చుకుంటాము. పరవాలేదు తీసుకెళ్లండి అని వాళ్లు నవ్వుతూ చెప్పారు.
ఆ చెప్పడంలో తిరిగి సంపాధించగలమనే ఆత్మస్థైర్యం నాకు నచ్చింది. నిజానికి దోసకాయలు పండిస్తున్న కొండ చాలా దూరంగా వుంది.
గ్రామం చేరుకున్నాక. అక్కడ మాకోసం కింటుకూరు గ్రామస్తులు.. మటన్, నాటు కోడి కూరలతో విందు భోజనం పెట్టడానికి సిద్దంగా వున్నారు.
ఆశ్చర్యం ఏమిటంటే.. మాంసం తినని వాళ్ల కోసం బంగాళా దుంప చిక్కు పిక్కల కూర కూడా చేశారు. నేను వాళ్ల పెద్దని అడిగాను బంగాళా దుంపలు ఎక్కడివని..
మేము వస్తున్నట్టు ముందు రోజే కబురొచ్చిందట. ఆరోజే కిందికి వెళ్లి కాయగూరలు, సిస్పాజబుల్ ప్లేట్లు ఇతర సామగ్రి తెచ్చారట..
మరో ముఖ్య విషయం ఏమంటే.. మేము కొండ ఎక్కే కాలిబాట వెంబడి తుప్పలు కొట్టేసి వున్నాయి. అవి కూడా గ్రామ యువకులు శ్రమదానంతో మా దారిలో తుప్పలు, మొక్కలు అడ్డు లేకుండా కొట్టేశారు..
నిజంగా వారి అతిథి మర్యాదలు, మన పట్ల తీసుకున్న జాగ్రత్తలకు నాకు ఆశ్చర్యం, ఆనందం వేసింది..
వారి దగ్గర కంచర మేకల(పొట్టివి) పిల్లలు వున్నాయి.. నేను ముచ్చటగా వాటిని దగ్గరకు తీసుకుంటే.. వాటిలో నచ్చింది తీసుకుపొమ్మని పట్టుబట్టారు..
కానీ దాని సంరక్షణ చూడలేనని చెప్పి వద్దన్నాను..
అంత ఉదారంగా వున్నారు వారు.
అందుకే గిరిజనులయ్యారు. తరతరాల దోపిడీకి గురవుతున్నారు..
--నాగ్

No comments:

Post a Comment